...
...
Next Story

US Iran sanctions : అమెరికా సరికొత్త ఆంక్షల మోత- ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి

US Iran war latest news : ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు అమెరికా కొత్త ఆంక్షలను ప్రకటించింది. అంతేకాదు ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ప్రపంచ దేశాలకు హెచ్చరించింది.

Published on: Aug 25, 2026, 06:00:25 IST
Advertisement

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. అగ్రరాజ్య ప్రభుత్వం ఇరాన్‌పై సరికొత్త ఆంక్షల అస్త్రం సంధించింది. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరని నేపథ్యంలో, ఈ సరికొత్త ఆంక్షలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఇరాన్‌తో వాణిజ్యం కొనసాగించే దేశాలపై కూడా కఠిన చర్యలు ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. (AP Photo/Meg Kinnard)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. (AP Photo/Meg Kinnard)

చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక దాడి ఇదేనని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అభివర్ణించారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలు లేదా సంస్థలపై కఠినమైన ఆంక్షలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. సైనిక చర్యకు దిగకుండానే, కేవలం ఆర్థిక దెబ్బతో ఇరాన్ ప్రభుత్వాన్ని దారికి తెచ్చేందుకు ఈ వ్యూహం ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తోంది. ఆక్జియోస్ నివేదిక ప్రకారం ఈ ప్రణాళికను 'ఎకనామిక్ డీ-డే'గా అభివర్ణించారు.

ద్వితీయ ఆంక్షల విస్తరణ..

ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగించే ఇతర దేశాలు, కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త ఆంక్షలను విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్​లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల వరకు ఇరాన్‌పై ప్రధాన అస్త్రంగా ఈ ఆంక్షలే ఉండనున్నాయి. ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి సైనిక చర్య ఆప్షన్‌ను కూడా పరిశీలించే అవకాశం ఉందని యూఎస్ అధికారులు సంకేతాలు ఇచ్చారు.

ఇరాన్ ప్రభుత్వంతో ఎలాంటి ఆర్థిక సంబంధాలు పెట్టుకున్నా అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. ఆ ప్రభుత్వంతో ఏ రకమైన ఆర్థిక లావాదేవీలు జరిపినా తీవ్ర పరిణామాలుంటాయని ఆయన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

వ్యాపారాలపై ముగిస్తున్న కాలం..

అమెరికా చర్యలతో చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్, ఖతార్, టర్కీ వంటి దేశాలపై కూడా ఇరాన్‌తో వాణిజ్యాన్ని నిలిపివేయాలని ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఈ తాజా పరిణామాలతో మరింత పాతాళానికి పడిపోయింది. సోమవారం ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ భారీగా పడిపోయి, ఒక అమెరికన్ డాలర్‌కు సుమారు 2 మిలియన్ రియాల్స్‌కు చేరిందని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.

అమెరికా నౌకాదళ దిగ్బంధనం కారణంగా ఇరాన్ తన చమురు ఎగుమతులను దాదాపుగా నిలిపివేయాల్సి వచ్చింది. చమురే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన జీవనాడి కావడంతో, ఎగుమతులు నిలిచిపోవడం ఆ దేశ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దెబ్బతీసింది.

ఇరాన్ దేశ స్పందన..

దేశం ఆర్థిక పతనం అంచున ఉందని కొందరు సీనియర్ ఇరాన్ అధికారులు అంగీకరించారు. దేశంలో నెలకొన్న పరిస్థితిని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కూడా ధృవీకరించారు. తాము ఇంకా బలంగా ఉన్నప్పుడే ఈ యుద్ధాన్ని ముగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇరాన్‌ను ఆర్థికంగా ఒంటరి చేయడమే లక్ష్యంగా అమెరికా పావులు కదుపుతోంది. ప్రభుత్వానికి నిధులు అందకుండా చేసి ఇరాన్‌ను మరింత బలహీనపరచాలని చూస్తోంది. ఈ వ్యూహం ఎంతవరకు విజయవంతమవుతుందనేది ఇతర దేశాలు అమెరికా ఆంక్షలను ఏ మేరకు పాటిస్తాయనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe