ఉమర్​ ఖలీద్​కి షాక్​! బెయిల్​ మంజూరు చేయని సుప్రీంకోర్టు..

దిల్లీ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఉమర్​ ఖలీద్​, షర్జీల్​ ఇమామ్​లకు షాక్​! వీరికి సుప్రీంకోర్టు బెయిల్​ మంజూరు చేయలేదు. ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురికి మాత్రం కోర్టు బెయిల్​ ఇచ్చింది.

Published on: Jan 5, 2026, 11:18:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2020 దిల్లీ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఉమర్​ ఖలీద్​, షర్జీల్​ ఇమామ్​లకు గట్టి షాక్​ తగిలింది. వీరికి బెయిల్​ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్​ అరవింద్​ కుమార్​, జస్టిస్​ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం సోమవారం కీలక తీర్పును వెలువరించింది.

ఉమర్​ ఖలీద్​- షర్జీల్​ ఇమామ్​..
ఉమర్​ ఖలీద్​- షర్జీల్​ ఇమామ్​..

ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురికి బెయిల్​ మంజూరు చేసినప్పటికీ.. ఉమర్​ ఖలీద్​, షర్జీల్​ ఇమామ్​లపై ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని అందుకే వీరికి మాత్రం బెయిల్​ నిరాకరిస్తున్నట్టు సుప్రీంకోర్టు వివరించింది.

“కేసులో ఉమర్​ ఖలీద్​, షర్జీల్​ ఇమామ్​ల పాత్రకు సంబంధించి ప్రాసిక్యూషన్​ ఇచ్చిన ఆధారాలతో సంతృప్తిగా ఉన్నాము. బెయిల్​ నిరాకరించడానికి అవి చాలు,” అని సర్వోన్నత న్యాస్థానం పేర్కొంది.

ఉమర్​ ఖలీద్​, షర్జీల్​ ఇమామ్​ల బెయిల్​పై సుప్రీంకోర్టు తీర్పు..

1. అందరినీ ఒకేలా చూడలేం: బెయిల్ పరిశీలన సమయంలో నిందితులందరినీ ఒకే స్థాయిలో ఉంచి చూడటం సాధ్యం కాదు. కేసులో ఒక్కొక్కరి ప్రమేయం ఒక్కోలా ఉంటుంది కాబట్టి, ఎవరికి బెయిల్ ఇవ్వాలనేది కేసులోని వారి వ్యక్తిగత పరిస్థితిపై ఆధారంగానే నిర్ణయించాలి.

2. నేరపూరిత బాధ్యతలో వ్యత్యాసం: నిందితులందరూ సమానమైన నేరపూరిత బాధ్యతను కలిగి ఉండరు. కొందరి పాత్ర తీవ్రంగా ఉంటే, మరికొందరి పాత్ర పరిమితంగా ఉండవచ్చు. కాబట్టి అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తింపజేయడం సమంజసం కాదు.

3. బాధ్యతల క్రమశ్రేణి: నేరంలో పాల్గొన్న స్థాయిని కోర్టు విశ్లేషించాలి. కుట్రలో ఎవరి పాత్ర ఎంత? నేరం అమల్లో ఎవరు ముందున్నారు? వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే బెయిల్ దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవాలి.

4. యాంత్రికంగా 'సమానత్వం' వర్తించదు: సాధారణంగా చట్టం ముందు అందరూ సమానమే అయినప్పటికీ, బెయిల్ విషయానికి వచ్చేసరికి 'ఈక్వాలిటీ' సూత్రాన్ని యాంత్రికంగా వర్తింపజేయకూడదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒకరికి బెయిల్ లభించినంత మాత్రాన, అదే కేసులోని ఇతర నిందితులకు కూడా అదే ప్రాతిపదికన బెయిల్ ఇవ్వాలన్న రూల్ ఏమీ లేదని స్పష్టం చేసింది.

5. ఆర్టికల్ 21 - వ్యక్తిగత స్వేచ్ఛ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. విచారణకు ముందే ఒక వ్యక్తిని సుదీర్ఘకాలం కస్టడీలో ఉంచాల్సి వస్తే, దానికి తగిన బలమైన కారణాలను ప్రభుత్వం చూపాల్సి ఉంటుంది.

2020 దిల్లీ అల్లర్ల కేసు..

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనలతో ఫిబ్రవరి 2020లో ఈశాన్య దిల్లీలో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో సుమారు 53 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తులు, ప్రార్థనా స్థలాలు ధ్వంసమయ్యాయి. ఈ హింస వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పేర్కొన్న పోలీసులు.. షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్ వంటి విద్యార్థి నేతలపై కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసులు నమోదు చేశారు.

2020 నాటి దిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ దాదాపు ఐదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఖలీద్ సెప్టెంబర్ 13, 2020 నుంచి కస్టడీలో ఉండగా, షర్జీల్ ఇమామ్ అల్లర్లు జరగడానికి ముందే జనవరి 28, 2020 నుంచి జైల్లో ఉన్నాడు.

ఈ కేసు విచారణను ఆలస్యం చేసేందుకు ప్రాసిక్యూషన్ ఒక్కో నిందితుడిని ఒక్కో సమయంలో అరెస్టు చేస్తూ వస్తోందని నిందితుల తరపు న్యాయవాదులు గతంలోనే ఆరోపించారు.

ముఖ్యంగా అసోంను భారత్ నుంచి వేరు చేయాలంటూ షర్జీల్ ఇమామ్ మాట్లాడిన 'చికెన్ నెక్' వీడియో, దిల్లీని స్తంభింపజేయాలన్న 'చక్కా జామ్' ప్రణాళికలను పోలీసులు కోర్టు ముందు కీలక సాక్ష్యాలుగా ఉంచారు. అలాగే, 2016లో జేఎన్‌యూలో జరిగిన నిరసనల్లో ఉమర్ ఖలీద్ వివాదాస్పద నినాదాలు చేశారని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించారు.

అప్పటి నుంచి అనేకమార్లు వీరి బెయిల్​ పిటిషన్లు రద్దు అవుతూ వచ్చాయి. ఉమర్​ ఖలీద్​, షర్జీల్​ ఇమామ్​లు అల్లర్లకు ‘ఇంటెలెక్చ్యువల్​ ఆర్కిటెక్ట్స్​’గా అభివర్ణిస్తూ సెప్టెంబర్ 2, 2025న దిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.

అనంతరం సుప్రీంకోర్టులో వీరి బెయిల్​ పిటిషన్​పై విచారణ జరిగింది.

సుప్రీంకోర్టులో నిందితుల వాదన..

డిసెంబర్ 10న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు దిల్లీ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. నిరసనలు తెలపడం లేదా ప్రసంగం చేయడం వంటి చర్యలు యూఏపీఏ సెక్షన్ 15 కింద 'ఉగ్రవాద చర్య'గా ఎలా పరిగణిస్తారని కోర్టు ప్రశ్నించింది. మరోవైపు, గంటల కొద్దీ సాగిన ప్రసంగాలు, వాట్సాప్ చాట్‌ల నుంచి కేవలం కొన్ని ముక్కలను మాత్రమే ఏరికోరి తీసుకుని తమపై తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తున్నారని నిందితుల న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న సర్వోన్నతన్యాయస్థానం ఉమర్​ ఖలీద్​ బెయిల్​ పిటిషన్​పై తీర్పును రిజర్వు చేసింది.

అంతర్జాతీయంగా మద్దతు..

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ విడుదల కోసం ఇప్పుడు అంతర్జాతీయంగానూ గళం వినిపిస్తోంది. తాజాగా న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఉమర్ ఖలీద్‌కు లేఖ రాస్తూ మద్దతు ప్రకటించారు.

"డియర్ ఉమర్.. నీ మాటలు నన్ను ఆలోచింపజేస్తుంటాయి. మేమంతా నీ గురించి ఆలోచిస్తున్నాము," అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖకు సంబంధించిన ఫోటోను ఖలీద్ భాగస్వామి బనోజ్యోత్స్న లాహిరి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More