బ్యాడ్ న్యూస్! H-1B ఉద్యోగుల జీతాలను పెంచాలని ట్రంప్ ప్రభుత్వం ప్లాన్..
హెచ్-1బీ వంటి వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయుల జీతాలను పెంచాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. సాధారణంగా జీతాల పెంపు అనేది శుభవార్త అవుతుంది. కానీ ట్రంప్ ప్లాన్ మాత్రం.. విదేశీయులకు బ్యాడ్ న్యూస్‌ని అందిస్తోంది!
అమెరికాలో హెచ్-1బీ, పెర్మ్ (PERM) ఉద్యోగాలకు సంబంధించి వేతన రక్షణను పెంచేందుకు ట్రంప్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కార్మిక శాఖ ఇప్పటికే బడ్జెట్ కార్యాలయానికి సమర్పించింది. ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తే, హెచ్-1బీ వీసాదారుల కనీస వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కానీ ఇది అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి శుభవార్త కాదు! బ్యాడ్ న్యూస్!

అమెరికా కార్మికులకే తొలి ప్రాధాన్యం!
“ఇంప్రూవింగ్ వేజ్ ప్రొటెక్షన్స్ ఫర్ హెచ్-1బీ అండ్ పెర్మ్ ఎంప్లాయిమెంట్” పేరుతో అందించిన ఈ ప్రతిపాదన.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అంతర్జాతీయ విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది! హెచ్-1బీ వీసాదారుల జీతాలను పెంచడం ద్వారా, అమెరికా కంపెనీలు విదేశీయులను నియమించుకోవడాన్ని కష్టతరం చేయడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. తద్వారా స్థానిక అమెరికన్ కార్మికులకు ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఈ ప్రతిపాదనకు సంబంధించిన పూర్తి వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ, గతంలో ట్రంప్ హయాంలో తెచ్చిన కఠిన నిబంధనల తరహాలోనే ఇవి ఉండబోతున్నాయని సమాచారం.
గతంలో ఏం జరిగింది?
గత టర్మ్‌లో ట్రంప్ ప్రభుత్వం ఇలాగే కనీస వేతన ప్రమాణాలను పెంచుతూ ఒక నిబంధనను తెచ్చింది. హెచ్-1బీ, హెచ్-1బీ1, ఈ-3 వంటి వీసాలతో అమెరికాలోకి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న విదేశీయుల జీతాలపై అప్పటివరకు ఉన్న విధానాన్ని రివైజ్ చేయాలని 2021లోనే డీఓఎల్ ప్రతిపాదన చేసింది. అయితే, దీనిపై న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడం, ఆ తర్వాత వచ్చిన బైడెన్ ప్రభుత్వం దీనికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ ప్రతిపాదన ముందుకు జరగలేదు.
2025లో ట్రంప్ మరోసారి అధికారంలోకి రావడంతో, ఈ వేతన నిబంధనలను తిరిగి రాయాలని కార్మిక శాఖను ఆదేశించారు.
"ఈ నిర్ణయం హెచ్-1బీ, పెర్మ్ ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కంపెనీలు ఈ పరిణామాలను నిశితంగా గమనించాలి," అని ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమాన్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
వేతనాల లెక్కింపులో మార్పులు..
సాధారణంగా అమెరికా కార్మిక శాఖ (డీఓఎల్) విదేశీ కార్మికుల వేతనాలను నాలుగు స్థాయిల్లో లెక్కిస్తుంది. స్థానిక అమెరికన్ కార్మికులకు దక్కే వేతనాలకు సమానంగా విదేశీయులకు కూడా జీతాలు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనివల్ల తక్కువ జీతాలకే విదేశీయులను తెచ్చుకుని, స్థానిక అమెరికన్ల అవకాశాలను దెబ్బతీసే పరిస్థితి ఉండదని ప్రభుత్వం చెబుతోంది.
ఐటీ, హెల్త్‌కేర్ రంగాలపై తీవ్ర ప్రభావం..
ఈ కొత్త రూల్ వల్ల అమెరికాలోని టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేతనాల భారం: ఉదాహరణకు, గతంలో 1,20,000 డాలర్ల (సుమారు రూ. 1 కోటి) జీతం ఇచ్చే పొజిషన్‌కు, కొత్త రూల్ ప్రకారం దాదాపు 2,30,000 డాలర్ల నుంచి 2,40,000 డాలర్ల (సుమారు ₹2 కోట్లు) వరకు చెల్లించాల్సి రావచ్చు. ఇది కంపెనీలపై పెను భారన్ని వేస్తుంది!
కొత్త దరఖాస్తులే కాదు: ఇది కేవలం కొత్తగా అప్లై చేసే వారికే కాకుండా, వీసా ఎక్స్టెన్షన్, ట్రాన్స్‌ఫర్ చేసుకునే వారికి కూడా వర్తిస్తుంది.
ఉద్యోగాలు ఇతర దేశాలకు: జీతాల భారం పెరిగితే, కంపెనీలు అమెరికాలో రిక్రూట్‌మెంట్‌ను తగ్గించి, ఆ పనులను భారత్ వంటి ఇతర దేశాలకు ఔట్సోర్సింగ్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రతిపాదన గనుక చట్టరూపం దాలిస్తే, అమెరికాలో స్థిరపడాలనుకునే వేలాది మంది భారతీయులపై, ముఖ్యంగా ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


