Oil prices : ప్రపంచానికి 'చమురు' సెగ! బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరుతుందని ఇరాన్ హెచ్చరిక!

ప్రపంచ చమురు సరఫరాకు జీవనాధారంగా భావించే హర్ముజ్​ జలసందిని మూసివేస్తున్నట్టు ఇరాన్​ ప్రకటించింది. దీని వల్ల బ్యారెల్​ ధర 200 డాలర్లు టచ్​ అవుతుందని ఇరాన్​ హెచ్చరించింది.

Published on: Mar 03, 2026 8:15 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అత్యున్నత సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' ఒక సంచలన ప్రకటన చేసింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz)ను మూసివేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా, ఆ మార్గం గుండా వెళ్లే ఏ నౌకనైనా సరే తగులబెడతామని తీవ్రస్థాయిలో హెచ్చరించింది.

స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత.. (REUTERS)
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత.. (REUTERS)

శనివారం నుంచి ఇజ్రాయెల్, అమెరికా జరిపిన బాంబు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్​ ఖమేనీతో పాటు ఇతర సీనియర్ అధికారులు మరణించిన నేపథ్యంలో, ఇరాన్ ఈ ప్రతీకార చర్యకు దిగింది.

"నౌకలను తగులబెడతాం" - ఐఆర్​జీసీ హెచ్చరిక..

ఐఆర్​జీసీ కమాండర్-ఇన్-చీఫ్ సీనియర్ సలహాదారు ఇబ్రహీం జబారి ఇరాన్ ప్రభుత్వ మీడియా ద్వారా ఈ కఠిన సందేశాన్ని పంపారు. "జలసంధి మూసివేశాము. ఎవరైనా దీనిని దాటడానికి ప్రయత్నిస్తే, రివల్యూషనరీ గార్డ్, నౌకాదళ హీరోలు ఆ నౌకలను తగులబెడతారు," అని తెలిపారు.

ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఉండే ఈ హార్ముజ్ జలసంధి గుండా ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు (20%) సాగుతుంది. ఇది మూతపడుతుందనే చిన్న సూచన కూడా ప్రపంచ కమోడిటీ మార్కెట్లను, దౌత్య మార్గాలను వణికించేస్తుంది.

ఈ హార్ముజ్ జలసంధి ఆసియా, యూరప్ ఆర్థిక వ్యవస్థలకు అత్యంత కీలకం. ఇది పూర్తిగా మూతపడితే ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరగడమే కాకుండా, ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థల ద్రవ్య విధానాలు కూడా చిక్కుల్లో పడతాయి.

జబారి ఇంకా మాట్లాడుతూ.. "మేము చమురు పైప్‌లైన్లపై కూడా దాడులు చేస్తాము. ఈ ప్రాంతం నుంచి ఒక్క చుక్క చమురు కూడా బయటకు వెళ్లనివ్వము. రాబోయే రోజుల్లో చమురు ధర బ్యారెల్‌కు 200 డాలర్లకు చేరుకుంటుంది" అని ఐఆర్​జీసీ టెలిగ్రామ్ ఛానెల్‌లో పేర్కొన్నారు.

అమెరికాపై విమర్శలు గుప్పిస్తూ.. "వేల కోట్ల డాలర్ల అప్పుల్లో ఉన్న అమెరికన్లు ఈ ప్రాంతం చమురుపై ఆధారపడుతున్నారు. కానీ వారికి ఒక్క చుక్క చమురు కూడా అందదని వారు తెలుసుకోవాలి," అని ఆయన హెచ్చరించారు.

వణికిపోతున్న ఇంధన మార్కెట్లు.. గ్యాస్ ధరల పెరుగుదల!

ఇరాన్ హెచ్చరికల ప్రభావం ఇంధన మార్కెట్లపై తక్షణమే కనిపించింది. తమ ఫెసిలిటీలపై దాడుల కారణంగా 'ఖతార్ ఎనర్జీ' లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్​ఎన్​జీ) ఉత్పత్తిని నిలిపివేయడంతో యూరోప్‌లో గ్యాస్ ధరలు దాదాపు 50 శాతం, ఆసియాలో 40 శాతం పెరిగాయి.

అంతకుముందు రోజు, రోజుకు అర మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడి చమురును శుద్ధి చేయగల సామర్థ్యం ఉన్న సౌదీ అరేబియాలోని ‘రాస్ తనూరా’ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడులు జరిగినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. అయితే వీటిని గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ట్యాంకర్ల అంతరాయం, రిఫైనరీలపై దాడులు, పైప్‌లైన్ల ముప్పు వెరసి ప్రపంచ సరఫరా గొలుసుపై ఆందోళనలు పెంచాయి. ఒకవేళ హార్ముజ్ జలసంధి దీర్ఘకాలం మూతపడితే, చమురు ధరలు ఆధునిక మార్కెట్ ఎన్నడూ చూడని విధంగా 200 డాలర్ల స్థాయికి చేరుతాయని విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.

రంగంలోకి అమెరికా

పెరుగుతున్న ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. మార్కెట్ ఒడిదుడుకులను తాము ముందే ఊహించామని, దాని ప్రభావాన్ని తగ్గించేందుకు వెంటనే చర్యలు చేపడతామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. ముడి చమురు ధరలు పెరిగితే సామాన్యుల బడ్జెట్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ముడి చమురు ధరలు పెరిగినప్పుడు కేవలం పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాకుండా 'క్యాస్కేడింగ్ ఎఫెక్ట్' (వరుస ప్రభావం) వల్ల అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి.

రవాణా ఖర్చులు: డీజిల్ ధర పెరిగితే లారీలు, వ్యాన్‌ల రవాణా ఛార్జీలు పెరుగుతాయి. దీనివల్ల పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాల ధరలు ఆకాశాన్ని తాకుతాయి.

నిత్యవసరాలు: పెయింట్స్, ప్లాస్టిక్స్, టైర్లు, కాస్మెటిక్స్ వంటి వస్తువుల తయారీలో పెట్రో కెమికల్స్‌ను వాడతారు కాబట్టి వాటి ధరలు కూడా పెరుగుతాయి.

ద్రవ్యోల్బణం: వీటివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఫలితంగా సామాన్యుల నెలవారీ ఖర్చు పెరిగి, పొదుపు తగ్గుతుంది.

2. భారత ఆర్థిక వ్యవస్థపై చమురు ధరల ప్రభావం ఎలా ఉంటుంది?

భారతదేశం తన చమురు అవసరాలలో దాదాపు 80-85% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. చమురు ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ కింది ప్రభావాలు ఉంటాయి:

కరెంట్ అకౌంట్ డెఫిసిట్: దిగుమతి బిల్లు పెరగడం వల్ల దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది. ఇది వాణిజ్య లోటుకు దారితీస్తుంది.

రూపాయి విలువ పతనం: ముడి చమురు కొనడానికి డాలర్ల అవసరం పెరుగుతుంది. మార్కెట్‌లో డాలర్‌కు గిరాకీ పెరిగి, రూపాయి విలువ పడిపోతుంది.

సబ్సిడీ భారం: ప్రభుత్వం ఇచ్చే వంటగ్యాస్, ఎరువుల సబ్సిడీల భారం పెరుగుతుంది, దీనివల్ల అభివృద్ధి పనులపై పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంటుంది.