దిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్‌కి లేఖ రాసిన జోహ్రాన్ మమ్దానీ..
దిల్లీ అల్లర్ల కేసులో జైలులో మగ్గుతున్న ఉమర్ ఖలీద్‌కు న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ సంఘీభావం తెలిపారు. ఖలీద్ తల్లిదండ్రులను కలిసి, ఆయన రాసిన లేఖను స్వయంగా అందజేశారు. మరోవైపు ఖలీద్ జైలు జీవితంపై అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
జైలులో అనేక సంవత్సరాలుగా మగ్గుతున్న సామాజిక కార్యకర్త ఉమర్ ఖలీద్‌కు ఊహించని చోటు నుంచి మద్దతు లభించింది! ఉమర్ ఖలీద్‌కి సంఘీభావం పలుకుతూ.. భారత సంతతికి చెందిన న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఒక లేఖ రాశారు.

న్యూయార్క్ నగరానికి మొట్టమొదటి ఆసియా అమెరికన్- ముస్లిం మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన 34 ఏళ్ల మమ్దానీ, 2025 డిసెంబర్‌లో అమెరికా పర్యటనకు వెళ్లిన ఉమర్ ఖలీద్ తల్లిదండ్రులకు ఈ లేఖను స్వయంగా అందజేశారు. మమ్దానీ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే (గురువారం), ఉమర్ ఖలీద్ భాగస్వామి బనోజ్యోత్స్న లాహిరి ఈ లేఖకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పంచుకున్నారు.
"ప్రియమైన ఉమర్, చేదు అనుభవాలు మనల్ని మింగేయకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో నువ్వు చెప్పిన మాటలు నాకు తరచూ గుర్తుకు వస్తుంటాయి. మీ తల్లిదండ్రులను కలవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాము," అంటూ మమ్దానీ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఉమర్ ఖలీద్ తల్లిదండ్రులు సహిబా ఖానమ్, సయ్యద్ ఖాసిమ్ రసూల్ ఇలియాస్ తమ చిన్న కుమార్తె వివాహానికి ముందు అమెరికాలో ఉంటున్న మరో కుమార్తెను కలవడానికి వెళ్లారని లాహిరి తెలిపారు. ఆ సమయంలోనే వారు మేయర్ మమ్దానీని కలిసి కొంత సమయం గడిపారు.
ఉమర్ ఖలీద్‌కి బెయిల్..
యూఏపీఏ చట్టం కింద 2020 నుంచి జైలులోనే ఉన్న ఉమర్ ఖలీద్‌కు, తన సోదరి వివాహం కోసం డిసెంబర్‌లో మధ్యంతర బెయిల్ లభించింది. బెయిల్ నిబంధనల ప్రకారం ఆయన ఇంటికే పరిమితమైనప్పటికీ, ఆ కొద్దిరోజులు కుటుంబంతో గడపడం ఉమర్ ఖలీద్‌కి ఎంతో ఊరటనిచ్చింది.
"అమ్మ చేతి వంట తింటూ, అక్కాచెల్లెళ్ల పిల్లలతో ఆడుకుంటూ ఉమర్ ఆ సమయాన్ని గడిపారు. కానీ బెయిల్ గడువు చాలా వేగంగా ముగిసిపోయింది," అని లాహిరి ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమర్ ఖలీద్ తిరిగి జైలుకు వెళ్లిపోయారు.
ఉమర్ ఖలీద్‌పై ఆరోపణలు ఏంటి?
సీఏఏ నేపథ్యంలో 2020లో దిల్లీలో మత ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 53మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ క్రమంలోనే 18 మంది విద్యార్థులు, యాక్టివిస్ట్‌లను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఉమర్ ఖలీద్ ఒకరు.
విచారణలో భాగంగా ఉమర్ ఖలీద్‌పై దేశద్రోహం, హత్య, మతాల మధ్య విద్వేషాన్ని ప్రేరేపించడం, అన్యాయపరమైన కార్యకలాపాలు, అల్లర్లకు పాల్పడటం వంటి ఆరోపణలు మోపారు. అంతేకాదు ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రకుట్రకు ఉపయోగించే అత్యంత కఠినమైన యూఏపీఏ చట్టం కింద కూడా ఉమర్ ఖలీద్‌పై కేసు నమోదు చేశారు.
అప్పటి నుంచి ఉమర్ ఖలీద్ జైలులోనే ఉంటున్నారు. డిసెంబర్‌కి ముందు, ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ అనేకమార్లు రద్దు అయ్యింది.
అమెరికా నుంచి భారత్‌కు లేఖ..
మరోవైపు, దిల్లీ అల్లర్ల కేసులో విచారణకు ముందే ఏళ్ల తరబడి జైలులో ఉంచుతున్న అంశంపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జేమ్స్ పీ మెక్‌గవర్న్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాకు ఆయన ఒక లేఖ రాశారు.
ఉమర్ ఖలీద్‌పై చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారని మెక్‌గవర్న్ తన లేఖలో గుర్తుచేశారు.
"నేరం నిరూపితమయ్యే వరకు ఎవరైనా అమాయకులే. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం భారతదేశం ప్రజల హక్కులను కాపాడాలి. విచారణను వేగంగా పూర్తి చేయాలి లేదా వారిని విడుదల చేయాలి," అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


