అమెరికాలో కాల్పుల కలకలం! ముగ్గురికి తుపాకీ గాయాలు..

అమెరికా మెసాచుసెట్స్‌లోని కార్వర్ పట్టణంలో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. నిందితుడు తొలుత పరారైనట్లు వార్తలు వచ్చినా, చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఈ దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Published on: Jan 25, 2026, 07:26:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా మెసాచుసెట్స్​లోని ప్లైమౌత్ కౌంటీకి చెందిన కార్వర్ పట్టణంలో శనివారం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సిల్వా స్ట్రీట్‌లోని 53వ నంబర్ భవనం వద్ద ఈ కాల్పులు జరిగినట్లు సమాచారం. అగ్నిమాపక, పోలీస్, రెస్క్యూ, వాతావరణ సంబంధిత సమాచారాన్ని అందించే 'నేషనల్ ఎమర్జెన్సీ అలర్ట్స్-న్యూ ఇంగ్లాండ్' ఫేస్‌బుక్ పేజీ కథనం ప్రకారం.. ఈ ఘటనలో కనీసం ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు తెలుస్తోంది.

అమెరికాలో కాల్పుల కలకలం! (Unsplash)
అమెరికాలో కాల్పుల కలకలం! (Unsplash)

ఘటనా స్థలంలో అత్యవసర సహాయక చర్యలు..

సమాచారం అందిన వెంటనే భారీ సంఖ్యలో అంబులెన్సులు, రెండు హెలికాప్టర్లను ఘటనా స్థలానికి రప్పించారు. పోలీసుల స్కానర్ రిపోర్టులు కూడా కాల్పులు జరిగినట్లు ధృవీకరించాయి. ఒక ఫైర్ స్కానర్ నివేదికలో, "కార్వర్ మెసాచుసెట్స్‌లోని 53 సిల్వా స్ట్రీట్ (సెయింట్ జాన్స్ వద్ద) మల్టీ షూటింగ్ జరిగింది. అదనపు అంబులెన్సులు, పోలీస్ బలగాల సహాయం కావాలి," అని పేర్కొన్నారు.

కేప్ కాడ్ ప్రాంతంలోని ఘటనలను నమోదు చేసే మరో పేజీ.. "కార్వర్ పోలీసులు కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్నారు. 53 సిల్వా స్ట్రీట్ వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తుపాకీ గాయాలైనట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి," అని వెల్లడించింది.

కార్వర్ పట్టణం ప్లైమౌత్ కౌంటీలో, కేప్ కాడ్ ప్రాంతానికి సరిగ్గా పడమర దిశలో ఉంటుంది.

కాగా కార్వర్ పోలీసులు ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. గాయపడిన వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి లేదా నిందితుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

అయితే, నేషనల్ ఎమర్జెన్సీ అలర్ట్స్ సంస్థ అందించిన సమాచారం ప్రకారం.. నిందితుడు తొలుత పరారీలో ఉన్నాడని, ఆ తర్వాత అతనే స్వయంగా 911కి ఫోన్ చేసి పోలీసులకు సహకరిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ‘ఆత్మరక్షణ’ కోసం చేసిన కాల్పులేనని అతను పేర్కొన్నట్లు సమాచారం. చివరకు నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

సోషల్ మీడియాలో ప్రత్యక్ష సాక్షుల ఆవేదన..

ఘటనపై ఫేస్‌బుక్‌లో ఒక వ్యక్తి స్పందిస్తూ.. "ఈ ప్రపంచం ఎటు పోతోంది? ఈ మధ్య కాలంలో మన ఇంటికి ఇంత దగ్గరగా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. కార్వర్‌లో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ఒక్కరైనా మరణించి ఉండవచ్చు. బాధితుల సంఖ్య 3 నుంచి 5 వరకు ఉండే అవకాశం ఉంది," అని ఆందోళన వ్యక్తం చేశారు.

బాధితుల పరిస్థితి గురించి ఆయన మరిన్ని వివరాలు పంచుకుంటూ.. "ఒకరికి భుజంపై తుపాకీ గాయమైంది, వారిని రోడ్డు మార్గంలో ఆసుపత్రికి తరలించారు. మరొకరిని మెడ్‌ఫ్లైట్ (హెలికాప్టర్) ద్వారా పంపారు. మిగిలిన వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలిస్తున్నారు," అని పేర్కొన్నారు.

మరోవైపు కార్వర్‌లో జరిగిన ఈ కాల్పులపై సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. "ఇది చాలా పిచ్చి పని" అని ఒకరు వ్యాఖ్యానించగా.. "చాలా భయంగా ఉంది, కార్వర్ అంటే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పట్టణం కదా!" అని మరొకరు విస్మయం వ్యక్తం చేశారు.

దేశంలో పెరుగుతున్న హింసపై స్పందిస్తూ మరో వ్యక్తి.. "ఈ దేశం పిచ్చిదైపోతోంది. పాత రోజుల్లో ఎవరితోనైనా సమస్య ఉంటే చేతులతో తేల్చుకునేవారు. కానీ ఇప్పుడు మనుషులు ఇప్పుడు తుపాకులకే పని చెబుతున్నారు," అని తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More