రైతులకు ఊరట: ఎరువుల సబ్సిడీ 64% పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం

2026-27 రబీ సీజన్‌కు గాను ఫాస్ఫేట్, పొటాష్ (పీఅండ్కే) ఎరువులపై సబ్సిడీని 64.3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రూ.62,370 కోట్ల సబ్సిడీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ఎరువుల ధరల భారం రైతులపై పడకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

Published on: Nov 11, 2026, 17:44:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రబీ సీజన్‌లో పంటలు సాగు చేసే రైతులకు ఎరువుల కొరత లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్ఫేట్, పొటాష్ (పీఅండ్కే) ఆధారిత ఎరువులపై అందించే సబ్సిడీ బడ్జెట్‌ను ఏకంగా 64.3 శాతం పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీని ప్రకారం రాబోయే రబీ సీజన్‌కు ఎరువుల సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ.62,370 కోట్లు కేటాయించనుంది.

రైతులకు ఊరట: ఎరువుల సబ్సిడీ 64% పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం
రైతులకు ఊరట: ఎరువుల సబ్సిడీ 64% పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం

గత రబీ సీజన్‌లో ఎరువుల సబ్సిడీ బడ్జెట్ రూ.37,952 కోట్లుగా ఉంది. ఈ సారి దానికి అదనంగా రూ.24,418 కోట్లు జత చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు, వాటి తయారీకి వాడే ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రైతులపై ఆ భారం పడకుండా ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.

పశ్చిమాసియా సంక్షోభం.. ఎగిసిపడిన ఎరువుల ధరలు

ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత అంతర్జాతీయ ఎరువుల మార్కెట్‌లో తీవ్ర వ్యత్యయాలు ఏర్పడ్డాయి. ప్రపంచ ఎరువుల రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ఓడల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో సరఫరా వ్యవస్థ దెబ్బతింది. భారతదేశం తన నైట్రోజన్ ఎరువుల దిగుమతుల్లో దాదాపు మూడింట రెండు వంతులను గల్ఫ్ ప్రాంతం నుంచే పొందుతోంది (2024 ప్రపంచ వాణిజ్య సంస్థ నివేదిక ఆధారంగా). ఈ సంక్షోభం వల్ల భారత్‌పై ప్రతికూల ప్రభావం పడింది.

యుద్ధానికి ముందు టన్ను యూరియా ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 400 డాలర్లుగా ఉండేది. కానీ ఏప్రిల్‌ నాటికి అది ఏకంగా 850 డాలర్లు దాటిపోయింది. డయామోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) ధర టన్నుకు 580 డాలర్ల నుంచి 770 డాలర్లకు చేరింది. జూన్‌లో యూరియా ధర 453 డాలర్లకు తగ్గినప్పటికీ, ఫాస్ఫేట్ ఆధారిత ఎరువుల సంక్షోభం కొనసాగుతూనే వచ్చింది. సెప్టెంబర్‌లో ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. సల్ఫర్ కొరత కారణంగా ఫాస్ఫేట్ ఎరువుల లభ్యత తగ్గి ధరలు అధికంగానే ఉన్నాయి. నైట్రోజన్ ఎరువుల మార్కెట్ మాత్రం యుద్ధానికి ముందు నాటి పరిస్థితులకు చేరువవుతోంది.

అక్టోబర్ 1 నుంచి మార్చి 31 వరకు నూతన రేట్లు

రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు 2010 ఏప్రిల్ నుంచి ప్రభుత్వం 'న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ' (NBS) పథకాన్ని అమలు చేస్తోంది. దీనికింద డీఏపీ, ఎన్‌పీకేఎస్ సహా 28 రకాల పీఅండ్కే ఎరువులకు సబ్సిడీ అందిస్తున్నారు. ఎరువుల్లో ఉండే పోషకాల ఆధారంగా ఈ సబ్సిడీ ధరలను ప్రభుత్వం కాలానుగుణంగా సవరిస్తుంటుంది.

ఈ క్రమంలో అక్టోబర్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు వర్తించేలా నూతన ఎన్బీఎస్ రేట్లకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ సబ్సిడీ సొమ్మును నేరుగా ఎరువుల తయారీ కంపెనీలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. తద్వారా రైతులకు అందుబాటు ధరలోనే ఎరువులు లభిస్తాయి.

గత సీజన్ సబ్సిడీ రేట్లు ఇవే..

గత రబీ సీజన్‌లో కిలో పోషకానికి అందించిన సబ్సిడీ వివరాలను పరిశీలిస్తే.. నైట్రోజన్‌కు రూ.43.02, ఫాస్ఫేట్‌కు రూ.47.96, పొటాష్‌కు రూ.2.38, సల్ఫర్‌కు రూ.2.87 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల రీత్యా పెరిగిన ధరల భారాన్ని ప్రభుత్వం తానే భరిస్తూ రైతులకు ఊరట కలిగిస్తోంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More