కెనడాలో రెండు వారాల వ్యవధిలో ఇద్దరు భారతీయ విద్యార్థుల హత్య.. ఆందోళనలో ఎన్నారైలు

కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు రక్షణ కరువవుతోంది. పక్షం రోజుల వ్యవధిలోనే ఒక పీహెచ్‌డీ విద్యార్థి షూటౌట్‌లో మరణించగా, మరో యువతి తన నివాసంలోనే దారుణ హత్యకు గురైంది. వరుస ఘటనలతో అక్కడి భారతీయ సమాజం భయాందోళనలకు గురవుతోంది.

Published on: Dec 26, 2025, 11:25:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కెనడాలో ఉంటున్న భారతీయులను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు భారతీయులు వేర్వేరు ఘటనల్లో హత్యకు గురవ్వడం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. టొరంటో పోలీసులు ఈ రెండు మరణాలకు ఒకదానితో ఒకటి సంబంధం లేదని చెబుతున్నప్పటికీ, వరుస హత్యలు అక్కడి ప్రవాస భారతీయులను కలవరపెడుతున్నాయి.

కెనడాలో రెండు వారాల వ్యవధిలో ఇద్దరు భారతీయ విద్యార్థుల హత్య.. ఆందోళనలో ఎన్నారైలు (Toronto Police website)
కెనడాలో రెండు వారాల వ్యవధిలో ఇద్దరు భారతీయ విద్యార్థుల హత్య.. ఆందోళనలో ఎన్నారైలు (Toronto Police website)

యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో పీహెచ్‌డీ విద్యార్థి కాల్చివేత

తాజా ఘటనలో, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్‌బరో క్యాంపస్ సమీపంలో శివాంక్ అవస్థి అనే భారతీయ పీహెచ్‌డీ విద్యార్థి దుండగుల కాల్పులకు బలయ్యారు. హైలాండ్ క్రీక్ ట్రైల్, ఓల్డ్ కింగ్‌స్టన్ రోడ్ ప్రాంతంలో ఈ షూటౌట్ జరిగింది. కాల్పుల శబ్దం విన్న స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే శివాంక్ తీవ్ర రక్తస్రావంతో మరణించారని టొరంటో సన్ పత్రిక వెల్లడించింది.

పోలీసులు వచ్చే లోపే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దర్యాప్తు కోసం క్యాంపస్‌ను కొంతసేపు లాక్‌డౌన్ చేయాల్సి వచ్చింది. టొరంటోలో ఈ ఏడాది జరిగిన 41వ హత్య ఇది. శివాంక్ మృతి పట్ల టొరంటోలోని భారత రాయబార కార్యాలయం (Consulate General) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుని కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

నివాసంలోనే విగతజీవిగా కనిపించిన డిజిటల్ క్రియేటర్

మరో విషాదకర ఘటనలో, హిమాన్షి ఖురానా (30) అనే భారతీయ యువతి టొరంటోలో దారుణ హత్యకు గురయ్యారు. హిమాన్షి సోషల్ మీడియాలో డిజిటల్ క్రియేటర్‌గా సుపరిచితురాలు. ఆమె అదృశ్యమైందని డిసెంబర్ 19వ తేదీ రాత్రి పోలీసులకు ఫిర్యాదు అందింది. గాలింపు చేపట్టిన అధికారులకు, మరుసటి రోజు ఉదయం (డిసెంబర్ 20) ఒక నివాసంలో ఆమె మృతదేహం లభ్యమైంది.

ఈ కేసులో పోలీసులు అబ్దుల్ గఫూరీ (32) అనే వ్యక్తిపై ఫస్ట్-డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేసి, సెర్చ్ వారెంట్ జారీ చేశారు. బాధితురాలికి, నిందితుడికి మధ్య ముందే పరిచయం ఉందని, ఈ హత్యకు 'ఇంటిమేట్ పార్టనర్ వైలెన్స్' (సన్నిహితుల మధ్య ఉండే గొడవలు) కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

భద్రతపై పెరుగుతున్న ఆందోళన

ఉన్నత చదువులు చదివి, మంచి భవిష్యత్తును వెతుక్కుందామని కెనడా వెళ్లిన విద్యార్థులు ఇలా శవమై తిరిగి రావడం కన్నవారికి తీరని శోకాన్ని మిగులుస్తోంది. వరుసగా జరుగుతున్న ఈ దాడులు కెనడాలో భారతీయుల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. నేరస్థులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రవాస సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More