US Iran strikes : హర్మూజ్ సంక్షోభం- ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు! భారత్‌కు కొత్త టెన్షన్..
Brent crude price : హర్మూజ్ జలసంధి వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య శత్రుత్వం ముదిరింది. ఇరాన్‌లోని 140కి పైగా సైనిక స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించగా, గల్ఫ్ దేశాల్లోని యూఎస్ సైనిక ప్రాంతాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఈ పరిణామాలతో ముడి చమురు ధర మరింత పెరిగింది.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక 60 రోజుల శాంతి ఒప్పందం కాస్తా ముక్కలవుతూ, అమెరికా-ఇరాన్ మధ్య మునుపెన్నడూ లేని విధంగా సైనిక ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. ప్రపంచ దేశాల చమురు అవసరాలను తీర్చే అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఇరు దేశాలు భీకర దాడులకు దిగాయి. ఆదివారం నాడు అమెరికా సెంట్రల్ కమాండ్ ఏకంగా 140కి పైగా ఇరాన్ సైనిక లక్ష్యాలపై విరుచుకుపడగా, దానికి ప్రతిగా ఇరాన్ సైన్యం గల్ఫ్ రీజియన్‌లోని అమెరికా అనుకూల దేశాలపై క్షిపణులు, డ్రోన్ల వాన కురిపించింది.

మంటల్లో హర్మూజ్- 140 స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం!
సరుకు రవాణా నౌకలపై ఇరాన్ వరుస దాడులకు దిగడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ముప్పును శాశ్వతంగా అణచివేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని యూఎస్ మిలిటరీ స్పష్టం చేసింది. అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్‌కు చెందిన మిస్సైల్ లాంచ్ సైట్లు, డ్రోన్ల తయారీ కేంద్రాలు, భారీ ఆయుధ డిపోలతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ ఆధీనంలో ఉన్న క్విష్మ్ దీవిపై 10కి పైగా అమెరికా క్షిపణులు పడ్డాయని ఇరాన్ అధికారిక మీడియా సంస్థ 'ఇర్నా' ధృవీకరించింది. ఈ దాడిలో మొబైల్ కమ్యూనికేషన్స్ కంపెనీ ఆఫ్ ఇరాన్‌కు చెందిన ఒక ఉద్యోగి మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్- గల్ఫ్ దేశాలపై మిస్సైళ్ల దాడి..
అమెరికా దాడులు జరిగిన కొద్ది గంటల్లోనే ఇరాన్ సైన్యం తన ప్రతీకార పంజా విసిరింది! అమెరికా దళాలకు ఆశ్రయం కల్పిస్తున్న బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమన్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. ఖతార్‌లో ఇరాన్ మిస్సైళ్లను అడ్డుకునే క్రమంలో పడిన శిథిలాల వల్ల ఒక చిన్నారితో సహా ముగ్గురు గాయపడ్డారు. కువైట్, జోర్డాన్ సైన్యాలు ఇరాన్ క్షిపణులను గాల్లోనే అడ్డుకున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో ఆస్తి నష్టం సంభవించింది.
తమ జలసంధి సరిహద్దుల్లో డ్రోన్ దాడులు జరగడంపై ఒమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది బాధ్యతారాహిత్యమైన చర్య అంటూ ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది.
భారతీయ నావికుడు గల్లంతు- ఆందోళనలో దిల్లీ!
ఈ అంతర్జాతీయ యుద్ధం భారతదేశాన్ని కూడా నేరుగా తాకింది. ఒక భారీ కంటైనర్ నౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ జరిపిన దాడితోనే ఈ తాజా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ నౌక ఇంజన్ రూమ్ తీవ్రంగా దెబ్బతినడంతో ఒమన్ కోస్ట్ గార్డ్స్ 23 మంది సిబ్బందిని రక్షించారు. అయితే, ఈ ప్రమాదంలో ఒక నావికుడు గల్లంతయ్యాడు. అతను భారతీయ పౌరుడేనని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ధృవీకరించింది. ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సదరు నావికుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు దిల్లీ వర్గాలు తెలిపాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 'హర్మూజ్' సెగ..
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రవాణాలో ఐదో వంతు (20 శాతం) కేవలం ఈ హర్మూజ్ జలసంధి గుండానే సాగుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నామని, తమ అనుమతి లేనిదే ఏ నౌకను రానిచ్చేది లేదని భీష్మించుకు కూర్చుంది. కానీ, అంతర్జాతీయ నౌకాయానం యథావిధిగా సాగుతోందని అమెరికా సెంట్రల్ కమాండ్ చెబుతోంది. ఈ మాటలను ఇరాన్ కొట్టిపారేసి, హర్మూజ్‌ని మూసేశామని తేల్చిచెప్పింది.
ఒకవేళ ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇది భారతదేశంలో ఇంధన ధరల పెరుగుదలకు, ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉంది.
తాజా పరిణామాల మధ్య బ్రెంట్ క్రూడ్ 3శాతం పెరిగి బ్యారెల్‌కి 78.4 డాలర్లకు చేరింది.
ఒకవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనడం, మరోవైపు ట్రంప్ సర్కార్ తగ్గేదేలే అనడంతో ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు ఒమన్, ఖతార్, పాకిస్తాన్, ఈజిప్ట్ దేశాలు చేస్తున్న దౌత్య ప్రయత్నాలు నిష్ఫలమయ్యేలా కనిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


