అమెరికాలోని భారత విద్యార్థులకు షాక్! లక్ష డాలర్ల 'ఓపీటీ ఫీజు' ప్రతిపాదనకు వైట్‌హౌస్ ఆమోదం-నెక్ట్స్ ఏంటి?
అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేయాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ పరిపాలనా యంత్రాంగం షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) పై కొత్త రుసుము విధింపునకు సంబంధించిన ప్రతిపాదనకు వైట్‌హౌస్ నియంత్రణ సమీక్ష ఆమోదం లభించింది.
అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదువు ముగించుకుని అక్కడే వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌ని సంపాదించాలనుకునే లక్షలాది మంది భారతీయ విద్యార్థులకు ట్రంప్ పరిపాలనా యంత్రాంగం నిరాశ కలిగించే వార్త అందించింది. అంతర్జాతీయ విద్యార్థులు డిగ్రీ పూర్తయిన తర్వాత అమెరికాలో తాత్కాలికంగా పనిచేసేందుకు ఇచ్చే 'ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్' (ఓపీటీ)పై ప్రత్యేక రుసుమును వసూలు చేసేందుకు ప్రతిపాదించిన నిబంధనకు వైట్‌హౌస్ ఆమోద ముద్ర వేసింది.

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) పరిధిలోని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) ఈ ప్రతిపాదనను ఆగస్టు 20న వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ ఎఫైర్స్ (ఓఐఆర్ఏ) పరిశీలనకు పంపింది. ఓఐఆర్ఏ ఈ రివ్యూను సెప్టెంబర్ 11, 2026న పూర్తి చేసినట్లు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి.
యూఎస్ ఓపీటీ ఫీజు- ఎంత రుసుము విధించనున్నారు?
ఈ ప్రతిపాదనలో ఎంత మొత్తంలో ఫీజు విధించనున్నారనే వివరాలను ఓఐఆర్ఏ రికార్డులలో బహిర్గతం చేయలేదు. త్వరలోనే ఫెడరల్ రిజిస్టర్‌లో ఈ నిబంధనా పత్రాన్ని ప్రచురించనున్నారు. ఫీజు మొత్తం ఎంత ఉంటుంది? ఈ రుసుము ఎవరెవరు చెల్లించాలి? ఏ తేదీ నుంచి అమలులోకి వస్తుంది? అనే అంశాలపై ఆ పత్రంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అయితే ఈ ఫీజు లక్ష డాలర్లు ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఎఫ్-1 వీసాపై ఉండే విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యాక 12 నెలల పాటు అమెరికాలో పనిచేసేందుకు ఓపీటీ అనుమతి పొందుతున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) కోర్సులు చేసిన విద్యార్థులకు మరో 24 నెలల అదనపు పొడిగింపు (స్టెపమ్ ఓపటీ ఎక్స్టెన్షన్) లభిస్తుంది.
తెలుగు విద్యార్థులపై పడనున్న భారం..
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. 2025 'ఓపెన్ డోర్స్' నివేదిక ప్రకారం, 2024-25 విద్యా సంవత్సరంలో ఏకంగా 3,63,019 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వెళ్లిన వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు.
భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువు పూర్తి చేశాక హెచ్-1బీ వర్క్ వీసా పొందే వరకు ఓపీటీనే ప్రధాన వంతెనగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే భారీ ఎత్తున ట్యూషన్ ఫీజులు, నివాస వ్యయాలు భరిస్తున్న విద్యార్థులపై ఈ కొత్త వర్క్ ఫీజు మరింత ఆర్థిక భారాన్ని మోపనుంది.
ముందున్న ప్రక్రియ ఏంటి?
వైట్‌హౌస్ సమీక్ష పూర్తి అయినంత మాత్రాన ఈ కొత్త ఓపీటీ ఫీజు రూల్ తక్షణమే అమలులోకి రాదు. దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడేంత వరకు పాత నిబంధనలే కొనసాగుతాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఈ నోటీసును ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించిన తర్వాత, సాధారణ ప్రజలు, విశ్వవిద్యాలయాలు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తుంది.
ఆ ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే తుది నిబంధన రూపుదిద్దుకుంటుంది. కాబట్టి ప్రస్తుతం ఓపీటీలో ఉన్నవారు లేదా ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి కానున్న విద్యార్థులు కంగారు పడాల్సిన అవసరం లేదని, అయితే భవిష్యత్ అవసరాల కోసం అదనపు బడ్జెట్ కేటాయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


