Artificial Intelligence : 'మీది స్క్రీన్​ ముందు కూర్చుని చేసే ఉద్యోగం అయితే.. ఏఐ లాగేసుకుంటుంది!'

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది భవిష్యత్తులో వచ్చే మార్పు కాదని, అది ఇప్పటికే మన మధ్య ఉన్న ఒక శక్తివంతమైన విప్లవం అని హైపర్‌రైట్ సీఈఓ మ్యాట్ షూమర్ పేర్కొన్నారు. ముఖ్యంగా కంప్యూటర్ స్క్రీన్లపై ఆధారపడి పనిచేసే 'వైట్ కాలర్' ఉద్యోగాలు ఆటోమేషన్ ముంగిట ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

Published on: Feb 13, 2026 12:20 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​తో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు ప్రమాదంలో పడిన తరుణంలో ఏఐ స్టార్టప్​ “హైపర్​రైట్​” సీఈఓ మ్యాట్​ షూమర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏఐ అనేది కేవలం ఊహల్లో ఉండే సాంకేతికత కాదని, అది పరిగణనలోకి తీసుకోవాల్సిన ఒక మహా శక్తిగా మారిందని అన్నారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన రాసిన ‘సమ్‌థింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్’ (ఏదో పెద్ద మార్పు జరుగుతోంది) అనే వ్యాసంలో.. కంప్యూటర్ స్క్రీన్ ద్వారా సాగే వైట్ కాలర్ ఉద్యోగాలు ఆటోమేషన్ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని తీవ్రంగా హెచ్చరించారు.

ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​తో అనేక ఉద్యోగాలకు ముప్పు!
ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​తో అనేక ఉద్యోగాలకు ముప్పు!

'ఏఐతో కంప్యూటర్​ ముందు కూర్చునే ఉద్యోగాలకే అధిక ప్రమాదం!'

డిజిటల్ రూపంలో ఉండి, ఒక క్రమపద్ధతిలో పదే పదే చేసే పనులను పూర్తి చేసే సామర్థ్యాన్ని ఏఐ వ్యవస్థలు వేగంగా పెంపొందించుకుంటున్నాయని షూమర్ వివరించారు. 2020లో కోవిడ్-19 మహమ్మారి మార్కెట్లను కుదిపేయడానికి ముందున్న పరిస్థితులతో ఇప్పటి ఏఐ పురోగతిని ఆయన పోల్చారు. ప్రస్తుతం మనం చూస్తున్న మార్పుల వేగాన్ని, వాటి ప్రభావాన్ని సమాజం తక్కువ అంచనా వేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆరేళ్లుగా ఏఐ వ్యాపారాలను సృష్టించడం, వాటికి నిధులు సమకూర్చడం వంటి రంగాల్లో ఉన్న షూమర్.. టెక్ రంగం వెలుపల ఉన్న తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ మార్పు తీవ్రతను వివరించడానికి ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు.

"మనం ఇప్పుడు 'ఇదంతా అతిశయోక్తి' అని భావించే దశలో ఉన్నాం. కానీ ఇది కోవిడ్ కంటే కూడా చాలా పెద్ద మార్పు అని నేను నమ్ముతున్నాను," అని ఆయన రాశారు. ఈ క్రమంలోనే కంప్యూటర్​ ముందు కూర్చునే చేసే ఉద్యోగాలు రిప్లేస్​ అవ్వొచ్చని అన్నారు.

ఏఐ ఇప్పటికే చేస్తున్న పనులు

కోడింగ్ రాయడం, అందులోని లోపాలను సరిదిద్దడం (డిబగ్గింగ్​), న్యాయపరమైన పరిశోధనలు (లీగల్​ రీసెర్చ్​), నివేదికల తయారీ వంటి సంక్లిష్టమైన సాంకేతిక పనులను ఏఐ ఇప్పటికే సమర్థవంతంగా నిర్వహిస్తోందని షూమర్​ గుర్తుచేశారు. గతంలో ఒక ఇంజనీర్ల బృందం అవసరమయ్యే సాంకేతిక పనులను ఇప్పుడు తన పనిలో ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ ఒంటిచేత్తో చేస్తోందని ఆయన వెల్లడించారు.

ఏఐ ప్రభావానికి గురయ్యే ప్రధాన రంగాలు

షూమర్ విశ్లేషణ ప్రకారం.. "స్క్రీన్ ఆధారిత" వృత్తులు ప్రాథమికంగా ప్రభావితం కానున్నాయి. అవేమిటంటే:

న్యాయ రంగం: కాంట్రాక్టులను చదవడం, చట్టపరమైన ముసాయిదాల తయారీ, పరిశోధన.

ఆర్థిక విశ్లేషణ: ఫైనాన్షియల్ మోడల్స్ నిర్మించడం, పెట్టుబడి నివేదికలు రాయడం, డేటా విశ్లేషణ.

కంటెంట్/రచన: జర్నలిజం, మార్కెటింగ్, టెక్నికల్ రైటింగ్, రిపోర్ట్స్ తయారీ.

సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్: రోజుల తరబడి సాగే ప్రాజెక్టుల నిర్వహణ.

వైద్య విశ్లేషణ: ల్యాబ్ రిపోర్టుల విశ్లేషణ, స్కాన్ రిపోర్టులను చదవడం, వ్యాధి నిర్ధారణ సూచనలు.

కస్టమర్ సర్వీస్: సంక్లిష్టమైన, బహుళ దశలతో కూడిన సమస్యల పరిష్కారం.

"మీ ఉద్యోగం కంప్యూటర్ స్క్రీన్ మీద జరుగుతుంటే.. దానిలోని కీలక భాగాలను ఏఐ భర్తీ చేయబోతోంది. ఇది ఎప్పుడో జరిగే విషయం కాదు, ఇప్పటికే ప్రారంభమైంది," అని షూమర్ హెచ్చరించారు. అంటే.. మీ పనిలో ఎక్కువ భాగం చదవడం, రాయడం, విశ్లేషించడం, నిర్ణయాలు తీసుకోవడం, కీబోర్డ్ ద్వారా కమ్యూనికేట్ చేయడం వంటివి ఉంటే, అది ఆటోమేషన్ ముంగిట ఉన్నట్లేనని దీని అర్థం.

ఏఐ విప్లవం నుంచి మన ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఏం చేయాలి?

మ్యాట్ షూమర్ సూచన ప్రకారం.. ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు ఏఐ టూల్స్‌తో ప్రయోగాలు చేయడం అలవాటు చేసుకోవాలి. కేవలం సాధారణ ప్రశ్నలకే కాకుండా, మీ రోజువారీ సంక్లిష్టమైన పనుల్లో ఏఐని ఎలా ఉపయోగించవచ్చో నేర్చుకోవాలి. ఏఐని భయంలా కాకుండా ఒక శక్తివంతమైన సాధనంలా మలచుకున్న వారే భవిష్యత్తులో రాణించగలరు!

స్టాక్​ మార్కెట్​లపై ప్రభావం..

ఏఐతో ఉద్యోగాలు ఊడిపోతాయన్న భయం మునుపెన్నడు లేని విధంగా ఇప్పుడు అందరిలోనూ ఉంది. మరీ ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పూర్తి వ్యవహారం ఇండియాతో సహా ప్రపంచ స్టాక్​ మార్కెట్​లపై పడుతోంది. ఉద్యోగాలు ఊడిపోతాయన్న భయం, కంపెనీల ఆడర్లు పడిపోతాయన్న ఆందోళనల మధ్య ఐటీ ఇండెక్స్​లు కుప్పకూలుతున్నాయి.

దేశీయంగా దేశీయంగా, శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో నిఫ్టీ ఐటీ సూచీ 2.7శాతం నష్టాల్లో (ఉదయం 11:40కి) కొనసాగుతోంది. ఇంకా చెప్పాలంటే.. ఈ నెల మొదట్లో 40,300 లెవల్స్​ దగ్గర ఉన్న ఐటీ సూచీ.. ఇప్పుడు 32,300 స్థాయిల వద్దకు చేరింది. దీని ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో రియాల్టీ ఇండెక్స్​తో పాటు నిఫ్టీ, బ్యాంక్​ నిఫ్టీ, సెన్సెక్స్​లు కూడా భారీ నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

ప్రశ్నలు- సమాధానాలు:-

ప్రశ్న- ఏఐ ప్రభావానికి ఎక్కువగా గురయ్యే 'వైట్ కాలర్' ఉద్యోగాలు ఏంటి?

సమాధానం : ప్రధానంగా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని, కీబోర్డ్ ద్వారా సమాచారాన్ని విశ్లేషించే వృత్తులు ఏఐ ప్రభావానికి ఎక్కువగా గురవుతాయి. సాఫ్ట్‌వేర్ కోడింగ్, లీగల్ రీసెర్చ్, ఫైనాన్షియల్ అనాలిసిస్, కంటెంట్ రైటింగ్, డేటా ఎంట్రీ, కస్టమర్ సర్వీస్ వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. ఏ పనినైతే ఒక క్రమపద్ధతిలో డిజిటల్ రూపంలో చేయవచ్చో, ఆ పనులను ఏఐ వేగంగా భర్తీ చేయగలదు.

ప్రశ్న: ఏఐ రాకతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు పూర్తిగా మాయమవుతాయా?

జవాబు: ప్రస్తుతానికి ఇది అతిపెద్ద భయంగా కనిపిస్తోంది. సాధారణంగా జూనియర్ లెవల్‌లో చేసే పనులైన రిపోర్టుల తయారీ, ప్రాథమిక కోడింగ్, డేటా అనాలిసిస్‌ను ఏఐ ఇప్పుడు అత్యంత ఖచ్చితత్వంతో చేస్తోంది.