పోయిన షేర్లు, రాని డివిడెండ్ల పరిష్కారానికి సెబీ ప్రత్యేక శిబిరం

పాత షేర్లు పోగొట్టుకున్నారా? ఏళ్ల తరబడి డివిడెండ్లు అందక ఇబ్బంది పడుతున్నారా? మదుపర్ల సమస్యల పరిష్కారానికి సెబీ, ఐఈపీఎఫ్ఏ సంయుక్తంగా నవంబర్ 17న ఢిల్లీలో 'నివేశక్ శిబిర్' నిర్వహిస్తున్నాయి. సేవల వివరాలు, తీసుకెళ్లాల్సిన పత్రాల సమాచారం ఇక్కడ చూడండి.

Published on: Nov 13, 2026, 15:43:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన భౌతిక షేర్ సర్టిఫికెట్లు ఇంట్లో ఎక్కడో మిస్సయిపోయి, వాటి ఆచూకీ తెలియక ఇబ్బంది పడుతున్న మదుపర్లు ఎందరో ఉన్నారు. సరైన పత్రాలు లేకపోవడం, కేవైసీ వివరాలు అప్‌డేట్ కాకపోవడంతో రావాల్సిన డివిడెండ్లు కూడా నిలిచిపోతుంటాయి. ఇలాంటి దీర్ఘకాలిక పెండింగ్ క్లెయిమ్‌లు, అన్‌క్లెయిమ్డ్ పెట్టుబడుల సమస్యలకు ఒకే వేదికపై పరిష్కారం చూపేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI), కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) సంయుక్తంగా ముందుకొచ్చాయి.

పోయిన షేర్లు, రాని డివిడెండ్ల పరిష్కారానికి సెబీ ప్రత్యేక శిబిరం (AI)
పోయిన షేర్లు, రాని డివిడెండ్ల పరిష్కారానికి సెబీ ప్రత్యేక శిబిరం (AI)

ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో నవంబర్ 17న న్యూదిల్లీలో 8వ 'నివేశక్ శిబిర్' (ఇన్వెస్టర్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్) జరగనుంది. మదుపర్ల వద్ద ఉన్న పెండింగ్ డాక్యుమెంటేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించే లక్ష్యంతో మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఎంఐఐ), రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లను (ఆర్‌టీఏ) ఈ శిబిరంలో ఒకే చోటకు తీసుకొస్తున్నారు.

ఏయే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది?

నవంబర్ 12న సెబీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, ఈ ప్రత్యేక శిబిరానికి హాజరయ్యే మదుపర్లు కింది సేవలను పొందవచ్చు.

చెల్లించని డివిడెండ్లు: నిబంధనల ప్రకారం ఏడేళ్ల పాటు క్లెయిమ్ చేయకుండా ఉండిపోయి, ఐఈపీఎఫ్ఏ ఖాతాకు బదిలీ కాకముందే నిలిచిపోయిన డివిడెండ్లను పొందేందుకు సహాయం అందిస్తారు.

కేవైసీ, నామినేషన్ అప్‌డేట్లు: కంపెనీ రికార్డులలో మదుపర్ల కేవైసీ వివరాలను సవరించుకోవడంతోపాటు కొత్తగా నామినీలను నమోదు చేసుకునే ప్రక్రియను పూర్తి చేస్తారు.

షేర్ల బదిలీ (ట్రాన్స్‌మిషన్): షేర్ హోల్డర్ మరణించిన సందర్భాల్లో, వారి చట్టపరమైన వారసులు లేదా నామినీలకు ఆ షేర్లను బదిలీ చేసే విధానంపై పూర్తి మార్గదర్శకత్వం కల్పిస్తారు.

పెండింగ్ ఐఈపీఎఫ్ఏ క్లెయిమ్‌లు: ఇప్పటికే ఐఈపీఎఫ్ఏ ఖాతాకు బదిలీ అయిన షేర్లు, డివిడెండ్లను తిరిగి పొందేందుకు దాఖలు చేసిన పెండింగ్ క్లెయిమ్‌ల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తారు.

డూప్లికేట్ షేర్ సర్టిఫికెట్లు: అసలు భౌతిక షేర్ సర్టిఫికెట్లు పోయినా, కనిపించకుండా పోయినా, పాడైపోయినా వాటి స్థానంలో డూప్లికేట్ సర్టిఫికెట్లు పొందేందుకు అవసరమైన ప్రక్రియను వివరిస్తారు.

శిబిరంలో పాల్గొనే కీలక సంస్థలు ఇవే..

ఈ మదుపర్ల అవగాహన, పరిష్కార శిబిరాన్ని నాలుగు ప్రధాన మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్నారు. ఇందులో బీఎస్ఈ, సీడీఎస్ఎల్, ఎన్ఎస్ఈ, ఎన్ఎస్‌డీఎల్ భాగస్వాములవుతున్నాయి. వీటితోపాటు కేఫిన్ టెక్నాలజీస్, ఎంయూఎఫ్‌జీ ఇన్‌టైమ్ ఇండియా, బిగ్‌షేర్ సర్వీసెస్, డేటామ్యాటిక్స్ బిజినెస్ సొల్యూషన్స్, పూర్వ షేర్‌రిజిస్ట్రీ ఇండియా వంటి ప్రముఖ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లు (ఆర్‌టీఏ) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. సాధారణంగా ఈ ఆర్‌టీఏ సంస్థలే షేర్ హోల్డర్ల రికార్డులను నిర్వహించడం, డివిడెండ్ చెల్లింపులు, షేర్ల బదిలీ, మదుపర్ల వివరాల మార్పు వంటి సేవలను పర్యవేక్షిస్తుంటాయి.

వేదిక, సమయం వివరాలు

సెబీ ప్రకటన మేరకు నవంబర్ 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుంది.

వేదిక చిరునామా: ఇండియా హ్యాబిటాట్ సెంటర్, జకరందా హాల్, ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్ సమీపంలో, లోధీ రోడ్, లోధీ ఎస్టేట్, న్యూదిల్లీ, దిల్లీ – 110003 (వర్ధమాన్ మార్గ్‌లోని గేట్ నంబర్ 3 ద్వారా లోపలికి ప్రవేశించాలి).

వెళ్లేటప్పుడు ఏ పత్రాలు తీసుకెళ్లాలి?

శిబిరంలోకి ప్రవేశించేందుకు షేర్ హోల్డర్లు లేదా వారి అధీకృత ప్రతినిధులు తప్పనిసరిగా ఏదైనా ఒక అధికారిక ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను అనుమతిస్తారు.

గుర్తింపు కార్డుతో పాటు సంబంధిత షేర్ సర్టిఫికెట్లు, డివిడెండ్ రికార్డులు, క్లెయిమ్ సంబంధిత పత్రాలను తీసుకెళ్లడం వల్ల అధికారులు మీ సమస్యను త్వరగా గుర్తించి పరిష్కరించేందుకు వీలవుతుంది. ఈ సమాచారం కేవలం మదుపర్ల అవగాహన కోసం మాత్రమేనని, శిబిరానికి వెళ్లే ముందు తాజా అప్‌డేట్ల కోసం సెబీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More