UGC NET December 2026 : యూజీసీ నెట్ డిసెంబర్ పరీక్షపై బిగ్ అప్డేట్- రిజిస్ట్రేషన్‌కు ఇంకొన్ని గంటలే ఛాన్స్..
యూజీసీ నెట్ డిసెంబర్ 2026 పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తు గడువు అక్టోబర్ 31 రాత్రి 11:50 గంటలతో ముగియనుంది. ఇప్పటివరకు 9.60 లక్షల మందికి పైగా అభ్యర్థులు నమోదు చేసుకోగా, ఫీజు చెల్లింపు, దరఖాస్తుల పూర్తి విధానం వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు సాధించాలన్నా, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) ద్వారా పరిశోధనలు చేయాలన్నా అత్యంత కీలకమైన 'యూజీసీ నెట్' (డిసెంబర్ 2026) పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు చివరి దశకు చేరుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించిన సవరించిన షెడ్యూల్ ప్రకారం నేడు.. అంటే అక్టోబర్ 31, 2026 రాత్రి 11:50 గంటల వరకు మాత్రమే ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు, పరీక్షా రుసుము చెల్లింపునకు అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతీ ఏటా పీజీ పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులు ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్షకు పోటీ పడుతుంటారు. చివరి నిమిషంలో సర్వర్ రద్దీ వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, ఇంకా అప్లై చేయని అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్‌టీఏ అధికారులు సూచిస్తున్నారు.
యూజీసీ నెట్ డిసెంబర్ 2026- రికార్డు స్థాయిలో 9.60 లక్షల రిజిస్ట్రేషన్లు..
తాజా అధికారిక సమాచారం ప్రకారం.. యూజీసీ నెట్ డిసెంబర్ 2026 పరీక్ష కోసం ఇప్పటివరకు ఏకంగా 9.60 లక్షలకు పైగా అభ్యర్థులు పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. వీరిలో 7.91 లక్షల మందికి పైగా అభ్యర్థులు విజయవంతంగా పరీక్షా ఫీజును చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేశారు. అర్హులైన అభ్యర్థులందరికీ తగినంత సమయం కల్పించాలనే ఉద్దేశంతోనే ఎన్టీఏ దరఖాస్తు గడువును పొడిగించింది. పొడిగించిన ఈ వ్యవధిలో దరఖాస్తు చేసుకునే వారికి ఎలాంటి అదనపు ఆలస్య రుసుము వర్తించదు.
యూజీసీ నెట్ డిసెంబర్ 2026- ముఖ్యమైన తేదీలు..
యూజీసీ నెట్ డిసెంబర్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2026 (రాత్రి 11:50 గంటల వరకు)
పరీక్ష ఫీజు చెల్లించడానికి ఆఖరు సమయం: అక్టోబర్ 31, 2026 (రాత్రి 11:50 గంటల వరకు)
ఆలస్య రుసుముతో అప్లికేషన్‌కు చివరి తేదీ : ఏదీ లేదు
యూజీసీ నెట్ డిసెంబర్ 2026 ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేసే విధానం..
యూజీసీ నెట్ డిసెంబర్ 2026 దరఖాస్తు ప్రక్రియను ఇంకా పూర్తి చేయని అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ అనుసరించవచ్చు:
- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in ను సందర్శించండి.
- హోమ్‌పేజీలో కనిపించే 'UGC NET December 2026 Application' లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వండి. (కొత్త వారైతే New Registration పూర్తి చేయాలి).
- దరఖాస్తు ఫారమ్‌లో విద్యా అర్హతలు, వ్యక్తిగత వివరాలను జాగ్రత్తగా నమోదు చేసి, అవసరమైన పత్రాలను నిర్దేశిత పరిమాణంలో అప్‌లోడ్ చేయండి.
- క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా పరీక్ష రుసుమును చెల్లించండి.
- ఫీజు చెల్లింపు పూర్తయిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ కాపీని భద్రపరుచుకోండి.
ముఖ్య గమనిక: కేవలం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన దరఖాస్తు పూర్తయినట్లు కాదు. పరీక్షా ఫీజు విజయవంతంగా జమ అయి, సిస్టమ్ నుంచి 'కన్ఫర్మేషన్ పేజీ' జెనరేట్ అయినప్పుడు మాత్రమే మీ దరఖాస్తును ఎన్‌టీఏ ఆమోదిస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


