యూకే వీసా నిబంధనల్లో మార్పులు: 2027 నుంచి కొత్త రూల్స్ ఇవే
బ్రిటన్‌లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, స్కిల్డ్ వర్కర్లకు యూకే ప్రభుత్వం తీపి కబురుతో పాటు కీలక మార్పులను ప్రకటించింది. 2027 నుంచి అమల్లోకి రానున్న నూతన వీసా విధానం, వేతన పరిమితులు, గ్రాడ్యుయేట్ వీసా పొడిగింపునకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఉన్నత నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులు, విద్యార్థులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా బ్రిటన్ ప్రభుత్వం వీసా నిబంధనల్లో పలు కీలక మార్పులను ప్రకటించింది. 2027 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానాల్లో స్కిల్డ్ వర్కర్ల కనీస వేతన పరిమితులు, హై పొటెన్షియల్ ఇండివిడ్యువల్ (హెచ్పీఐ) వీసా విస్తరణ, గ్రాడ్యుయేట్ వీసా కాలపరిమితి పొడిగింపు వంటివి ఉన్నాయి.

అక్టోబర్ 28న హెచ్ఎమ్ ట్రెజరీ సమర్పించిన యూకే బడ్జెట్ 2026లో ఈ ప్రతిపాదనలను పొందుపరిచారు. తక్కువ, మోస్తరు నైపుణ్యం కలిగిన వలసలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తూనే.. నిపుణులైన విదేశీ ఉద్యోగులకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలనేది బ్రిటన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం బ్రిటన్‌లో ఉద్యోగాలు పొందే విదేశీయులు, అంతర్జాతీయ విద్యార్థులు, ఉద్యోగం కోల్పోయిన స్పాన్సర్డ్ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.
స్కిల్డ్ వర్కర్ల వేతన పరిమితుల్లో మార్పులు
2027 స్ప్రింగ్ (వసంతకాలం) నుంచి స్కిల్డ్ వర్కర్ వీసా మార్గంలో వృత్తి-నిర్దిష్ట కనీస వేతన పరిమితుల్లో మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న మీడియన్ వేతనానికి బదులుగా, 25వ పర్సంటైల్ (25th percentile) ప్రాతిపదికన ఈ వేతనాలను నిర్ధారించనున్నారు. 2026 వేతన డేటాను ఆధారంగా చేసుకుని సాధారణ వేతన పరిమితిని కూడా నవీకరిస్తారు. మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ (ఎమ్ఏసీ) ఇచ్చిన సిఫార్సుల మేరకు బ్రిటన్ కార్మిక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సంస్కరణల ద్వారా వేతన మినహాయింపుల విధానాన్ని సరళీకృతం చేస్తున్నారు. విద్యార్థులు, ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు, వృత్తిపరమైన శిక్షణ పొందుతున్న వారికి ఇస్తున్న వేర్వేరు రాయితీలను రద్దు చేసి, 'న్యూ ఎంట్రంట్' (New Entrant) పేరుతో ఒకే మినహాయింపును తీసుకొస్తున్నారు. పీహెచ్డీ అర్హత కలిగిన వారికి ఇప్పటివరకు లభిస్తున్న ప్రత్యేక వేతన రాయితీని పూర్తిగా తొలగించనున్నారు. తుది వేతన గణాంకాలు, ఇతర అమలు వివరాలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించనుంది.
టాప్ 150 వర్సిటీ విద్యార్థులకు హెచ్పీఐ వీసా
విదేశాల నుంచి అత్యంత ప్రతిభావంతులైన యువతను ఆకర్షించేందుకు 'హై పొటెన్షియల్ ఇండివిడ్యువల్' (హెచ్పీఐ) వీసా పరిధిని విస్తరిస్తున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ 150 విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ పొందిన వారికి ఈ వీసా పొందే అవకాశం కల్పిస్తున్నారు. దానికి అనుగుణంగా ఈ వీసాల మొత్తం పరిమితిని కూడా పెంచనున్నారు. అర్హత సాధించే వర్సిటీల జాబితా, సవరించిన వీసా కోటా వివరాలను త్వరలో విడుదల చేయనున్నారు.
గ్రాడ్యుయేట్ వీసా కాలపరిమితి పొడిగింపు
2027 జనవరి 1 నుంచి దరఖాస్తు చేసుకునే సాధారణ విద్యార్థులకు గ్రాడ్యుయేట్ వీసా (పోస్ట్ స్టడీ వర్క్ వీసా) వ్యవధిని 18 నెలలకు తగ్గిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఉన్నత ప్రమాణాలు, నిబంధనలు పాటించే (High-compliance) విశ్వవిద్యాలయాల్లో చదివి, మంచి ఉద్యోగ అవకాశాలు సాధించిన విద్యార్థులకు రెండు సంవత్సరాల గ్రాడ్యుయేట్ వీసా సదుపాయం లభిస్తుంది. ఈ అర్హత కలిగిన విద్యాసంస్థల ప్రమాణాలు, వివరాలను బ్రిటన్ ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.
ఉద్యోగం కోల్పోయిన వర్కర్లకు 6 నెలల గడువు
ఉద్యోగం కోల్పోయిన నైపుణ్యం కలిగిన విదేశీ వర్కర్లకు ఊరట కలిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న గడువు ముగిసిన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా, మరొక స్పాన్సర్‌ను వెతుక్కునేందుకు 6 నెలల సమయం (Curtailment Period) ఇచ్చే ప్రతిపాదనపై పనిచేస్తోంది. 2027 నాటికి ఈ విధానాన్ని పట్టాలెక్కించాలని యోచిస్తోంది.
గ్లోబల్ టాలెంట్ వీసా విస్తరణ
2027 స్ప్రింగ్ నాటికి గ్లోబల్ టాలెంట్ వీసా పరిధిలోని ఎండార్స్‌డ్ ఫండర్ మార్గాన్ని మరింత విస్తరించనున్నారు. బ్రిటన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ (యూకేఆర్ఐ) ప్రాంతీయ సంస్థలతో కలిసి పనిచేస్తూ, పరిశోధన రంగానికి ప్రాధాన్యమిచ్చే కంపెనీలను గుర్తించి, అంతర్జాతీయ నైపుణ్యాలను ఆకర్షించేందుకు వీలుగా స్పాన్సర్షిప్ సౌకర్యాన్ని కల్పించనుంది.
ఈ వీసా సవరణలకు సంబంధించిన పూర్తి సమయపట్టికను బడ్జెట్లో వెల్లడించలేదు. రాబోయే రోజుల్లో శాఖలవారీగా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


