UGC NET 2026 : పీహెచ్‌డీ ప్రవేశాల కోసం యూజీసీ నెట్ స్కోరు సరిపోతుందా? రూల్స్ ఇవి..
యూజీసీ నెట్ జూన్ 2026 ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అర్హత సాధించిన అభ్యర్థులకు పీహెచ్‌డీ ప్రవేశాలపై కీలక అవకాశాలు లభించనున్నాయి. నెట్ స్కోర్‌ను ఏ కేటగిరీ కింద ఎలా ఉపయోగించుకోవచ్చో, వర్సిటీల అడ్మిషన్ల ప్రక్రియ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలతో పాటు పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించిన యూజీసీ నెట్ జూన్ 2026 ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించిన ఈ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రస్తుతం పీహెచ్‌డీ అడ్మిషన్ల ప్రక్రియపై దృష్టి సారించారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ నెట్ స్కోర్ ఏ విధంగా ఉపయోగపడుతుందో స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం అత్యవసరం.

ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మూడు కేటగిరీలుగా వర్గీకరణ..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వారిని మూడు ప్రధాన కేటగిరీలుగా వర్గీకరించింది:
కేటగిరీ 1: ఈ కేటగిరీ కింద అర్హత సాధించిన అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు, పీహెచ్‌డీ అడ్మిషన్లు.. మూడింటికీ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
కేటగిరీ 2: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, పీహెచ్‌డీ ప్రవేశాలకు మాత్రమే అర్హత లభిస్తుంది. జెఆర్‌ఎఫ్ ఫెలోషిప్ దక్కదు.
కేటగిరీ 3: కేవలం పీహెచ్‌డీ అడ్మిషన్లకు మాత్రమే ఈ స్కోర్ ఉపయోగపడుతుంది.
పీహెచ్‌డీ అడ్మిషన్ల ఎంపిక విధానం..
కేటగిరీ 2, కేటగిరీ 3 కింద అర్హత సాధించిన అభ్యర్థులకు విడివిడిగా వర్సిటీలు ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా యూజీసీ నెట్ స్కోరునే ఎంట్రన్స్ మార్కులుగా పరిగణిస్తాయి. ఎంపిక ప్రక్రియలో నెట్ స్కోర్‌కు 70 శాతం వెయిటేజీ, సంబంధిత విశ్వవిద్యాలయం నిర్వహించే ఇంటర్వ్యూ లేదా వైవా వోస్‌కు 30 శాతం వెయిటేజీ కేటాయిస్తారు. ఈ రెండింటి మార్కులను కలిపి తుది మెరిట్ జాబితా ఆధారంగా సీట్లను ఖరారు చేస్తారు.
అడ్మిషన్ గ్యారెంటీ కాదు.. జాగ్రత్తలు తప్పనిసరి..
యూజీసీ నెట్ అర్హత సాధించినంత మాత్రాన నేరుగా పీహెచ్‌డీ సీటు ఖాయమైనట్లు కాదని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. నెట్ స్కోర్‌కార్డ్ సాధించిన వారు తమకు కావాల్సిన సబ్జెక్టులో పీహెచ్‌డీ కోర్సులు ఆఫర్ చేస్తున్న విశ్వవిద్యాలయాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా వర్సిటీల అర్హత ప్రమాణాలు, ఖాళీగా ఉన్న సీట్ల సంఖ్య, రీసెర్చ్ విభాగాలు, దరఖాస్తు గడువు, ఇంటర్వ్యూ తేదీల నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.
స్కోర్‌కార్డ్ వ్యాలిడిటీ ఎంతకాలం?
కేటగిరీ 2, కేటగిరీ 3 అభ్యర్థులకు పీహెచ్‌డీ అడ్మిషన్ కోసం యూజీసీ నెట్ మార్కుల చెల్లుబాటు ఫలితాలు విడుదలైన తేదీ నుంచి సరిగ్గా ఒక సంవత్సరం పాటు మాత్రమే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఆలస్యం చేయకుండా తమ నెట్ స్కోర్‌కార్డ్‌లో పేర్కొన్న కేటగిరీని నిశితంగా సరిచూసుకుని, విశ్వవిద్యాలయాల నోటిఫికేషన్లకు సిద్ధమవ్వడం శ్రేయస్కరం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


