క్యూ2 లాభాల్లో 135% వృద్ధి: 14% దూసుకెళ్లిన ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ షేరు

రెండో త్రైమాసికం ఫలితాలతో ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ ఇండియా షేర్లు బుధవారం బీఎస్ఈలో 14 శాతం మేర లాభపడ్డాయి. క్యూ2లో కంపెనీ నికర లాభం 135 శాతం పెరిగి రూ.79.8 కోట్లకు చేరగా, రాబడి 60.7 శాతం పెరిగింది. ఆర్డర్ బుక్ భారీగా పెరగడం, నూతన తయారీ యూనిట్ ప్రారంభానికి సిద్ధమవడం ఈ ర్యాలీకి కారణమయ్యాయి.

Published on: Oct 14, 2026, 10:06:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రముఖ విద్యుత్ పరిపరికరాల తయారీ సంస్థ ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ (ఇండియా) లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికంలో బంపర్ ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 135 శాతం పెరిగి రూ.79.8 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.33.9 కోట్లతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. కంపెనీ రాబడి, నిర్వహణ లాభాల్లో అద్భుత వృద్ధి నమోదవడంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ధర 14 శాతం మేర ఎగబాకింది.

క్యూ2 లాభాల్లో 135% వృద్ధి: 14% దూసుకెళ్లిన ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్
క్యూ2 లాభాల్లో 135% వృద్ధి: 14% దూసుకెళ్లిన ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్

రూ.739 కోట్లకు పెరిగిన ఆదాయం

కంపెనీ ఆపరేషనల్ రెవెన్యూ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 60.7 శాతం పెరిగి రూ.739.4 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఈ ఆదాయం రూ.460 కోట్లుగా ఉంది. కంపెనీ పనితీరు మెరుగుపడటానికి రూ.131.5 కోట్ల ఎక్సెప్షనల్ గెయిన్ కూడా తోడైంది. నిర్వహణ లాభం (ఈబీఐటీడీఏ) గత ఏడాది రూ.58.9 కోట్ల నుంచి రెట్టింపై రూ.128.8 కోట్లకు చేరింది. ఈబీఐటీడీఏ మార్జిన్ సైతం 12.8 శాతం నుంచి 17.4 శాతానికి విస్తరించడం కంపెనీ ఆపరేషనల్ సామర్థ్యానికి అద్దం పడుతోంది.

రూ.7,237 కోట్లకు చేరిన ఆర్డర్ బుక్

రెండో త్రైమాసికంలో కంపెనీ కొత్తగా రూ.1,169 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. ఇది గతేడాదితో పోలిస్తే 97 శాతం పెరుగుదల. 2026 సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ చేతిలో ఉన్న మొత్తం ఆర్డర్ బుక్ విలువ రూ.7,237 కోట్లకు చేరింది. ఇది రాబోయే 18 నుంచి 24 నెలల్లో పూర్తికానుంది. మరో రూ.21,000 కోట్ల విలువైన ఆర్డర్లపై చర్చలు నడుస్తున్నాయని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ఇందులో 80 శాతం దేశీయ అవకాశాలు కాగా, 20 శాతం ఎగుమతుల పరిధిలోకి వస్తాయి.

చాంగోదార్‌లోని తయారీ ప్లాంట్ విస్తరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. దీపావళి నాటికి అక్కడ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మూడు ట్రాన్స్‌ఫార్మర్ యూనిట్లపై డైనమిక్ షార్ట్-సర్క్యూట్ పరీక్షలను కంపెనీ విజయవంతంగా పూర్తి చేసింది.

న్యూక్లియర్ రంగంలోకి అడుగులు

"క్యూ2 ఫలితాలు భవిష్యత్తు వృద్ధిపై మా నమ్మకాన్ని పెంచాయి. ఆర్డర్ల ప్రవాహం, ప్లాంట్ల విస్తరణ మాకు అనుకూలంగా మారాయి" అని కంపెనీ ఎండీ, సీఈఓ సత్యన్ మమ్తోరా పేర్కొన్నారు. ఎన్‌పీసీఐఎల్ కైగా యూనిట్లు 5, 6 ప్రాజెక్టు ద్వారా అణు విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టినట్లు ఆయన తెలిపారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ), గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (గెట్కో) నుంచి ఇటీవల వచ్చిన ఆర్డర్లు కంపెనీ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనమని చెప్పారు. యూకే సబ్సిడీ ద్వారా అమెరికా, యూరప్ మార్కెట్లలోనూ వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

షేరు ధర టార్గెట్ ఎంత?

ఫలితాల ప్రభావంతో బుధవారం బీఎస్ఈలో ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ షేరు రూ.334.35 వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో రూ.355 వద్ద గరిష్ట స్థాయిని, రూ.332.10 వద్ద కనిష్ట స్థాయిని తాకింది.

"షేరు భారీ గ్యాప్-అప్‌తో ప్రారంభమై, మార్కెట్లో బలమైన కొనుగోళ్ల మద్దతు పొందింది. ఈ సానుకూల ధోరణి మున్ముందూ కొనసాగే అవకాశం ఉంది" అని మై అడ్వైజర్ ఆల్ఫా టెక్నికల్ ఎనలిస్ట్ రాజేష్ భోసలే అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్లు ఈ షేరును 3 నుంచి 4 నెలల కాలపరిమితితో హోల్డ్ చేయవచ్చని, షేరు ధర రూ.380 వరకు వెళ్లే అవకాశముందని సూచించారు. రూ.320 వద్ద దీనికి బలమైన సపోర్ట్ లభిస్తుందని పేర్కొన్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More