Bajaj Pulsar RS200 : కొత్త హంగులతో బజాజ్ పల్సర్ ఆర్​ఎస్200 లాంచ్- ధర, అదిరిపోయే ఫీచర్లు ఇవి..

భారత మార్కెట్లో పల్సర్ 25ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని బజాజ్ ఆటో అప్డేటెడ్ 'పల్సర్ ఆర్​ఎస్200' బైక్‌ను విడుదల చేసింది. ఈ స్పోర్ట్స్ బైక్‌లో 5-అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్, ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్, పెరిగిన ఇంజిన్ పవర్ వంటి కీలక మార్పులు చేశారు. ఆ వివరాలు..

Published on: Nov 21, 2026, 12:20:36 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

యువత కలల స్పోర్ట్స్ బైక్ ‘బజాజ్ పల్సర్ ఆర్​ఎస్200’ సరికొత్త అవతారంలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది! అధునాతన టెక్నాలజీ, మెరుగైన హార్డ్‌వేర్ హంగులతో తీర్చిదిద్దిన ఈ అప్డేటెడ్ మోడల్‌ను బజాజ్ ఆటో రూ. 1,98,441 (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది. సరికొత్త 5-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఎలక్ట్రానిక్ థ్రాటిల్ కంట్రోల్, మల్టిపుల్ రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లను ఈ బైక్‌లో జోడించారు. దీనితో పాటు సస్పెన్షన్ వ్యవస్థను ఆధునీకరించి, వెనుక భాగంలో రేడియల్ టైర్‌ను అమర్చారు. ఇంజిన్ సామర్థ్యాన్ని కూడా పెంచడంతో, గతంలో 24.5 పీఎస్​గా ఉన్న పవర్ అవుట్‌పుట్ ఇప్పుడు 25.5 పీఎస్​కు చేరుకుంది.

అప్డెటెడ్ బజాజ్ పల్సర్ ఆర్​ఎస్200..
అప్డెటెడ్ బజాజ్ పల్సర్ ఆర్​ఎస్200..

ఇప్పటివరకు ఆధునిక ఫీచర్లు లేవనే లోటును భర్తీ చేస్తూ, 25 ఏళ్ల పల్సర్ వేడుకల వేళ బజాజ్ ఈ కీలక అప్‌డేట్ తీసుకురావడం బైక్ ప్రియుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

అప్డేటెడ్ బజాజ్ పల్సర్ ఆర్​ఎస్200- ఇంజిన్, రైడింగ్ ఫీచర్స్..

తాజా అప్‌డేట్‌లో భాగంగా బజాజ్ సంస్థ ఆర్​ఎస్200 బైక్‌కు ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీ (ఈటీబీ) వ్యవస్థను తీసుకొచ్చింది. దీనివల్ల బైక్‌లో విభిన్న రైడింగ్ మోడ్స్ అందుబాటులోకి వచ్చాయి; రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా ఇంజిన్ పనితీరును మార్చుకునే వెసులుబాటు రైడర్లకు లభిస్తుంది. జారుడు రోడ్లపై వెనుక చక్రం స్లిప్ కాకుండా నియంత్రించేందుకు ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్‌ను కూడా జతచేశారు.

దీనితో పాటు బైక్‌లో 'స్పోర్ట్స్ షిఫ్టర్' సదుపాయాన్ని అందించారు. ఈ ఫీచర్ పనితీరుకు సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను బజాజ్ ఇంకా వెల్లడించనప్పటికీ, ఆధునీకరించిన ఎలక్ట్రానిక్, రైడర్-అసిస్టెన్స్ ప్యాకేజీలో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. పెరిగిన 25.5 పీఎస్ పవర్ తోడవడంతో హైవేలపై వేగంగా దూసుకెళ్లేటప్పుడు మరింత చురుకైన అనుభూతి లభించనుంది.

అప్డేటెడ్ బజాజ్ పల్సర్ ఆర్​ఎస్200- సస్పెన్షన్..

హార్డ్‌వేర్ విభాగంలో బజాజ్ ఈసారి గట్టి కసరత్తే చేసింది. బైక్​లోని పాత టెలిస్కోపిక్ ఫోర్కుల స్థానంలో ముందు భాగంలో 37 ఎంఎం అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్కులను అమర్చారు. వెనుక టైర్‌ను కూడా 140/70-ఆర్17 రేడియల్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేశారు. బైక్ ఛాసిస్, ఇంజిన్ నిర్మాణాన్ని అలాగే కొనసాగిస్తూనే, కొత్త సస్పెన్షన్, రేడియల్ టైర్లను జతచేయడం వల్ల మలుపుల్లో బైక్‌పై గ్రిప్, నియంత్రణ గణనీయంగా మెరుగుపడతాయి.

అప్డెటెడ్ బజాజ్ పల్సర్ ఆర్​ఎస్200- టీఎఫ్​టీ స్క్రీన్..

పాత బైక్‌లో ఉన్న బాండెడ్ కలర్ ఎల్‌సీడీ యూనిట్ స్థానంలో సరికొత్త 5-అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కొత్త స్క్రీన్ గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ సదుపాయాన్ని సపోర్ట్ చేస్తుంది; తద్వారా ప్రయాణాల్లో నేవిగేషన్ సులభమవుతుంది. వీటికి తోడు అడ్జస్టబుల్ లివర్లు, యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, హజార్డ్ స్విచ్, అత్యవసర బ్రేకింగ్ సమయంలో వెనుక వాహనాలను అప్రమత్తం చేసే ప్యానిక్ బ్రేక్ అలర్ట్ వంటి ఫీచర్లను కూడా జోడించారు.

“పల్సర్ ఆర్​ఎస్200 ఎల్లప్పుడూ రేసింగ్ ప్రేరేపిత పనితీరు ఉత్సాహాన్ని రోడ్లపైకి తీసుకురావడానికి నిదర్శనంగా నిలిచింది. ఈ అప్‌గ్రేడ్ ద్వారా ఆర్​ఎస్ విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే, రైడర్లకు మరింత నియంత్రణ, అనుకూలత, కనెక్టివిటీని అందించే సాంకేతికతలను పరిచయం చేస్తున్నాము. పల్సర్ అసలైన తత్వాన్ని కోల్పోకుండా, అధునాతన మోటార్‌సైక్లింగ్ టెక్నాలజీని అందరికీ మరింత చేరువ చేసే మా ప్రయత్నంలో ఇది మరో ముందడుగు,” అని బజాజ్ ఆటో లిమిటెడ్ టూ-వీలర్ బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సారంగ్ కనడే పేర్కొన్నారు.

భారత మార్కెట్లో పల్సర్ బ్రాండ్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వచ్చిన ఈ అప్డేట్, ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ విభాగంలో బజాజ్ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది.

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.