Bajaj Chetak EV : తిరుగులేని బజాజ్ చేతక్ ఈవీ! 10లక్షల సేల్స్​తో రికార్డు..

భారత ఈవీ మార్కెట్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 లక్షల రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఓలా, టీవీఎస్ సరసన చేరిన ఈ చేతక్ పవర్, ధరలు, మోడళ్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Nov 10, 2026, 06:46:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారతీయ ద్విచక్ర వాహన రంగంలో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన 'చేతక్' బ్రాండ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బజాజ్ ఆటో రూపొందించిన 'చేతక్ ఎలక్ట్రిక్' స్కూటర్ దేశవ్యాప్తంగా 10 లక్షల విక్రయాల (క్యూములేటివ్ రిజిస్ట్రేషన్లు) మైలురాయిని అధిగమించింది. నవంబర్ 6 నాటికి మొత్తం 10,01,135 స్కూటర్లు రిజిస్టర్ కావడం ద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారతీయ ఈవీ తయారీ సంస్థగా బజాజ్ చరిత్రకెక్కింది! అంతకుముందు ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కంపెనీ మాత్రమే ఈ 10 లక్షల క్లబ్‌లో చేరాయి.

బజాజ్ చేతక్ ఈవీ..
బజాజ్ చేతక్ ఈవీ..

మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఇంధన ధరల భారాన్ని తగ్గించుకోవడానికి ఐటీ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, కుటుంబాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మళ్లుతున్నారు. లక్ష రూపాయల లోపు ధరలోనే బజాజ్ మోడళ్లను అందుబాటులోకి తేవడంతో పాటు చేతక్ బ్రాండ్​కి ఉన్న గుర్తింపు ఈ ఈ-స్కూటర్ విక్రయాల పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్- విపరీతమైన ఆదరణ!

2019 అక్టోబర్‌లో మొదటిసారిగా ఆవిష్కృతమైన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, 2020 జనవరి 14న పూణె, బెంగళూరు నగరాల్లో మొదటగా అమ్మకాలకు వచ్చింది. అప్పట్లో అర్బేన్, ప్రీమియం వేరియంట్లు రూ. 1 లక్ష నుంచి రూ. 1.15 లక్షల ధరకు లభించేవి. ప్రారంభ ఏడాది 2020లో కేవలం 1,243 యూనిట్లు మాత్రమే రిజిస్టర్ అవ్వగా, 2023 నాటికి ఆ సంఖ్య 75,112కు చేరింది. ఆ తర్వాత 2024లో 2,01,167 యూనిట్లు, 2025లో 2,79,691 యూనిట్లకు అమ్మకాలు పెరిగాయి.

కేవలం 2026 మొదటి పది నెలల ఆరు రోజుల్లోనే ఏకంగా 4,12,409 చేతక్ స్కూటర్లు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 73 శాతం వృద్ధి! 2026 అక్టోబర్ నెలలోనే అత్యధికంగా 49,170 యూనిట్లు అమ్ముడై రికార్డు సృష్టించాయి. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి నవంబర్ 6 మధ్య నమోదు అయిన మొత్తం దేశీయ ఈ-2డబ్ల్యూ రిజిస్ట్రేషన్లలో బజాజ్ ఏకంగా 22.5 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది.

పోర్ట్‌ఫోలియోలోని 5 మోడళ్లు.. ధరలు ఇవే!

కస్టమర్ల బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా బజాజ్ ప్రస్తుతం తన చేతక్ పోర్ట్‌ఫోలియోను సీ25, సీ30, సీ35 సిరీస్‌లుగా విభజించి ఐదు వేరియంట్లలో అందిస్తోంది.

చేతక్ సీ2501 (ఆరంభ మోడల్): దీని ధర రూ. 99,802 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు). ఇందులో 2.5 kWh బ్యాటరీ ఉంటుంది. గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ అవడానికి 2 గంటల 25 నిమిషాల సమయం పడుతుంది. డిక్కీలో 25 లీటర్ల స్టోరేజ్ లభిస్తుంది.

చేతక్ సీ3001: ఇందులో 3.0 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ అమర్చారు. గరిష్ట వేగం 70 కేఎంపీహెచ్ కాగా, ఛార్జింగ్ సమయం 2 గంటల 55 నిమిషాలు. సీటు కింద 35 లీటర్ల స్టోరేజ్ ఉంటుంది.

చేతక్ సీ35 సిరీస్ (సీ3501, సీ3502, సీ3503): 3.5 kWh పెద్ద బ్యాటరీతో ఇవి లభిస్తాయి. టాప్ ఎండ్ మోడల్ సీ3501 ధర రూ. 1,52,140 (ఎక్స్-షోరూమ్). సీ3501, సీ3502 మోడళ్లు గంటకు 80 కిమీ వేగంతో ప్రయాణిస్తాయి. సీ3503 గరిష్ట వేగం 70 కేఎంపీహెచ్. సీ3501 మోడల్ 3 గంటల్లో, మిగిలిన రెండు మోడళ్లు 3 గంటల 25 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ అవుతాయి.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్- అత్యాధునిక ఫీచర్లు..

బజాజ్ ఈ-స్కూటర్లలో సాంకేతిక మార్పులను నిరంతరం జోడిస్తోంది. ఫ్లాగ్‌షిప్ సీ3501 మోడల్‌లో 4.8 kW పవర్‌ఫుల్ మోటార్‌తో పాటు టచ్‌స్క్రీన్ కాన్సోల్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ సదుపాయం కల్పించారు. సీ3502 వర్షన్‌లో టీఎఫ్​టీ డిస్‌ప్లే ఉండగా, మిగిలిన మూడు మోడళ్లలో కలర్ ఎల్‌సీడీ స్క్రీన్లు ఉన్నాయి.

అన్ని చేతక్ స్కూటర్లలో రివర్స్ గేర్ ఫంక్షన్, దృఢమైన మెటల్ బాడీ స్టాండర్డ్​గా లభిస్తాయి. సీ35, సీ30 సిరీస్ మోడళ్లలో ఈకో, స్పోర్ట్ రైడింగ్ మోడ్లు, హిల్-హోల్డ్ అసిస్ట్ ఫీచర్లు ప్రామాణికంగా వస్తుండగా, ఆరంభ మోడల్ సీ2501లో వీటి కోసం ‘టెక్ ప్యాక్’ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

నిలకడైన ప్రదర్శన, విశ్వసనీయమైన నగర ప్రయాణం కోరుకునే తెలుగు వాహనదారులకు బజాజ చేతక్ ఇప్పుడు ప్రధాన ఎంపికగా మారింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More