అమెరికా వీసా కావాలంటే అదనంగా రూ. 19లక్షలు కట్టాల్సిందే! కొత్త రూల్​తో భారతీయులపై ప్రభావం ఎంత?

బిజినెస్, టూరిస్ట్ వీసాల కోసం బాండ్ ప్రోగ్రామ్‌ను అమెరికా పర్మనెంట్ చేసింది. 50 దేశాల పౌరులకు గరిష్టంగా 20,000 డాలర్ల (రూ.19.10 లక్షలు) వరకు బాండ్ విధించనున్నారు. అయితే ఈ జాబితాలో భారతదేశం ఉందా? లేదా? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 2, 2026, 10:46:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా పర్యటనకు వెళ్లాలనుకునే విదేశీయులకు ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది! బిజినెస్, టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే కొన్ని నిర్దిష్ట దేశాల పౌరుల నుంచి భారీగా 'బాండ్' అమౌంట్​ని వసూలు చేసే 'వీసా బాండ్ ప్రోగ్రామ్'ను శాశ్వతం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధన ప్రకారం వీసా జారీ చేయడానికి ముందే.. అభ్యర్థులు గరిష్టంగా 20,000 డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 19.10 లక్షలు) వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

యూఎస్​ వీసా లేటెస్ట్ అప్డేట్స్.. (Representative image/Unsplash)
యూఎస్​ వీసా లేటెస్ట్ అప్డేట్స్.. (Representative image/Unsplash)

యూఎస్ ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించిన నోటిఫికేషన్ ప్రకారం.. ఆగస్టు 3 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఆఫ్రికా ఖండానికి చెందిన మెజారిటీ దేశాలతో పాటు మొత్తం 50 దేశాల బీ-1 (వ్యాపార), బీ-2 (టూరిస్ట్) వీసా దరఖాస్తుదారులకు ఈ నిబంధన వర్తిస్తుంది.

"కాన్సులర్ అధికారులు తమ విచక్షణ మేరకు అర్హులైన విదేశీ దరఖాస్తుదారుల నుంచి 20,000 డాలర్ల వరకు బాండ్ చెల్లించాలని ఆదేశించవచ్చు," అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఈ నిర్ణయానికి కారణమేంటి?

వీసా గడువు ముగిసినప్పటికీ చాలామంది అమెరికాలోనే చట్టవిరుద్ధంగా ఉండిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిని అరికట్టేందుకు 2025లో ఈ వీసా బాండ్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, ట్రెజరీ విభాగాలు నిర్వహించిన అధ్యయనంలో.. ఈ బాండ్ విధానం వల్ల విదేశీయులు నిబంధనలు పాటించేలా చేయవచ్చని ఆధారాలు లభించాయి. ఫలితంగా దీనిని శాశ్వత విధానంగా మారుస్తున్నట్లు యూఎస్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

భారతీయులపై ప్రభావం ఉందా?

అమెరికా ప్రకటించిన ఈ 50 దేశాల జాబితాలో భారతదేశం లేదు! భారతీయ పౌరులకు ఇది పెద్ద ఉపశమనమనే చెప్పాలి. కాబట్టి, బీ-1, బీ-2 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు ఎలాంటి వీసా బాండ్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి మరిన్ని దేశాలను ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.

ట్రంప్ ప్రభుత్వ కఠిన ఆంక్షల్లో భాగమే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో వలస విధానాలను అమెరికా కఠినతరం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో పైలట్ ప్రాజెక్ట్ కింద 5,000 డాలర్లు, 10,000 డాలర్లు, 15,000 డాలర్ల వరకు బాండ్లు విధించేవారు. కానీ ఇప్పుడు 5,000 డాలర్ల ఆప్షన్‌ను తొలగించి, గరిష్ట పరిమితిని 20,000 డాలర్లకు పెంచారు.

వీసా నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడమే తమ లక్ష్యమని అధికారులు చెబుతున్నప్పటికీ, నిజమైన పర్యాటకులు, వ్యాపారవేత్తలు అమెరికా రావడానికి ఇది అడ్డంకిగా మారుతుందని వలసదారుల హక్కుల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, పలు వీసా కేటగిరీలకు ఫీజులు పెంచడం, సోషల్ మీడియా అకౌంట్ల తనిఖీని విస్తృతం చేయడం వంటి చర్యలతో చట్టబద్ధమైన వలసలను కూడా యుఎస్ ప్రభుత్వం మరింత క్లిష్టతరం చేస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More