నేనూ మనిషినే అని జనం మర్చిపోతున్నారు: తీహార్ జైలు నుంచి ఉమర్ ఖలీద్

ఢిల్లీ తీహార్ జైల్లో విచారణ లేకుండా ఆరేళ్లుగా మగ్గుతున్న విద్యార్థి ఉద్యమ నేత ఉమర్ ఖాలిద్ తన మానసిక ఆవేదనను పంచుకున్నారు. దేశంలో ద్వేషం, తప్పుడు ప్రచారాలు సాధారణమైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Published on: Jun 30, 2026, 17:13:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2020లో జైలుకు వెళ్లిన తర్వాత ఉమర్ ఖలీద్ ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ ఇది. జైలు నిబంధనల కారణంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల ద్వారా 'ది గార్డియన్' పత్రికకు ఆయన ఈ వివరాలు అందించారు. విచారణ లేకుండా దాదాపు ఆరేళ్లపాటు జైలు జీవితం గడపడం తన మానసిక స్థితిపై, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని ఖాలిద్ వివరించారు.

నేనూ మనిషినే అని జనం మర్చిపోతున్నారు: తీహార్ జైలు నుంచి ఉమర్ ఖలీద్ (ఫైల్ ఫోటో) (PTI)
నేనూ మనిషినే అని జనం మర్చిపోతున్నారు: తీహార్ జైలు నుంచి ఉమర్ ఖలీద్ (ఫైల్ ఫోటో) (PTI)

"నాతో కలిసి భోజనం చేసిన తోటి ఖైదీలే నా వెనుక నన్ను ఉగ్రవాది అని పిలవడం వినిపిస్తూ ఉంటుంది. ఈ దుష్ప్రచారం నన్ను సమాజం దృష్టిలో ఒక మనిషిగా కాకుండా చేస్తోంది. నాలాంటి వారికి కనీస మానవత్వం కూడా దక్కని పరిస్థితి ఉంది" అని ఉమర్ ఖలీద్ ఆవేదన వ్యక్తం చేశారు.

మనిషిగా నన్ను గుర్తించడం లేదు

ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న ఈ జేఎన్యూ మాజీ విద్యార్థి నేత, జైలు గోడల మధ్య గడిపిన కాలం గురించి మాట్లాడుతూ, తన చుట్టూ ఉన్న ప్రజల అంచనాలు తన నిజమైన గుర్తింపును దెబ్బతీశాయని చెప్పారు.

"నన్ను ఒక సానుకూల లేదా ప్రతికూల చిత్రంగా మాత్రమే చూసినప్పుడు, నా మానసిక సమతుల్యతను కాపాడుకోవడం కష్టంగా మారుతోంది. నాపై సానుభూతి చూపే వారు లేదా నన్ను గొప్పగా చూపించే వారు కూడా నేను ఒక మనిషిననే విషయాన్ని మరిచిపోతున్నారు. నాకూ భయాలు, బలహీనతలు ఉంటాయి. ఈ సుదీర్ఘ జైలు జీవితం నా శరీరాన్ని, మనస్సును తీవ్రంగా గాయపరిచింది" అని ఖలీద్ పేర్కొన్నారు.

ఆరోపణలు - రాజకీయ పరిస్థితులు

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన వ్యూహకర్తగా, ప్రభుత్వంపై హింసాత్మక తిరుగుబాటుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో ఉమర్ ఖలీద్‌ను 2020 సెప్టెంబర్‌లో ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA) కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఆరోపణలను ఖలీద్ మొదటి నుంచి తిరస్కరిస్తూనే ఉన్నారు. భారతదేశ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందని, ఈ విచారణకు రాజకీయాలతో సంబంధం లేదని అధికార బీజేపీ స్పష్టం చేస్తోంది.

జైలు జీవితం దేశ రాజకీయాలపై తన అభిప్రాయాలను మార్చలేదని ఖలీద్ చెప్పారు. దేశంలో ద్వేషపూరిత ప్రసంగాలు, నరమేధాన్ని ప్రేరేపించే వ్యాఖ్యలు సాధారణం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం 'నిజం లేని సమాజం' (Post-truth society) గా మారే ప్రక్రియ దాదాపు పూర్తయిందని వ్యాఖ్యానించారు.

'నేను ఒంటరినయ్యాను'

ఉద్యమకారుల అరెస్టులపై రాజకీయ ప్రతిపక్షాలు, పౌర సమాజం వహిస్తున్న మౌనాన్ని ఖలీద్ తప్పుపట్టారు. "ఆరేళ్ల తర్వాత నేను నిజంగా నిరాశకు గురయ్యాను, ఒంటరిగా భావిస్తున్నాను. ప్రతిపక్షాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజా ఉద్యమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీల మౌనం.. భిన్నాభిప్రాయాలు ఉన్నవారిపై మరిన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి ధైర్యాన్ని ఇస్తోంది" అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎంత కాలం జైల్లో ఉన్నా తన సిద్ధాంతాలను వదులుకోబోనని ఖలీద్ స్పష్టం చేశారు. 2019 పౌరసత్వ సవరణ చట్టం (CAA) వ్యతిరేక నిరసనల సమయంలో తాను చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. "మేము హింసకు హింసతో సమాధానం ఇవ్వం. ద్వేషానికి ద్వేషంతో బదులు తీర్చుకోం. వారు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తే, మేము దానిని ప్రేమతో ఎదుర్కొంటాం" అని పునరుద్ఘాటించారు.

తాజా బెయిల్ పిటిషన్‌పై ఆశలు

ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఉమర్ ఖలీద్ దాఖలు చేసిన తాజా బెయిల్ దరఖాస్తులపై ఢిల్లీ కోర్టు ఇటీవల పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కర్కర్దూమా కోర్టుల అదనపు సెషన్స్ జడ్జి సుమేధ్ కుమార్ సేథి ఈ పిటిషన్‌పై వాదనలను జులై 4వ తేదీకి వాయిదా వేశారు.

మారుతున్న పరిస్థితులను బట్టి తనకు బెయిల్ ఇవ్వాలని ఖలిద్ తన దరఖాస్తులో కోరారు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సయ్యద్ ఇఫ్తికార్ ఆంద్రాబీ కేసులో మే 18న సుప్రీంకోర్టు ధర్మాసనం (జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్) ఇచ్చిన తీర్పును ఆయన ఉదహరించారు.

సుదీర్ఘ కాలం జైలు శిక్ష అనుభవించడం, విచారణలో ఆలస్యం కావడం వంటి అంశాలు యూఏపీఏ చట్టంలోని సెక్షన్ 43D(5) కింద ఉన్న బెయిల్ నిబంధనలను అధిగమించవచ్చని 2021 నాటి 'యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కె.ఎ. నజీబ్' కేసులో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సూత్రాన్ని ఈ ఏడాది జనవరి 5 నాటి తీర్పులో సరిగ్గా వర్తింపజేయలేదని సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రక్షిత సాక్షుల విచారణ ముగిసిన తర్వాత లేదా ఏడాది తర్వాత మాత్రమే ఖలిద్, షర్జీల్ ఇమామ్ బెయిల్ పిటిషన్లను పునరుద్ధరించుకోవచ్చనే గత ఉత్తర్వులను కూడా అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More