Real Estate : AI దెబ్బకు ఐటీ ఉద్యోగాలు మాయం? బెంగళూరులో ఇళ్ల ధరలు పడిపోతాయా? నిపుణుల విశ్లేషణ ఇది..

వచ్చే 6 నుంచి 12 నెలల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పనిని ఏఐ చేసేస్తుందని ఆంత్రోపిక్ సీఈఓ చేసిన వ్యాఖ్యలు బెంగళూరు ప్రాపర్టీ మార్కెట్‌లో కలకలం రేపాయి. ఐటీ ఉద్యోగాల కోత పడితే, గృహ నిర్మాణ రంగంపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Published on: Feb 09, 2026 9:10 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందనే భయాలు పెరుగుతున్న తరుణంలో, బెంగళూరు రియల్​ ఎస్టేట్​ మార్కెట్‌పై ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఒకవేళ నగర ఐటీ ఇంజన్ నెమ్మదిస్తే, రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? ఇళ్ల ధరలు పడిపోతాయా? అనే ప్రశ్న కోసం ఇప్పుడు అందరు సమాధానాలను వెతుకుతున్నారు.

ఐటీ ఉద్యోగుల్లో భయం.. రియల్​ ఎస్టేట్​ పరిస్థితేేంటి? (Pexels )
ఐటీ ఉద్యోగుల్లో భయం.. రియల్​ ఎస్టేట్​ పరిస్థితేేంటి? (Pexels )

బెంగళూరు రియల్​ ఎస్టేట్​- అసలు ఈ చర్చ ఎందుకు మొదలైంది?

ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కేంద్రబిందువుగా మారాయి. వచ్చే 6 నుంచి 12 నెలల్లో అనేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ప్రస్తుతం చేస్తున్న పనిని ఏఐ చేసేస్తుందని, తద్వారా వారు పనికి 'అవసరం లేని వారు' గా మారుతారని ఆయన హెచ్చరించారు. "నా కంపెనీలోనే చాలా మంది ఇంజనీర్లు ఇప్పుడు కోడ్ రాయడం లేదు, మోడల్ రాసిన కోడ్‌ను ఎడిట్ చేస్తున్నారు," అని ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఇటీవలే పేర్కొన్నారు.

దీని వల్ల ప్రపంచ ఐటీ ఉద్యోగుల్లో భయం పట్టుకుంది! అనేక ఉద్యోగాల పరిస్థితి సందిగ్ధంలో పడింది.

బెంగళూరు రియల్​ ఎస్టేట్​- ఇళ్ల కొనుగోళ్లపై డాలర్ ఆదాయం ప్రభావం..

చాలా మంది రెడిట్ వినియోగదారులు ఉద్యోగాల కోత పడితే ఇళ్ల డిమాండ్ తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

డాలర్ ఆదాయం: బెంగళూరు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే వారిలో విదేశాల్లో ఉంచి డాలర్లలో సంపాదించే వారే చాలా మంది ఉన్నారు. విదేశీ అవకాశాలు తగ్గితే, అది ప్రాపర్టీ కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

స్థానిక కొనుగోలుదారులకు లాభం: దీనివల్ల ఒక సానుకూల అంశం ఏంటంటే.. విదేశీ కరెన్సీలో సంపాదించని స్థానిక కొనుగోలుదారులకు ఇళ్ల ధరలు అఫార్డిబుల్​గా మారే అవకాశం ఉంది.

బెంగళూరు రియల్​ ఎస్టేట్​- ‘కే-షెప్డ్​’ మార్కెట్ ఆవిర్భావం!

రియల్ ఎస్టేట్ మార్కెట్ భవిష్యత్తులో స్థిరమైన వృద్ధికి బదులుగా రెండు మార్గాలుగా చీలిపోయే అవకాశం ఉందని కొందరు వాదిస్తున్నారు:

ధరల సున్నితత్వం: బెంగళూరు కొనుగోలుదారులు ఒక్కో చదరపు అడుగు ధరపై చాలా జాగ్రత్తగా ఉంటారు. ముంబై లేదా ఎన్‌సీఆర్ తరహాలో అల్ట్రా-లగ్జరీ ఇళ్లకు భారీ ప్రీమియం ఇక్కడ ఉండదు.

మార్కెట్ విభజన: ప్రస్తుతం రూ. 3–5 కోట్ల మధ్య ఎక్కువగా అమ్ముడవుతున్న ఇళ్ల స్థానంలో, భవిష్యత్తులో రూ. 1–2 కోట్ల మధ్య ఉండే ఇళ్లకు డిమాండ్ పెరగవచ్చు. అలాగే రూ. 7 కోట్లకు పైబడిన అల్ట్రా-లగ్జరీ ఇళ్ల విభాగం చాలా చిన్నదిగా మిగిలిపోవచ్చు.

గత అనుభవాలు - భయపడాల్సిన అవసరం లేదంటూ..

కొందరు వినియోగదారులు గతంలో జరిగిన సాంకేతిక మార్పులను గుర్తుచేస్తూ ధైర్యం చెబుతున్నారు:

డాట్-కామ్ బబుల్: అప్పట్లో కిరాణా దుకాణాలు మాయమవుతాయని భయపడ్డారు, కానీ అలా జరగలేదు.

కోవిడ్ సమయం: ఆన్‌లైన్ విద్య వల్ల క్లాస్‌రూమ్‌లు, ఓటీటీ వల్ల సినిమా హాల్స్ మూతపడతాయని అనుకున్నారు, కానీ అవి నేటికీ కొనసాగుతున్నాయి.

పాత పద్ధతులు మారినా, కొత్త ఉద్యోగాలు, మార్పులకు అనుగుణంగా కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయని వీరు అభిప్రాయపడ్డారు. ఫలితంగా రియల్​ ఎస్టేట్​కి ఎటువంటి హానీ జరగదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నిపుణుల విశ్లేషణ: బెంగళూరు రియల్​ ఎస్టేట్​ ధరలు పడిపోతాయా?

అసెట్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ పారిక్ ప్రకారం, ధరలు పడిపోయే అవకాశమే లేదు!

చారిత్రక వృద్ధి: 2014 నుంచి 2020 వరకు బెంగళూరులో ఇళ్ల ధరలు ఏడాదికి కేవలం 3–3.5% మాత్రమే పెరిగాయి.

కోవిడ్ తర్వాతి జంప్: గత 3-4 ఏళ్లలో చూసిన 60-70% ధరల పెరుగుదల ఒక 'కరెక్షన్' మాత్రమే. అంటే ఐదేళ్ల పాటు స్థిరంగా ఉన్న ధరలు ఒక్కసారిగా సర్దుబాటు అయ్యాయి.

అంటే, ఐటీ రంగంలో నియామకాలు నెమ్మదించినా, ధరలు పడిపోవని, అయితే గత కొన్నేళ్లుగా చూసినంత వేగంగా కాకుండా, మార్కెట్ చాలా నెమ్మదిగా, స్థిరంగా పెరుగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More