...
...
Next Story

సముద్ర గర్భంలోకి ఇరాన్ యుద్ధనౌక: అమెరికా టార్పిడో దాడిలో గాల్లోకి ఎగిరిన ‘IRIS దేనా’.. వీడియో వైరల్

శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌక 'IRIS దేనా'పై అమెరికా జరిపిన టార్పిడో దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ భీకర దాడిలో నౌక గాల్లోకి ఎగిరి సముద్రంలో మునిగిపోతున్న దృశ్యాలను అమెరికా విడుదల చేసింది. 80 మంది మృతి చెందగా, 150 మంది గల్లంతయ్యారు.

Published on: Mar 5, 2026, 06:29:10 IST
Advertisement

కొలంబో/వాషింగ్టన్: హిందూ మహాసముద్రం సాక్షిగా అగ్రరాజ్యం అమెరికా తన ప్రతాపాన్ని చూపింది. ఇరాన్‌కు చెందిన శక్తివంతమైన యుద్ధనౌక ‘IRIS దేనా’ను అమెరికా సబ్‌మెరైన్ టార్పిడో దాడితో సముద్ర గర్భంలోకి పంపింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అమెరికా రక్షణ విభాగం విడుదల చేయగా, అది ఇప్పుడు అంతర్జాలంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

గాల్లోకి ఎగిరి.. సముద్రంలోకి

సముద్ర గర్భంలోకి ఇరాన్ యుద్ధనౌక: అమెరికా టార్పిడో దాడిలో గాల్లోకి ఎగిరిన IRIS దేనా (AP File Photo)
సముద్ర గర్భంలోకి ఇరాన్ యుద్ధనౌక: అమెరికా టార్పిడో దాడిలో గాల్లోకి ఎగిరిన IRIS దేనా (AP File Photo)

అమెరికా విడుదల చేసిన వీడియో ప్రకారం.. టార్పిడో నేరుగా యుద్ధనౌక వెనుక భాగాన్ని (Stern) బలంగా తాకింది. ఆ పేలుడు ధాటికి భారీ యుద్ధనౌక ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడటం అత్యంత భీకరంగా కనిపిస్తోంది. ఈ తీవ్రస్థాయి పేలుడు అనంతరం నౌక వేగంగా సముద్రంలో మునిగిపోయింది. శ్రీలంక తీరానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు ధ్రువీకరించారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే తొలిసారి

ఈ దాడిపై అమెరికా రక్షణ మంత్రి (Secretary of War) పీట్ హెగ్‌సెత్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. "అంతర్జాతీయ జలాల్లో తాము సురక్షితంగా ఉన్నామని భావించిన ఇరాన్ యుద్ధనౌకను నిన్న హిందూ మహాసముద్రంలో మా సబ్‌మెరైన్ ముంచేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక శత్రు నౌకను టార్పిడోతో కూల్చివేయడం ఇదే మొదటిసారి. ఇది నిశ్శబ్ద మరణం" అని ఆయన అభివర్ణించారు.

భారీగా ప్రాణనష్టం.. కొనసాగుతున్న గాలింపు

ఈ ఘటన జరిగిన సమయంలో నౌకలో సుమారు 180 మందికి పైగా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో ఇప్పటివరకు 80 మంది మరణించగా, మరో 150 మంది ఆచూకీ లభ్యం కాలేదని శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత్ హేరత్ తెలిపారు.

అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా ఈ దాడులు జరుగుతున్నట్లు పీట్ హెగ్‌సెత్ స్పష్టం చేశారు. మరిన్ని బాంబర్లు, ఫైటర్ జెట్లు యుద్ధ క్షేత్రంలోకి ప్రవేశిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. "మేము ఇప్పుడే మొదలుపెట్టాం. మా దాడుల వేగం పెరుగుతుందే తప్ప తగ్గదు. ఇరాన్ సామర్థ్యం గంట గంటకూ ఆవిరైపోతోంది. అమెరికా బలం మరింత పెరగడమే కాకుండా ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుంది" అని హెగ్‌సెత్ ఉద్ఘాటించారు.

ప్రస్తుతం గల్లంతైన వారి కోసం శ్రీలంక వైమానిక దళం సాయంతో హిందూ మహాసముద్రంలో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):

IRIS దేనా అంటే ఏమిటి?

ఇది ఇరాన్ నౌకాదళానికి చెందిన ఒక శక్తివంతమైన ఫ్రిగేట్ (యుద్ధనౌక).

ఈ దాడి ఎక్కడ జరిగింది?

శ్రీలంకలోని గాలే తీరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో జరిగింది.

ప్రాణనష్టం ఎంతవరకు ఉంది?

ప్రస్తుత నివేదికల ప్రకారం 80 మంది మరణించారు, 150 మంది వరకు గల్లంతయ్యారు. 30 మందిని రక్షించారు.

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటే ఏమిటి?

ఇరాన్ లక్ష్యంగా అమెరికా చేపట్టిన సైనిక చర్యకు పెట్టిన పేరు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks