ఇక ఇదే నా జీవితం: బెయిల్ నిరాకరణ తర్వాత ఉమర్ ఖలీద్ భావోద్వేగ వ్యాఖ్యలు

ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ నిరాకరించడంతో, "ఇక ఇదే నా జీవితం" అంటూ ఆయన తన భాగస్వామితో వ్యాఖ్యానించాడు. ఇదే కేసులో మరో ఐదుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Published on: Jan 5, 2026, 15:53:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2020 ఢిల్లీ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర జరిపాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్‌కు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. జనవరి 5న జరిగిన విచారణలో ఆయనకు, మరో నిందితుడు షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ ఇచ్చేందుకు ధర్మసనం నిరాకరించింది. అయితే, ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురికి మాత్రం కోర్టు ఊరటనిస్తూ బెయిల్ మంజూరు చేసింది.

ఇక ఇదే నా జీవితం: బెయిల్ నిరాకరణ తర్వాత ఉమర్ ఖలీద్ భావోద్వేగ వ్యాఖ్యలు (PTI File Photo)
ఇక ఇదే నా జీవితం: బెయిల్ నిరాకరణ తర్వాత ఉమర్ ఖలీద్ భావోద్వేగ వ్యాఖ్యలు (PTI File Photo)

"జైలే నా ప్రపంచం"

కోర్టు తీర్పు వెలువడిన తర్వాత తనను కలిసిన భాగస్వామి బానోజ్యోత్స్న లాహిరితో ఉమర్ ఖలీద్ తన ఆవేదనను పంచుకున్నాడు. ఈ విషయాన్ని ఆమె 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తెలియజేశారు. తనతో పాటు జైల్లో ఉన్న మరో ఐదుగురికి బెయిల్ రావడంపై ఖలీద్ సంతోషం వ్యక్తం చేస్తూనే, తన పరిస్థితిపై నిరాశ చెందాడు.

"మిగతా వారికి బెయిల్ రావడం నాకు చాలా సంతోషంగా, ఊరటగా ఉంది" అని ఆయన పేర్కొన్నట్లు లాహిరి తెలిపారు. మంగళవారం జైలుకు వచ్చి కలుస్తానని ఆమె చెప్పగా.. ఖలీద్ స్పందిస్తూ, "తప్పకుండా రా.. ఇక ఇదే నా జీవితం (అబ్ యహీ జిందగీ హై)" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఐదేళ్లుగా జైల్లోనే మగ్గుతున్న అతడి మాటల్లో తీవ్రమైన నైరాశ్యం కనిపించింది.

కోర్టు ఏమన్నదంటే?

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద నమోదైన అభియోగాలు ప్రాథమికంగా నిజమని నమ్ముతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

విచారణలో జాప్యం: విచారణ ప్రారంభం కావడంలో జరుగుతున్న ఆలస్యాన్ని బెయిల్ ఇవ్వడానికి 'ట్రంప్ కార్డు'గా పరిగణించలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

బెయిల్ పొందిన వారు: గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఆవేదనలో తండ్రి..

కోర్టు తీర్పుపై ఉమర్ ఖలీద్ తండ్రి సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఇది చాలా దురదృష్టకరం. తీర్పు వచ్చేసింది, దీనిపై నేనేమీ మాట్లాడదలచుకోలేదు" అంటూ క్లుప్తంగా స్పందించారు.

2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లకు ఉమర్ ఖలీద్ మాస్టర్ మైండ్ అని పోలీసులు ఆరోపిస్తుండగా, అతడు మొదటి నుంచీ ఆ ఆరోపణలను తోసిపుచ్చుతున్నాడు. ఈ కేసులో ఉమర్ ఖలీద్ ఐదేళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నా, కేసు విచారణ ఇంకా మొదలుకాలేదు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More