Trump : ‘నా కోసం గన్స్‌తో ఎదురుచూస్తున్నారు- నేను ఎంత కాలం ఉంటానో..’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసం మార్-ఎ-లాగో వద్ద భద్రతా వలయాన్ని ఛేదించేందుకు ప్రయత్నించిన ఓ సాయుధ దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చిచంపారు. ఈ ఘటనపై తొలిసారిగా స్పందించిన ట్రంప్, తన ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫ్లోరిడాలోని తన నివాసం “మార్-ఎ-లాగో”పై జరిగిన దాడి గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించారు. తన కోసం గన్స్ పట్టుకుని చాలా మంది ఎదురుచూస్తున్నారని, తాను ఇంకా ఎంతకాలం ఉంటానో తెలియడం లేదని అన్నారు.

"నేను ఎంతకాలం బతికుంటానో నాకే తెలియడం లేదు" అంటూ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.
మార్-ఎ-లాగో వద్ద సాయుధ దుండగుడి హల్చల్- ఏం జరిగింది?
ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
దుండగుడి ప్రవేశం: 21 ఏళ్ల ఆస్టిన్ టక్కర్ మార్టిన్ అనే యువకుడు సిల్వర్ కలర్ వోక్స్‌వ్యాగన్ టిగువాన్ కారులో ఎస్టేట్ ఉత్తర ద్వారం వద్దకు చేరుకున్నాడు. ఉద్యోగులు బయటకు వెళ్లేందుకు గేట్ తెరిచిన సమయంలో లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు.
కాల్పులు: నిందితుడి వద్ద షాట్‌గన్, ఇంధనం ఉన్న డబ్బా (ఫ్యూయెల్ కానిస్టర్) వంటివి ఉన్నాయి. ఇద్దరు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు. షెరీఫ్ డిప్యూటీ అతడిని అడ్డుకోగా, నిందితుడు వారిపైకి తుపాకీ గురిపెట్టాడు. దీనితో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపి అతడిని అక్కడికక్కడే మట్టుబెట్టారు.
ట్రంప్ నివాసంపై దాడికి యత్నం- ఆ సమయంలో అధ్యక్షుడు ఎక్కడ ఉన్నారు?
ఈ ఘటన జరిగిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్‌లో ఉన్నారు. కానీ ఆయన సాధారణంగా వారాంతాల్లో ఈ రిసార్ట్‌లో గడుపుతుంటారు.
ఈసారి ట్రంప్ అక్కడ లేకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
ట్రంప్ నివాసంపై దాడికి యత్నం- ఎవరీ ఆస్టిన్ టక్కర్ మార్టిన్?
మృతుడిని నార్త్ కరోలినాకు చెందిన 21 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. అతడు గతంలో గోల్ఫ్ కోర్స్ గ్రౌండ్‌కీపర్‌గా పనిచేశాడని, తుపాకులంటే భయం ఉన్న వ్యక్తి అని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఇటీవల జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన ఫైళ్లను ప్రభుత్వం హ్యాండిల్ చేస్తున్న తీరుపై అతడు తీవ్ర అసహనంతో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
ట్రంప్ స్పందన: గతాన్ని గుర్తుచేస్తూ వ్యాఖ్యలు..
తనపై జరిగిన ఈ తాజా దాడి ప్రయత్నం గురించి ట్రంప్ చమత్కారం, ఆవేదనతో కూడిన ప్రసంగం చేశారు.
చారిత్రక పోలిక: అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెన్నెడీ వంటి గొప్ప అధ్యక్షులపైనే ఇలాంటి దాడులు జరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. "ప్రపంచాన్ని ప్రభావితం చేసే అధ్యక్షులనే దుండగులు టార్గెట్ చేస్తారు. బహుశా నేను కొంత తక్కువ ప్రభావం చూపే అధ్యక్షుడిగా ఉండాలేమో," అంటూ వ్యంగ్యంగా అన్నారు.
ముప్పు పొంచి ఉంది: "నా కోసం చాలా మంది తుపాకులు గురిపెట్టి వేచి చూస్తున్నారు. నేను ఇంకా ఎంత కాలం ఉంటానో తెలియదు," అని ట్రంప్ తన భద్రతపై ఆందోళన వెలిబుచ్చారు.
ట్రంప్ నివాసంపై దాడికి యత్నం- సీక్రెట్ సర్వీస్, భద్రతా చర్యలు..
2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే ట్రంప్‌పై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. తాజా ఘటనతో మార్-ఎ-లాగో వంటి హై-ప్రొఫైల్ నివాసాల వద్ద భద్రతా ఏర్పాట్లపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ ఘటన వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

E-Paper












