బ్రిటన్ సంచలన నిర్ణయం: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై పూర్తి నిషేధం
యునైటెడ్ కింగ్‌డమ్ (U.K.) ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లల కోసం సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. హానికరమైన కంటెంట్, అల్గారిథమ్‌ల నుండి యువతను రక్షించే లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకురానున్నారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా దేశాల తర్వాత ఈ తరహా నిర్ణయం తీసుకున్న దేశంగా బ్రిటన్ నిలిచింది.
చిన్నారులు, టీనేజర్లలో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనానికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు సిద్ధమైంది. 16 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించకుండా నిషేధించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలపై ఒత్తిడిని మరింత పెంచనుంది.

నిషేధం పరిధిలోకి వచ్చే సేవలు
బ్రిటన్ ప్రభుత్వం కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం మరికొన్ని కఠిన నిబంధనలను కూడా ప్రతిపాదించింది.
లైవ్‌స్ట్రీమింగ్ & కమ్యూనికేషన్స్: సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ గేమింగ్ సైట్లలో కూడా తెలియని వ్యక్తులతో మాట్లాడటం, లైవ్‌స్ట్రీమింగ్ చేయడాన్ని 16 ఏళ్ల లోపు పిల్లలకు నిరోధిస్తారు. 16, 17 ఏళ్ల వయసు వారికి ఈ ఆంక్షలు బై-డిఫాల్ట్ (Active by default)గా వర్తిస్తాయి.
నైట్ కర్ఫ్యూ (Overnight Curfews): 18 ఏళ్ల లోపు యువత రాత్రి వేళల్లో కంటెంట్ స్క్రోలింగ్ చేయకుండా ప్రత్యేక 'Overnight Curfews' విధించేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఏఐ చాట్‌బాట్స్‌పై ఆంక్షలు: శృంగార లేదా లైంగిక సంబంధాలను అనుకరించే కృత్రిమ మేధస్సు (AI) చాట్‌బాట్‌లను 18 ఏళ్ల లోపు వారు యాక్సెస్ చేయకుండా కఠినమైన ఆంక్షలు విధిస్తారు.
టార్గెట్ ప్లాట్‌ఫారమ్‌లు ఇవే
ఆస్ట్రేలియా నమూనాను అనుసరిస్తూ బ్రిటన్ ఈ నిషేధాన్ని అమలు చేయనుంది. యూజర్లు కంటెంట్ పోస్ట్ చేసే వీలుండి, వ్యసనపరుడైన అల్గారిథమ్‌లు కలిగి ఉండే టిక్‌టాక్ (TikTok), ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ఫేస్‌బుక్ (Facebook), స్నాప్‌చాట్ (Snapchat), యూట్యూబ్ (YouTube), ఎక్స్ (X - ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఈ నిషేధం అమలవుతుంది. అయితే, వాట్సాప్ (WhatsApp), సిగ్నల్ (Signal) వంటి పర్సనల్ మెసేజింగ్ యాప్‌లకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఇచ్చారు. ఈ నిబంధనలు వచ్చే ఏడాది (2027) వసంతకాలం (Spring) నాటికి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
బ్రిటన్ ప్రధాని తీవ్ర హెచ్చరిక
టెక్ కంపెనీల బాధ్యతారాహిత్యంపై బ్రిటన్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ తీవ్రంగా స్పందించారు. “మేం లక్ష్మణ రేఖ గీశాము. టెక్ దిగ్గజాలకు తమను తాము మార్చుకోవడానికి తగినంత సమయం ఇచ్చాం. కానీ వారు విఫలమయ్యారు. ఇప్పుడు మా పిల్లలను రక్షించడానికి, తల్లిదండ్రులకు మద్దతుగా నిలవడానికి, భవిష్యత్తు తరాల కోసం ఒక కొత్త ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి మేమే నేరుగా రంగంలోకి దిగుతున్నాం” అని పేర్కొన్నారు.
యాపిల్ (Apple), గూగుల్ (Google) వంటి కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లలో పిల్లలకు నగ్న చిత్రాలు (Nude images) కనిపించకుండా బ్లాక్ చేసే ఫీచర్లను యాక్టివేట్ చేయాలని వారం క్రితమే ప్రధాని మూడు నెలల డెడ్‌లైన్ విధించారు. ఒకవేళ విఫలమైతే భారీ జరిమానాలతో పాటు కంపెనీల బాస్ లపై క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
టెక్ కంపెనీల వాదన
ఈ గ్లోబల్ నిషేధాలపై టెక్ కంపెనీల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూట్యూబ్ ప్రతినిధి స్పందిస్తూ.. "మేము గత దశాబ్ద కాలంగా టీనేజర్ల వయస్సుకు తగ్గ భద్రతా ఫీచర్లపై భారీగా పెట్టుబడి పెట్టాం. ఇలాంటి పూర్తి స్థాయి నిషేధాలు విధించడం వల్ల పిల్లలు సురక్షితమైన ప్లాట్‌ఫారమ్‌లను వదిలేసి, పర్యవేక్షణ లేని అనామక (Anonymous), ప్రమాదకరమైన ఇతర సైట్ల వైపు వెళ్లే ప్రమాదం ఉంది" అని పేర్కొన్నారు. టిక్‌టాక్, మెటా, ఎక్స్ కంపెనీలు దీనిపై ఇంకా స్పందించలేదు.
అంతర్జాతీయంగా మారుతున్న ట్రెండ్
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సీరియస్‌గా ఉన్నాయి.
ఆస్ట్రేలియా: 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను నిషేధించిన ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచింది.
ఇండోనేషియా: ఇటీవల 16 ఏళ్ల లోపు పిల్లలపై ఆంక్షలు విధించడం ప్రారంభించింది.
అమెరికా (ఫ్లోరిడా): 14 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధ చట్టాన్ని అమలు చేస్తోంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


