యూఎస్ వీసా బాండ్ నిబంధన: భారత్‌పై ప్రభావం ఉందా? 50 దేశాల జాబితా ఇదే

అమెరికా బీ1/బీ2 వీసాల జారీ ప్రక్రియలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. నిర్దేశిత 50 దేశాల పౌరులు 10,000 డాలర్ల నుంచి 20,000 డాలర్ల వరకు రిఫండబుల్ వీసా బాండ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ జాబితాలో భారతదేశం ఉందో లేదో తెలుసుకోండి.

Published on: Oct 3, 2026, 16:02:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అమెరికా పర్యటనకు వెళ్లాలనుకునే వ్యాపార, పర్యాటక ప్రయాణికులకు సంబంధించి యూఎస్ ప్రభుత్వం వీసా నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఎంపిక చేసిన 50 దేశాల పౌరులకు బీ1/బీ2 వీసాలు జారీ చేయాలంటే 10,000 డాలర్ల నుంచి 20,000 డాలర్ల వరకు (సుమారు రూ. 8.4 లక్షల నుంచి రూ. 16.8 లక్షలు) గ్యారంటీ డిపాజిట్ (వీసా బాండ్) చెల్లించడం తప్పనిసరి చేసింది.

యూఎస్ వీసా బాండ్ నిబంధన
యూఎస్ వీసా బాండ్ నిబంధన

ఈ నిబంధనలకు సంబంధించిన సమగ్ర జాబితాను యూఎస్ విదేశాంగ శాఖ 2026 అక్టోబర్ 2న అధికారికంగా ఖరారు చేసింది. ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ సెక్షన్ 221(జి)(3) ప్రకారం రూపకల్పన చేసిన ఈ నియమావళి, 2026 ఆగస్టు 3 నుంచి అమలులోకి వచ్చిన తుది నిబంధనల ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన కొనసాగుతోంది.

యూఎస్ వీసా బాండ్ అంటే ఏమిటి?

యూఎస్ వీసా బాండ్ అనేది నిర్దేశిత దేశాల దరఖాస్తుదారులు బీ1/బీ2 (వ్యాపార, పర్యాటక ప్రయాణాలు) వీసా అర్హత పొందడానికి చెల్లించాల్సిన తాత్కాలిక భద్రతా డిపాజిట్. జాబితాలో ఉన్న దేశాల పౌరులు వీసా అర్హతలు సాధించిన తర్వాత, యూఎస్ కాన్సులర్ అధికారి ఇంటర్వ్యూ సమయంలో 10,000 డాలర్ల నుంచి 20,000 డాలర్ల మధ్య బాండ్ మొత్తాన్ని నిర్ణయిస్తారు.

ఈ బాండ్ సాధారణ వీసా దరఖాస్తు రుసుము కంటే భిన్నమైనది. ప్రయాణికుడు అనుమతించిన వ్యవధి ముగిసేలోపు అమెరికా నుంచి తిరిగి స్వదేశానికి చేరుకోవడం వంటి అన్ని షరతులను నెరవేరిస్తే ఈ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. అయితే, కేవలం బాండ్ చెల్లించినంత మాత్రాన వీసా ఆమోదం లభిస్తుందనే గ్యారంటీ ఉండదు. కాన్సులర్ అధికారి నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు దరఖాస్తుదారులు ఎలాంటి డబ్బు చెల్లించవద్దని విదేశాంగ శాఖ సూచించింది. బాండ్ చెల్లించాల్సిన వారు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఫారమ్ I-352 నింపి, Pay.gov పోర్టల్ ద్వారా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఏంటి?

వీసా గడువు ముగిసినప్పటికీ చాలామంది విదేశీయులు అమెరికాలోనే అక్రమంగా ఉండిపోతుండటాన్ని (ఓవర్‌స్టే) అరికట్టేందుకు యూఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నివేదికలోని ఆధారాల ప్రకారం, బీ1/బీ2 వీసాదారుల్లో ఓవర్‌‌స్టే రేటు ఎక్కువగా ఉన్న దేశాలపైనే ఈ నిబంధన విధించారు. తాత్కాలిక పర్యటనపై వచ్చే విదేశీయులు నిబంధనలు పాటించి, నిర్ణీత సమయంలోగా తమ దేశాలకు తిరుగుపయనం అయ్యేలా చూడటమే ఈ చర్య ముఖ్య ఉద్దేశం.

బాండ్ పొందిన ప్రయాణికులు రాకపోకల కోసం ప్రత్యేక నిబంధనలు పాటించాలి. వారు తప్పనిసరిగా సీబీపీ (CBP) ప్రీ-క్లియరెన్స్ సదుపాయం ఉన్న ఆమోదిత వాణిజ్య విమానాశ్రయాల ద్వారానే ప్రయాణించాలి. నేలమార్గం, సముద్రరేవులు, చార్టర్డ్ విమానాలు లేదా జనరల్ ఏవియేషన్ సేవల ద్వారా సరిహద్దులు దాటడానికి అనుమతి ఉండదు.

వీసా బాండ్ జాబితాలో భారత్ ఉందా?

భారతదేశ పౌరులకు ఇది ఊరటనిచ్చే అంశం. యూఎస్ విదేశాంగ శాఖ విడుదల చేసిన 50 దేశాల జాబితాలో భారతదేశం పేరు లేదు. కాబట్టి భారత పాస్‌పోర్ట్ కలిగిన ప్రయాణికులు అమెరికా బీ1/బీ2 వీసా కోసం ఎలాంటి వీసా బాండ్ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు.

వీసా బాండ్ పరిధిలోకి వచ్చే 50 దేశాల జాబితా

ఆఫ్రికా, ఆసియా, కరేబియన్, పసిఫిక్ ప్రాంతాలకు చెందిన 50 దేశాలను ఈ జాబితాలో చేర్చారు.

దక్షిణాసియా: బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్.

ఆసియా / మధ్య ఆసియా: కంబోడియా, జార్జియా, కిర్గిజ్ రిపబ్లిక్, మంగోలియా, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్.

ఆఫ్రికా: అల్జీరియా, అంగోలా, బెనిన్, బోట్స్వానా, బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కోట్ డి ఐవోయిర్, జిబౌటీ, ఇథియోపియా, గాబన్, గాంబియా, గినియా, గినియా-బిస్సావు, లెసోథో, మలావి, మౌరిటానియా, మారిషస్, మొజాంబిక్, నమీబియా, నైజీరియా, సావో తోమ్ అండ్ ప్రిన్సిపే, సెనెగల్, సీషెల్స్, టాంజానియా, టోగో, ఉగాండా, జాంబియా, జింబాబ్వే.

కరేబియన్ / అమెరికాస్: ఆంటిగ్వా అండ్ బార్బుడా, క్యూబా, డొమినికా, గ్రెనడా, నికరాగువా, వెనిజులా.

పసిఫిక్ ప్రాంతం: ఫిజీ, పాపువా న్యూ గినియా, టోంగా, తువాలు, వనౌతు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More