అమెరికా గ్రీన్ కార్డ్ కష్టాలు: ఇప్పుడు దరఖాస్తు చేస్తే 179 ఏళ్లు పడుతుంది

అమెరికాలో శాశ్వత నివాస అర్హత సాధించాలనుకునే భారతీయ నిపుణులకు షాకింగ్ వాస్తవాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం దరఖాస్తు చేసుకునే హెచ్-1బీ హోల్డర్లు గ్రీన్ కార్డ్ పొందేందుకు ఏకంగా 179 ఏళ్లు వేచిచూడాల్సి వస్తుందని ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ’ విశ్లేషణలో తేలింది. 

Published on: Sep 1, 2026, 06:55:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాలో శాశ్వత నివాస అర్హత (గ్రీన్ కార్డ్) సాధించాలనే వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల కల నెరవేరడం అంత సులువు కాదని స్పష్టమవుతోంది. 2026 జనవరి లేదా ఆ తర్వాత ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు శాశ్వత నివాస హోదా పొందేందుకు ఏకంగా 179 ఏళ్లు వేచిచూడాల్సి రావచ్చు. ప్రముఖ పరిశోధనా సంస్థ ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ’ (ఎన్‌ఎఫ్‌ఏపీ) విడుదల చేసిన తాజా విశ్లేషణాత్మక నివేదికలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

అమెరికా గ్రీన్ కార్డ్ కష్టాలు: ఇప్పుడు దరఖాస్తు చేస్తే 179 ఏళ్లు పడుతుంది
అమెరికా గ్రీన్ కార్డ్ కష్టాలు: ఇప్పుడు దరఖాస్తు చేస్తే 179 ఏళ్లు పడుతుంది

10 లక్షల మంది భారతీయుల నిరీక్షణ

అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో ప్రస్తుతం ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్‌ల కోసం దాదాపు 10 లక్షల మంది (9,96,599) భారతీయ నిపుణులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు క్యూలో వేచి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న మొత్తం దరఖాస్తుదారుల్లో ఒక్క భారతీయులే 79 శాతం ఉండటం విశేషం. ప్రతీ దేశానికి విధించే నిర్దిష్ట పరిమితుల (కంట్రీ క్యాప్స్) కారణంగా చైనా, ఫిలిప్పీన్స్ వంటి ఇతర దేశాల నిపుణులతో పోలిస్తే భారతీయులపై తీవ్ర ప్రభావం పడుతోంది.

"ఎన్‌ఎఫ్‌ఏపీ విశ్లేషణ ప్రకారం, 2026 జనవరి లేదా ఆ తర్వాత లేబర్ సర్టిఫికేషన్ లేదా ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ఇమ్మిగ్రెంట్ పిటిషన్ సమర్పించిన ఉన్నత నైపుణ్యం కలిగిన భారతీయ పౌరులు గ్రీన్ కార్డ్ పొందడానికి ఈబీ-2లో 179 ఏళ్లు, ఈబీ-3లో 38 ఏళ్లు, ఈబీ-1లో 5 ఏళ్లు వేచి చూడాల్సి రావచ్చు" అని నివేదిక స్పష్టం చేసింది.

కేటగిరీల వారీగా పరిణామాలు

అమెరికా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్‌లను ప్రధానంగా మూడు కేటగిరీల్లో మంజూరు చేస్తుంది. సైన్స్, వ్యాపారం, కళలు, క్రీడల్లో అత్యంత ప్రతిభావంతులకు 'ఈబీ-1' (EB-1) ఇస్తారు. ఉన్నత చదువులు (అడ్వాన్స్డ్ డిగ్రీలు) పూర్తి చేసిన వారికి 'ఈబీ-2' (EB-2), బ్యాచిలర్ డిగ్రీ సహా ఇతర నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు 'ఈబీ-3' (EB-3) వీసాలు కేటాయిస్తారు.

ఈబీ-2 కేటగిరీ: అత్యధికంగా 179 ఏళ్ల సుదీర్ఘ సమయం పడుతుంది.

ఈబీ-3 కేటగిరీ: గ్రీన్ కార్డ్ సాధించడానికి 38 ఏళ్లు నిరీక్షించాలి.

ఈబీ-1 కేటగిరీ: దాదాపు 5 ఏళ్ల సమయం పట్టవచ్చు.

చైనీస్ నిపుణులు ఈబీ-1లో భారతీయులతో సమానమైన సమయాన్నే ఎదుర్కొంటున్నప్పటికీ, ఈబీ-2 కేటగిరీలో 25 ఏళ్లు, ఈబీ-3 కేటగిరీలో 7 ఏళ్లు మాత్రమే వేచి ఉండాల్సి వస్తోంది.

ఏళ్ల తరబడి పెరుగుతున్న వెనుకబాటు

గ్రీన్ కార్డ్ దరఖాస్తుల పెండింగ్ సమస్య దశాబ్ద కాలంగా కొనసాగుతోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ (యుఎస్సీఐఎస్) భారతీయులకు చెందిన 47,601 ఈబీ-2 దరఖాస్తులను ఆమోదించింది. కుటుంబ సభ్యులతో కలిపితే ఇది దాదాపు 98,594 మంది అవుతుంది. అయితే ఆ ఏడాది ఈబీ-2 కేటగిరీలో కేవలం 4,407 మంది భారతీయులకు మాత్రమే శాశ్వత నివాస హోదా లభించింది. ఫలితంగా ఒక్క 2016లోనే 90 వేల కంటే ఎక్కువ మంది నిపుణులు నిరీక్షణ జాబితాలో చేరిపోయారు. 2017, 2018 సంవత్సరాల్లోనూ ఇదే రీతిలో బ్యాక్‌లాగ్ పెరిగింది.

కంట్రీ క్యాప్ నిబంధనలు, అమెరికా కంపెనీల ఆందోళన

అమెరికా చట్టాల ప్రకారం ఏటా కేవలం 1,40,000 ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్‌లు మాత్రమే మంజూరు చేస్తారు. ఏ ఒక్క దేశానికి చెందిన పౌరులకూ మొత్తం వీసాల్లో 7 శాతానికి మించి ఇవ్వకూడదనే నిబంధన ఉంది. కోవిడ్ మహమ్మారి సమయంలో దౌత్య కార్యాలయాల మూసివేత వల్ల ఫ్యామిలీ-బేస్డ్ వీసాలు మిగిలిపోయాయి. చట్టప్రకారం ఆ వీసాలను ఎంప్లాయ్‌మెంట్ కేటగిరీకి మళ్లించారు. దీంతో 2020 నుంచి 2024 మధ్య కాలంలో అదనంగా 2.8 లక్షల గ్రీన్ కార్డ్‌లు అందుబాటులోకి వచ్చి మొత్తం 9,80,460 వీసాలు జారీ అయ్యాయి. అయినప్పటికీ, ఐదేళ్ల వ్యవధిలో ఉద్యోగ ఆధారిత బ్యాక్‌లాగ్ 20.6 శాతం పెరిగింది.

"ఈ విపరీతమైన ఆలస్యం వల్ల దరఖాస్తుదారులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికన్ కంపెనీలు భారతదేశానికి చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించడం, వారిని సుదీర్ఘకాలం నిలుపుకోవడం కష్టతరంగా మారుతోంది" అని ఎన్‌ఎఫ్‌ఏపీ విశ్లేషణ వివరించింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More