Artificial Intelligence : ఏఐని వాడి వెనెజువెలా అధ్యక్షుడిని పట్టుకున్న అమెరికా!
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవడానికి అమెరికా సైన్యం చేపట్టిన రహస్య ఆపరేషన్‌లో ఏఐని వాడటం ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఏఐ ఇప్పుడు కేవలం సమాచారానికే పరిమితం కాకుండా, యుద్ధరంగంలో వ్యూహాలను రచించడం, దేశాధినేతలను లక్ష్యంగా చేసుకోవడం వరకు ఎదిగిందని ఈ ఘటన నిరూపిస్తోంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రపంచ జాబ్ మార్కెట్ అల్లకల్లోలంగా మారిన వేళ, అమెరికా నుంచి మరో సంచలన వార్త బయటకు వచ్చింది. గత నెలలో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవడానికి అమెరికా సైన్యం చేపట్టిన అత్యంత రహస్య ఆపరేషన్‌లో ఏఐ కీలక పాత్ర పోషించినట్లు సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. పెంటగాన్ తన క్లాసిఫైడ్ కార్యకలాపాల కోసం మొదటిసారిగా ఏఐని వాడింది. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని అంథ్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసింది.
మదురో అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?
వెనెజువెలా రాజధాని కరాకస్‌లోని పలు ప్రాంతాలపై బాంబు దాడులు జరిగిన అనంతరం, మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ వ్యూహాత్మక ఆపరేషన్‌లో ‘క్లాడ్’ అనే ఏఐ టూల్‌ను వినియోగించారు. సాధారణంగా ఏఐ కంపెనీలు తమ సాంకేతికతను హింసకు లేదా ఆయుధాల తయారీకి వాడకూడదని నిబంధనలు విధిస్తాయి. అంథ్రోపిక్ మార్గదర్శకాలు కూడా క్లాడ్ ద్వారా నిఘా పెట్టడాన్ని లేదా యుద్ధాలకు సహకరించడాన్ని నిషేధిస్తున్నాయి. అయినప్పటికీ, ఈ ఆపరేషన్‌లో దీని వాడకం జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పాలంటిర్ భాగస్వామ్యం.. 200 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్!
పెంటగాన్‌కు డేటా సేవలు అందించే పాలంటిర్ టెక్నాలజీస్ సంస్థతో అంథ్రోపిక్‌కు ఉన్న భాగస్వామ్యం కారణంగానే 'క్లాడ్' సైనిక అవసరాలకు అందుబాటులోకి వచ్చింది. గతేడాది వేసవిలో సుమారు 200 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంపై అంథ్రోపిక్ సంతకం చేసింది. అయితే, తమ ఏఐని ప్రాణాంతక ఆపరేషన్లలో వాడటంపై అంథ్రోపిక్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, ఈ భారీ కాంట్రాక్టును రద్దు చేయాలని అమెరికా అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
సైనిక అవసరాలు వర్సెస్ నైతిక విలువలు..
అంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ స్వయంగా ఏఐ వినియోగంపై కఠినమైన నియంత్రణలు ఉండాలని కోరుతున్నారు. ముఖ్యంగా ‘స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాణాంతక ఆపరేషన్లు’, అంతర్గత నిఘా కోసం ఏఐని వాడటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశం ఇప్పుడు పెంటగాన్, అంథ్రోపిక్ మధ్య ప్రధాన వివాదంగా మారింది.
మరోవైపు, అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ జనవరిలో కీలక వ్యాఖ్యలు చేశారు. "యుద్ధం చేయడంలో సహకరించని ఏఐ మోడళ్లతో పెంటగాన్ కలిసి పనిచేయదు" అని ఆయన స్పష్టం చేశారు.
చాలా ఏఐ కంపెనీలు కేవలం సాధారణ పరిపాలన కోసం మాత్రమే టూల్స్ అందిస్తుండగా, క్లాసిఫైడ్ నెట్‌వర్క్‌లలో అందుబాటులో ఉన్న ఏకైక మోడల్ 'క్లాడ్' మాత్రమే కావడం గమనార్హం.
కంపెనీల క్రెడిబిలిటీ కోసం పాకులాట?
తీవ్రమైన పోటీ నెలకొన్న ప్రస్తుత మార్కెట్‌లో, సైనిక అవసరాలకు తమ టెక్నాలజీ వాడటం వల్ల ఏఐ కంపెనీలకు పెట్టుబడిదారుల వద్ద భారీ విలువ లభిస్తుంది. తమ టెక్నాలజీకి ఉన్న శక్తిని నిరూపించుకోవడానికి ఇది ఒక మార్గంగా భావించినప్పటికీ, నైతిక నిబంధనలు, ప్రభుత్వ అవసరాల మధ్య ఇప్పుడు పెద్ద యుద్ధమే నడుస్తోంది.
ప్రశ్నలు- సమాధానాలు :-
ప్రశ్న- నికోలస్ మదురో ఆపరేషన్‌లో 'క్లాడ్' ఏఐ పాత్ర ఏమిటి?
సమాధానం- వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవడానికి అమెరికా సైన్యం చేపట్టిన రహస్య ఆపరేషన్‌లో అంథ్రోపిక్ సంస్థకు చెందిన 'క్లాడ్' ఏఐని ఉపయోగించారు. ఇది క్షేత్రస్థాయిలో డేటా విశ్లేషణకు, వ్యూహ రచనకు సహకరించినట్లు సమాచారం. అయితే, అంథ్రోపిక్ నిబంధనల ప్రకారం క్లాడ్‌ను హింసాత్మక లేదా నిఘా కార్యకలాపాలకు వాడకూడదు. ఈ నిబంధనలను అతిక్రమించి దీనిని వాడటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ప్రశ్న- అంథ్రోపిక్, పెంటగాన్ మధ్య వివాదానికి కారణమేమిటి?
సమాధానం- ప్రధానంగా ఏఐ వినియోగంపై ఉన్న నైతిక నిబంధనలే ఈ వివాదానికి మూలం. అంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్, తమ ఏఐని ప్రాణాంతక ఆపరేషన్లలో వాడకూడదని స్పష్టం చేస్తున్నారు. కానీ, అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) మాత్రం యుద్ధాల్లో ఉపయోగపడని టెక్నాలజీతో తమకు పనిలేదని తెగేసి చెబుతోంది. ఈ భేదాభిప్రాయాల వల్ల అంథ్రోపిక్‌తో కుదుర్చుకున్న సుమారు 200 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1,600 కోట్లు) ఒప్పందాన్ని రద్దు చేసే దిశగా అమెరికా అధికారులు అడుగులు వేస్తున్నారు.

E-Paper












