ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట: పోలీసు విచారణ తర్వాత నేడే విడుదల
నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్టయిన తమిళనాడు మాజీ ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను రిమాండ్‌కు తరలించే ఉద్దేశం లేదని, విచారణ అనంతరం నేడే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేస్తామని ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు తెలిపింది.
తంజావూరులో జరిగిన కావేరీ నిరసన సభలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు చెన్నై నీలాంగరైలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించడం, అభ్యంతరకర పదజాలం వాడటం వంటి పలు తీవ్రమైన సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ఉదయనిధి అరెస్ట్ వార్త తెలియగానే డీఎంకే తరఫు న్యాయవాదులు మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టులో ప్రభుత్వ వాదన.. బెయిల్ పిటిషన్ ముగింపు
జస్టిస్ జి.కె. ఇళంతిరైయాన్ బెంచ్ ఎదుట ఈ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ వాదనలు వినిపిస్తూ.. ఉదయనిధి స్టాలిన్‌ను రిమాండ్‌కు పంపే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
"ప్రతిపక్ష నాయకుడిని ఇప్పటికే అరెస్ట్ చేశాం. అయితే విచారణ పూర్తయిన తర్వాత ఆయనను రిమాండ్‌కు తరలించే ఉద్దేశం మాకు లేదు. నేడే ఆయనను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేస్తాం" అని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ వివరించారు.
పోలీసు దర్యాప్తుకు ఉదయనిధి పూర్తిస్థాయిలో సహకరించాలని ప్రభుత్వం కోరింది. అడ్వకేట్ జనరల్ తెలిపిన వివరాలను రికార్డుల్లోకి తీసుకున్న హైకోర్టు, ఉదయనిధి బెయిల్ పిటిషన్‌పై విచారణను ముగించింది.
కేసు నమోదుకు దారితీసిన వివాదం ఏమిటి?
కావేరీ నదీ జలాల నిరసన సభలో ఉదయనిధి మాట్లాడుతుండగా, సభలోని కొందరు 'త్రిష.. త్రిష' అని నినాదాలు చేశారు. దీనికి స్పందించిన ఉదయనిధి "నీళ్లు వేరే ఎక్కడికీ చేరినా చేరకపోయినా, అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలి" అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తాను కావేరీ నీళ్ల గురించే మాట్లాడానని చెప్పినప్పటికీ, ఆయన వ్యాఖ్యలు డబుల్ మీనింగ్ కలిగి ఉన్నాయని, నటి త్రిషను అవమానించేలా ఉన్నాయని పోలీసులు కేసు నమోదు చేశారు.
భారతీయ న్యాయ సంహిత (BNS) కింద నేరపూరిత కుట్ర (సెక్షన్ 61), అల్లర్లకు రెచ్చగొట్టడం (సెక్షన్ 192, 196), నేరపూరిత బెదిరింపు (సెక్షన్ 351), మహిళ గౌరవానికి భంగం కలిగించడం (సెక్షన్ 79, 296b)లతో పాటు తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టం, ఐటీ చట్టం (సెక్షన్ 67) కింద కేసులు నమోదు చేశారు.
ఉదయనిధి స్టాలిన్ స్పందన
పోలీసులు తనను తీసుకెళ్తున్న సమయంలో ఉదయనిధి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. "నేను ముఖ్యమంత్రి పేరు తప్ప వేరే ఎవరి పేరైనా ప్రస్తావించానా? మరి ఎందుకు ఇదంతా జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఏదైనా కోర్టులోనే తేల్చుకుందాం" అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.
ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని, ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వ పనితీరును ఉద్దేశించినవే తప్ప ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా ఉద్దేశించినవి కావని డీఎంకే స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


