Khamenei death : ఖమేనీ మరణం.. అనిశ్చితిలో ఇస్లామిక్ రిపబ్లిక్ భవిష్యత్తు! నెక్ట్స్ ఏంటి?
Ayatollah Ali Khamenei : దాదాపు 40 ఏళ్ల పాటు ఇరాన్‌ను శాసించిన ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఆయన మరణం ఇరాన్ అంతర్గత వ్యవస్థలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోంది? తదుపరి వారసుడు ఎవరు? ప్రపంచ దేశాల స్పందన ఏమిటి? అనే పూర్తి వివరాలు ఈ కథనంలో..
రెండు వారాల క్రితం ఇరాన్ ప్రభుత్వ టీవీలో ఒక అనూహ్య ఘటన జరిగింది. 1979 విప్లవ వార్షికోత్సవ ర్యాలీలను కవర్ చేస్తున్న ఒక రిపోర్టర్, లైవ్ ప్రసారంలో పొరపాటున “ఖమేనీకి మరణం” అని నినదించారు. నిజానికి ఆయన "అమెరికాకు మరణం" అని అనబోయి నోరు జారారు. ఆ చిన్న పొరపాటు ఆయన ఉద్యోగాన్ని బలితీసుకుంది. కానీ, 90 మిలియన్ల జనాభా కలిగిన ఇరాన్‌లో 40 ఏళ్లుగా సాగుతున్న కఠిన పాలనపై ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో ఆ ఒక్క మాట ప్రపంచానికి చాటిచెప్పింది.
గత శనివారం అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతొల్లా అల్ ఖమేనీ (86) మరణించారు. టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న ఆయన నివాసం, కార్యాలయాలు ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమై బూడిద కుప్పగా మారాయని శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, మనవడు సహా మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఈ పరిణామాల మధ్య ఇప్పుడు ఇరాన్ భవిష్యత్తు చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌కు నెక్ట్స్ ఏంటి అని అక్కడి ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు ఆసక్తి, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
పాలనా వ్యవస్థలో మార్పులు: నెక్ట్స్ ఏంటి?
ఖమేనీ మరణం పశ్చిమాసియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులకు దారితీసే అవకాశం ఉందని భౌగోళిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెజారిటీ ఇరాన్ ప్రజలు తమ జీవిత కాలంలో చూసిన ఏకైక నాయకుడు ఆయనే. అయితే, ఆయన మరణించినా ప్రస్తుతానికి ఇరాన్ పాలనా వ్యవస్థ యథావిధిగా పనిచేస్తోంది.
ఐరోపా కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సీనియర్ ఫెలో ఎల్లీ గెరన్మాయే అభిప్రాయం ప్రకారం.. "ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్సీజీ) ప్రస్తుతం ఐక్యంగా ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌లను ఎదుర్కోవడానికి లేదా చివరి వరకు పోరాడటానికి వారు సిద్ధంగా ఉన్నారు."
నిరసనలు, భద్రత..
ఖమేనీ మరణ వార్త తెలియగానే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రజలు తిరగబడి ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవాలని పిలుపునిచ్చినప్పటికీ, ప్రస్తుతం అలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదు. టెహ్రాన్ వీధుల్లో భారీగా సాయుధ పోలీసులు, స్వచ్ఛంద పారామిలటరీ బలగాలను మోహరించడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇరాన్‌లో వ్యవస్థీకృత ప్రతిపక్షం లేకపోవడం, జనవరిలో జరిగిన నిరసనల్లో 7,000 మందికి పైగా పౌరులను భద్రతా బలగాలు పొట్టనబెట్టుకోవడం ప్రజల్లో భయాందోళనలను పెంచింది.
Khamenei : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్ ఖమేనీ హతం- ఫొటోలు..
వారసత్వ పోరు, అధికార మార్పిడి..
జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మెహ్రాన్ కమ్రావా విశ్లేషణ ప్రకారం.. "ఖమేనీ మరణం ఇరాన్ ఉనికిని ప్రమాదంలో పడేయకపోవచ్చు కానీ, ఆ దేశ అంతర్గత, అంతర్జాతీయ విధానాలను మార్చేస్తుంది." ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం న్యాయశాఖ, శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థల అధిపతులతో కూడిన కౌన్సిల్ దేశాన్ని పాలిస్తోంది. తదుపరి సుప్రీం లీడర్‌ను ఎన్నుకోవడానికి 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' సమావేశం కానుంది. ఖమేనీ రెండో కుమారుడు మోజ్తబా పేరు వారసుల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది.
ఖమేనీ మరణం తర్వాత ఐఆర్‌జీసీ పట్టు మరింత పెరిగే అవకాశం ఉంది. దేశ ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో ఇప్పటికే బలమైన ప్రభావం చూపుతున్న ఈ సైనిక విభాగం, తదుపరి సుప్రీం లీడర్‌ను కూడా నియంత్రించే స్థాయికి చేరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదే జరిగితే.. ఇక ఖమేనీని హతమార్చి ప్రయోజనం ఏముంటుంది? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అంతర్జాతీయ స్పందన..
ఖమేనీ మరణంపై ప్రపంచ దేశాలు భిన్నంగా స్పందించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయనను "అత్యుత్తమ రాజనీతిజ్ఞుడు" అని కొనియాడారు. చైనా ఈ హత్యను "ఆమోదయోగ్యం కానిది" అని ఖండించింది. కానీ ఇరాన్‌కు సాయంగా వచ్చేందుకు మాత్రం వెనకడుగు వేస్తోంది.
ఇరాన్ టాప్ లీడర్ మృతిపై ఇండియా ప్రత్యక్షంగా స్పందించలేదు. కానీ అక్కడి ప్రజలు, భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.
అణు విధానంపై నీలినీడలు..
ఖమేనీ మరణం నేపథ్యంలో యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తున్న మరో విషయం ‘అణు విధానం’! ఆయన మరణం తర్వాత ఇరాన్ అణు విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఖమేనీ గతంలో జారీ చేసిన 'ఫత్వా' (మతపరమైన ఆదేశం) ఇప్పుడు వీగిపోయే ప్రమాదం ఉంది. దేశ రక్షణ కోసం అణు విధానాన్ని మార్చుకోవచ్చని సీనియర్ సలహాదారు అలీ లారీజానీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.
ఖమేనీ వారసత్వం అణిచివేతకు, మొండితనానికి చిహ్నంగా మిగిలిపోతుందని నిపుణులు అంటున్నారు. 1989లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను, సంస్కరణవాదుల గళాన్ని అణిచివేశారు. పశ్చిమాసియాలో హమాస్, హిజ్బుల్లా వంటి సాయుధ గ్రూపుల ద్వారా ఇరాన్ ప్రభావాన్ని విస్తరించడానికి ఆయన చేసిన ప్రయత్నాలే చివరికి ఆయన పతనానికి దారితీశాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


