జీతాల నుంచి సెలవుల వరకు- కొత్త లేబర్ కోడ్స్‌పై 7 కీలక విషయాలు..
కార్మిక చట్టాల్లో చరిత్రాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 29 చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్స్‌ని ప్రవేశపెట్టింది. ఇవి ఉద్యోగులకు అనేక విధాలుగా ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ నేపథ్యంలో లేబర్ కోడ్స్‌లోని ముఖ్యంశాలను ఇక్కడ తెలుసుకోండి..
భారతదేశం తన కార్మిక వ్యవస్థను సమూలంగా మార్చేసింది! గతంలో ఉన్న 29 వేర్వేరు చట్టాలను నాలుగు సరళీకృత లేబర్ కోడ్స్ కిందకు తీసుకువచ్చింది. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, కార్యాలయ భద్రత వంటి అంశాలను కవర్ చేస్తూ తీసుకొచ్చిన ఈ సంస్కరణలు.. కార్మికులకు మెరుగైన రక్షణ కల్పించడం, ఉద్యోగులు- యజమానులు ఇద్దరికీ మరింత స్థిరమైన వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

గిగ్ వర్కర్లు, ఫిక్స్‌డ్-టర్మ్ సిబ్బంది నుంచి తోటల కార్మికులు, ఐటీ ఉద్యోగుల వరకు.. ఈ మార్పులు దాదాపు ప్రతి కార్మిక విభాగాన్ని ప్రభావితం చేయనున్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా పత్రికా ప్రకటన ఆధారంగా, భారతదేశ కొత్త కార్మిక చట్టాలలోని ముఖ్య అంశాలను ఇక్కడ తెలుసుకోడి..
కొత్త లేబర్ కోడ్స్ ముఖ్యాంశాలు
అందరికీ కనీస వేతనం, ఫార్మలైజేషన్
మొదటిసారిగా, రంగం, నైపుణ్యం స్థాయి లేదా ఉద్యోగం రకంతో సంబంధం లేకుండా, ప్రతి కార్మికుడికి కనీస వేతనం పొందే చట్టబద్ధమైన హక్కు లభించింది.
యజమానులు తప్పనిసరిగా నియామక పత్రాలను జారీ చేయాలి. దీనివల్ల అసంఘటిత, గిగ్ వర్కర్లతో పాటు లక్షలాది మంది కార్మికులకు ఫార్మల్ ఎంప్లాయ్‌మెంట్ రికార్డులు లభిస్తాయి.
సామాజిక భద్రతా పరిధి విస్తరణ
అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్, బీమా, ఈఎస్‌ఐసీ ప్రయోజనాలకు అర్హులు.
గిగ్, ప్లాట్‌ఫారమ్ వర్కర్ల కోసం ప్రత్యేక సామాజిక-భద్రతా నిధిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అగ్రిగేటర్లు (ఊబర్, స్విగ్గి, జొమాటో వంటి సంస్థలు) తమ టర్నోవర్‌లో 1 నుంచి 2 శాతం వరకు నిధికి విరాళంగా అందిస్తారు.
ఆధార్-లింక్డ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ ద్వారా ప్రయోజనాలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి.
మహిళా కార్మికులకు గణనీయమైన ప్రోత్సాహం
లింగ ఆధారిత వేతన వివక్షను ఈ కొత్త లేబర్ కోడ్స్ స్పష్టంగా నిషేధించాయి.
మహిళలు నైట్ షిఫ్ట్‌లో పనిచేయడానికి అనుమతిస్తారు. అయితే తప్పనిసరి భద్రతా చర్యలను సంస్థలు పాటించాలి.
మహిళా కార్మికుల కోసం కుటుంబ నిర్వచనాన్ని అత్తమామలతో పాటు విస్తరించారు.
ఫిర్యాదుల కమిటీల్లో మహిళల ప్రాతినిధ్యం ఉండటం తప్పనిసరి.
మెరుగైన భద్రతా ప్రమాణాలు, ఆరోగ్య పరీక్షలు
40 ఏళ్లు దాటిన కార్మికులు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షను పొందాలి.
ప్రమాదకర పదార్థాలను నిర్వహించే పరిశ్రమలు తప్పనిసరిగా భద్రతా కమిటీలను ఏర్పాటు చేయాలి. రక్షణ పరికరాలను అందించాలి. జాతీయ భద్రతా ప్రమాణాలను అనుసరించాలి.
కొన్ని సందర్భాల్లో, రాకపోకల సమయంలో జరిగే ప్రమాదాలను కూడా పని సంబంధిత ప్రమాదాలుగా పరిగణిస్తారు.
ఫిక్స్‌డ్-టర్మ్ సిబ్బందికి మెరుగైన రక్షణ
ఫిక్స్‌డ్-టర్మ్ ఉద్యోగులకు గతంలో ఉన్న ఐదేళ్ల నిబంధనను తగ్గించి, కేవలం ఒక సంవత్సరం సేవ తర్వాతే గ్రాట్యుటీ లభిస్తుంది.
వీరు తప్పనిసరిగా శాశ్వత కార్మికులతో సమానమైన వేతనాలు, ప్రయోజనాలను పొందాలి.
కాంట్రాక్ట్ కార్మికులు ప్రధాన యజమాని నుంచి ఆరోగ్యం, సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందుతారు.
పటిష్టమైన వేతన రక్షణ, నిర్ణీత పని గంటలు
ఓవర్ టైమ్‌కు సాధారణ వేతనానికి రెట్టింపు చెల్లించాలి. వేతనాలు కఠినమైన కాలపరిమితిలో చెల్లించాలి. ఉదాహరణకు ఐటీ ఉద్యోగులకు ప్రతినెల 7వ తేదీ లోపు జీతాలు ఇవ్వాలి వంటివి.
180 రోజుల పని తర్వాత వేతనంతో కూడిన సెలవు కోసం అర్హత ప్రారంభమవుతుంది.
బీడీ, మైనింగ్, టెక్స్‌టైల్స్, ఎంఎస్‌ఎంఈలతో సహా అనేక రంగాలు ఇప్పుడు రోజుకు 8 నుంచి 12 గంటలు, వారానికి 48 గంటలు వంటి ప్రామాణిక పని గంటలను అనుసరించాలి.
యజమానులకు సరళీకృత నియమాలు
యజమానులు ఇప్పుడు బహుళ చట్టాల కింద అనేక రకాల ఫారమ్‌లకు బదులుగా, కేవలం ఒకే రిజిస్ట్రేషన్, ఒక లైసెన్స్, ఒక వార్షిక రిటర్న్‌ను మాత్రమే పూరించాలి.
ఆకస్మిక తనిఖీలు, జరిమానాలకు బదులుగా, కార్మిక అధికారులు ఇప్పుడు మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు. కంపెనీలను కేవలం శిక్షించడం కాకుండా, నిబంధనలను పాటించడంలో వారికి సహాయం చేస్తారు.
2015లో 19 శాతంగా ఉన్న సామాజిక భద్రతా పరిధి 2025 నాటికి 64 శాతానికి పైగా పెరిగినందున, ఈ కోడ్స్ "కార్మికులకు అనుకూలమైన, మహిళలకు అనుకూలమైన, యువతకు అనుకూలమైన" కార్మిక వాతావరణాన్ని సృష్టించడంలో తదుపరి ముందడుగు అని ప్రభుత్వం పేర్కొంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


