అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు: ఆరు నెలల గరిష్టానికి ముడిచమురు ధరలు.. పెట్రో మంట తప్పదా?
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ముడిచమురు సెగను పెంచుతున్నాయి. ఫిబ్రవరి 20, 2026 నాటికి బ్రెంట్ క్రూడ్ ఆరు నెలల గరిష్ట స్థాయి $71.99కి చేరింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చమురు సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చమురు ధరలను ఆరు నెలల గరిష్ట స్థాయికి చేర్చాయి. ఫిబ్రవరి 20, 2026 నాటి గణాంకాల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 33 సెంట్లు (0.5%) పెరిగి బ్యారెల్‌కు $71.99 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) కూడా 62 సెంట్లు (0.9%) వృద్ధి చెంది $67.05కి చేరుకుంది.

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు ఇవే:
- ట్రంప్ అల్టిమేటం: అణు ఒప్పందంపై చర్చలు జరపాలని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 10 నుంచి 15 రోజుల గడువు ఇవ్వడం మార్కెట్లో కలకలం రేపింది.
- సైనిక మోహరింపు: 2003 ఇరాక్ యుద్ధం తర్వాత మధ్యప్రాచ్యంలో అమెరికా ఈ స్థాయిలో సైనిక బలగాలను మోహరించడం ఇదే మొదటిసారి. ఇది దీర్ఘకాలిక యుద్ధానికి దారితీయవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
- రష్యా-ఉక్రెయిన్ చర్చల వైఫల్యం: జెనీవాలో జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు విఫలం కావడం కూడా ముడిచమురు ధరలు పెరగడానికి మరో కారణమైంది. దీనివల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
- హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత: ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హోర్ముజ్ జలసంధిలో ఇరాన్, రష్యా సంయుక్తంగా నౌకాదళ విన్యాసాలు చేపట్టడం మరింత ఆందోళన కలిగిస్తోంి.
భారత మార్కెట్‌పై ప్రభావం:
భారతదేశంలో ఎంసీఎక్స్ (MCX) క్రూడ్ ఆయిల్ మార్చి ఫ్యూచర్స్ ప్రస్తుతం బ్యారెల్‌కు ₹6,050 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా కూడా ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
నిపుణులు ఏమంటున్నారు?
ముడిచమురు ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని సామ్కో (SAMCO) సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అపూర్వ షేత్ విశ్లేషించారు. “WTI క్రూడ్ ప్రస్తుతం $66 స్థాయిని అధిగమించడానికి ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఇది $66 దాటితే, తదుపరి లక్ష్యం $72-73 వరకు ఉండవచ్చు. చైనా తన వ్యూహాత్మక నిల్వలను పెంచుకోవడం, సరఫరా తగ్గడం వంటి అంశాలు ధరలను ప్రభావితం చేస్తున్నాయి” అని ఆయన వివరించారు.
ఇండస్ ఇండ్ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ జిగర్ త్రివేది స్పందిస్తూ.. “ఎంసీఎక్స్ క్రూడ్ ఈ వారంలోనే 5 శాతం వృద్ధి చెందింది. వచ్చే రెండు వారాల్లో కూడా మార్కెట్ బుల్లిష్‌గా (పెరుగుదల దిశగా) ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ₹6,300 వద్ద నిరోధం (Resistance), ₹6,000 వద్ద మద్దతు (Support) కనిపిస్తోంది” అని పేర్కొన్నారు.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగితే, భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper












