...
...
Next Story

అమెరికా వీసాలపై ట్రంప్ వేటు: ఏకంగా 1.75 లక్షల వీసాలు రద్దు

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. నేరాలకు పాల్పడటం, వీసా నిబంధనలను ఉల్లంఘించడం, జాతీయ భద్రతకు ముప్పుగా మారడం వంటి కారణాలతో ఇప్పటివరకు 1.75 లక్షల మందికి పైగా వీసాలను యూఎస్ విదేశాంగ శాఖ రద్దు చేసింది.

Published on: Aug 11, 2026, 15:01:05 IST
Advertisement

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యంత్రాంగం వలసదారులపై కఠిన చర్యలను మరింత వేగవంతం చేసింది. దేశంలో నివసిస్తున్న విదేశీయులపై డేగకన్ను ఉంచిన ప్రభుత్వం, ఇప్పటివరకు 1,75,000 కంటే ఎక్కువ వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ సోమవారం అధికారికంగా వెల్లడించింది.

వీసాల రద్దుకు ప్రధాన కారణాలేంటి?

అమెరికా వీసాలపై ట్రంప్ వేటు: ఏకంగా 1.75 లక్షల వీసాలు రద్దు
అమెరికా వీసాలపై ట్రంప్ వేటు: ఏకంగా 1.75 లక్షల వీసాలు రద్దు

విదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించడం, చట్టవ్యతిరేక నేరాలకు పాల్పడటం, అమెరికన్ పౌరులపై హింసను ప్రేరేపించడం, మోసాలకు పాల్పడటం, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం, జాతీయ భద్రతకు విఘాతం కలిగించడం వంటి కారణాలతోనే ఈ వీసాలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

శాంతిభద్రతల పరిరక్షణ సంస్థలు (Law Enforcement) చేపట్టిన తనిఖీల్లోనే అత్యధిక శాతం వీసా రద్దులు చోటు చేసుకున్నాయి. భౌతిక దాడులు, మద్యం సేవించి వాహనాలు నడపడం (DUI), దొంగతనాలు, డ్రగ్స్ సంబంధిత నేరాలే వీసాల రద్దుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.

తీవ్రమైన నేరాలు.. ‘బర్త్ టూరిజం’పై వేటు

విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కొన్ని తీవ్రమైన కేసుల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది.

  • అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్న విదేశీయుల వీసాలను వెంటనే రద్దు చేశారు.
  • కిడ్నాప్, మానవ అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన కంటెంట్ కలిగిన కేసుల్లో ఉన్నవారి వీసాలను తొలగించారు.
  • కేవలం పిల్లలకు అమెరికా పౌరసత్వం అందించాలనే ఉద్దేశంతో 'బర్త్ టూరిజం' ద్వారా అమెరికా వచ్చిన ఉత్తర ఆఫ్రికాకు చెందిన 100 మందికి పైగా తల్లిదండ్రుల వీసాలను అక్కడి యూఎస్ ఎంబసీ రద్దు చేసింది.
  • కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్యను సోషల్ మీడియాలో వేడుకగా జరుపుకున్న పలువురు విదేశీయుల వీసాలను కూడా విదేశాంగ శాఖ తొలగించింది.

పెరిగిన తనిఖీలు.. మానవ హక్కుల సంఘాల ఆందోళన

కొత్త వీసాల జారీ ప్రక్రియలో సోషల్ మీడియా ఖాతాల తనిఖీలను కూడా అమెరికా ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే, ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కఠిన సోషల్ మీడియా స్క్రీనింగ్ విధానంపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది భావప్రకటనా స్వేచ్ఛను దెబ్బతీయడంతో పాటు వలసదారులపై నిఘా పెట్టడమేనని నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe