క్రూడాయిల్ ధరలు పెరిగితే డాలర్ పడాలి.. కానీ ఎందుకు పెరుగుతోంది? అమెరికా-ఇరాన్ యుద్ధం వెనుక దాగున్న అసలు 'లెక్క' ఇదే

సాధారణంగా ముడి చమురు ధరలు పెరిగితే డాలర్ విలువ తగ్గుతుంది. కానీ అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య సీన్ రివర్స్ అయింది. డాలర్ ఎందుకు బలపడుతోంది? రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది? ఈ పరిణామాల వెనుక ఉన్న ఆర్థిక విశ్లేషణను ఎస్.బి.ఐ (SBI) నివేదిక ఏం చెబుతోంది? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Mar 7, 2026, 16:51:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు (Crude Oil) ధరలు భగ్గుమంటున్నాయి. సాధారణ ఆర్థిక సూత్రాల ప్రకారం.. చమురు ధరలు పెరిగితే అమెరికా డాలర్ విలువ తగ్గాలి. కానీ, ప్రస్తుత అమెరికా-ఇరాన్ యుద్ధం మధ్య ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. చమురు ధరలతో పాటే డాలర్ కూడా రాకెట్‌లా దూసుకుపోతోంది.

క్రూడాయిల్ ధరలు పెరిగితే డాలర్ పడాలి.. కానీ ఎందుకు పెరుగుతోంది?
క్రూడాయిల్ ధరలు పెరిగితే డాలర్ పడాలి.. కానీ ఎందుకు పెరుగుతోంది?

గత వారం రోజుల్లోనే డాలర్ ఇండెక్స్ 1.3% పెరిగి 100 స్థాయికి చేరువలో ఉండగా, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 24% పెరిగి బ్యారెల్‌కు 93.60 డాలర్లకు చేరింది.

డాలర్ ఎందుకు బలపడుతోంది? మూడు ప్రధాన కారణాలు

1. సురక్షిత పెట్టుబడిగా డాలర్ (Safe-Haven Demand):

ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా, ఉద్రిక్తతలు పెరిగినా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భద్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన 'సేఫ్ హెవెన్'గా డాలర్‌ను భావిస్తారు. అందుకే యూరో, యెన్ వంటి ఇతర కరెన్సీలను అమ్మివేసి అందరూ డాలర్లను కొంటున్నారు. దీనివల్ల డాలర్ ఇండెక్స్ బలపడుతోంది.

2. అమెరికా ఇప్పుడు 'కొనుగోలుదారు' కాదు.. 'అమ్మకందారు':

ఒకప్పుడు అమెరికా చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన ఎగుమతిదారులలో ఒకటిగా ఎదిగింది. ఎస్.బి.ఐ. రీసెర్చ్ నివేదిక ప్రకారం.. మధ్యప్రాచ్య యుద్ధం వల్ల అమెరికా చమురు, గ్యాస్ కంపెనీలకు భారీ లాభాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా యూరప్‌కు ఎల్.ఎన్.జి. (LNG) సరఫరా చేయడంలో అమెరికా వాటా 2021 నుండి 2025 మధ్య మూడు రెట్లు పెరిగింది. చమురు ధరలు పెరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు వచ్చే నష్టం కంటే లాభమే ఎక్కువగా ఉండటం డాలర్‌కు ప్లస్ పాయింట్ అవుతోంది.

3. ద్రవ్యోల్బణం - వడ్డీ రేట్ల భయం:

చమురు ధరలు పెరిగితే ఆటోమేటిక్‌గా రవాణా ఖర్చులు పెరిగి ధరలు పెరుగుతాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతుంది. దీన్ని అదుపు చేయడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సుదీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉంచే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే డాలర్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారు, తద్వారా డాలర్ మరింత బలపడుతుంది.

రూపాయి పరిస్థితి ఏమిటి?

డాలర్ దూకుడుతో భారత రూపాయి తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. ఈ వారం రూపాయి విలువ చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోయింది. మొదటిసారిగా డాలర్‌తో పోలిస్తే రూపాయి 92.03 మార్కును దాటింది. భారత్ తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతి చేసుకుంటుంది కాబట్టి, ముడి చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు?

ఎమ్కే గ్లోబల్ (Emkay Global) విశ్లేషణ ప్రకారం, డాలర్ ఇండెక్స్‌కు 96.86 వద్ద బలమైన సపోర్ట్ ఉంది. ఒకవేళ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ఇది 100-101 స్థాయికి చేరే అవకాశం ఉంది. డాలర్/రూపాయి ట్రేడింగ్ ప్రస్తుతం 91.85 – 92.00 మధ్య సాగుతోంది. ఒకవేళ 92.00 స్థాయిని దాటి నిలబడితే రూపాయి మరింత పతనమై 92.60 వరకు వెళ్లవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. చమురు ధరలు పెరిగితే డాలర్ ఎందుకు పెరుగుతుంది?

అమెరికా ఇప్పుడు నెట్ ఎనర్జీ ఎగుమతిదారుగా ఉంది. పెరిగిన ధరల వల్ల ఇతర దేశాల కంటే అమెరికా కంపెనీలు ఎక్కువ లాభపడతాయి. అలాగే యుద్ధ సమయంలో డాలర్‌ను సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల దీనికి డిమాండ్ పెరుగుతుంది.

2. భారత రూపాయి ఎందుకు పడిపోతోంది?

డాలర్ బలపడటం ఒక కారణమైతే, చమురు దిగుమతుల కోసం మనం ఎక్కువ డాలర్లను ఖర్చు చేయాల్సి రావడం వల్ల రూపాయి విలువ తగ్గుతోంది.

3. డాలర్ ఇండెక్స్ అంటే ఏమిటి?

ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో (యూరో, యెన్, పౌండ్ వంటివి) పోలిస్తే డాలర్ విలువ ఎలా ఉందో కొలిచే కొలమానాన్ని డాలర్ ఇండెక్స్ అంటారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More