గ్రీన్‌లాండ్ కోసం ట్రంప్ ఆరాటం- ఆ దేశాలపై భారీగా టారిఫ్..
గ్రీన్‌లాండ్ కొనుగోలు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఐరోపా దేశాలపై 10% సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ తాజా నిర్ణయంపై ఐరోపా దేశాలు మండిపడుతున్నాయి.
గ్రీన్‌లాండ్ కొనుగోలు వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో పెను దుమారం రేపుతోంది. అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఐరోపా దేశాలకు షాకిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్ సహా యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.

ఆయా దేశాలన్నీ అమెరికా మిత్రపక్షాలే కావడం గమనార్హం.
జూన్ 1 నాటికి 25 శాతానికి పెంపు?
గ్రీన్‌లాండ్‌ను పూర్తిగా అమెరికా పరం చేసేలా ఒప్పందం కుదరకపోతే, జూన్ 1వ తేదీ నుంచి ఈ సుంకాలను ఏకంగా 25 శాతానికి పెంచుతామని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా హెచ్చరించారు. గ్రీన్‌లాండ్ ప్రణాళికలకు మద్దతు ఇవ్వని దేశాలపై కఠినంగా ఉంటామని ఆయన ఇప్పటికే హెచ్చరించారు.
జాతీయ భద్రతే ముఖ్యం: ట్రంప్
ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న గ్రీన్‌లాండ్ అమెరికా జాతీయ భద్రతకు అత్యంత కీలకమని ట్రంప్ చాలా కాలంగా వాదిస్తున్నారు.
"గ్రీన్‌లాండ్ అమెరికా చేతుల్లోకి రాకపోవడాన్ని అంగీకరించేది లేదు. రష్యా, చైనాలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించకుండా ఉండాలంటే అమెరికా నియంత్రణ అవసరం" అని ఆయన పేర్కొన్నారు.
తీవ్రంగా స్పందించిన మాక్రాన్, స్టార్మర్..
ట్రంప్ టారిఫ్ హెచ్చరికలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ తీవ్రంగా స్పందించారు.
"ఇలాంటి టారిఫ్ బెదిరింపులు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు. ఐరోపా దేశాలన్నీ ఐక్యంగా దీనిని ఎదుర్కుంటాయి. ఉక్రెయిన్ విషయంలో కానీ, గ్రీన్‌లాండ్ విషయంలో కానీ ఎవరి బెదిరింపులకు మేము లొంగిపోము," అని మాక్రాన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తేల్చిచెప్పారు.
ఇదీ చూడండి- భారత్‌కు ట్రంప్ టారిఫ్ వార్నింగ్: రష్యా ఆయిల్ కొంటే 500% పన్ను ముప్పు
బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. "నాటో మిత్రదేశాల సామూహిక భద్రత కోసం పనిచేస్తున్న దేశాలపై సుంకాలు విధించడం పూర్తిగా తప్పు. ఈ విషయాన్ని మేము నేరుగా అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. గ్రీన్‌లాండ్ భవిష్యత్తును నిర్ణయించాల్సింది కేవలం డెన్మార్క్, గ్రీన్‌లాండ్ మాత్రమే," అని స్టార్మర్ స్పష్టం చేశారు.
ఐరోపా దేశాల ధిక్కారం..
గ్రీన్‌లాండ్ భూభాగంపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌కు మాత్రమే ఉంటుందని ఐరోపా దేశాలు తేల్చిచెప్పాయి. ఇందులో భాగంగానే డెన్మార్క్ తన మిత్రదేశాల సహకారంతో గ్రీన్‌లాండ్‌లో సైనిక ఉనికిని పెంచుతున్నట్లు ఈ వారంలో ప్రకటించింది. అయితే, ఐరోపా దేశాల సైనిక చర్యలతో తమ లక్ష్యం మారబోదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇది ఐరోపా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని ఫ్రాన్స్ సాయుధ దళాల మంత్రి అలిస్ రుఫో అభివర్ణించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


