చెన్నైతో పాటు తమిళనాడులోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన- పాఠశాలలకు సెలవు ఉందా?

చెన్నైతో పాటు తమిళనాడులోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచనను జారీ చేసింది ఐఎండీ. అనేక ప్రాంతాలు ప్రస్తుతం ఆరెంజ్​ అలర్ట్​లో ఉన్నాయి. రానున్న కొన్ని రోజుల పాటు జోరుగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.

Published on: Nov 17, 2025, 07:30:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
చెన్నైలో భారీ వర్షాలు.. (AFP)
చెన్నైలో భారీ వర్షాలు.. (AFP)

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు, రాజధాని చెన్నైకి ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా నవంబర్ 17న పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

తమిళనాడులో భారీ వర్షాలు- ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు..

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కింది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది:

చెంగల్పట్టు

చెన్నై

కాంచీపురం

విల్లుపురం

కడలూరు

అరియలూరు

మైలాడుతురై

నాగపట్టణం

తంజావూరు

తిరువారూరు

పుదుక్కోట్టై

రామనాథపురం

తమిళనాడు జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కరికాల్ ప్రాంతాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక ఉంది.

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఎక్కడ?

కింది జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది:

తిరువళ్లూరు

కళ్లకురిచి

పెరంబలూరు

ముందస్తు జాగ్రత్తలు, మత్స్యకారులకు హెచ్చరికలు

భారీ వర్షాల దృష్ట్యా, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం ఆయా జిల్లాలను కోరింది.

గల్ఫ్ ఆఫ్ మన్నార్, కన్యాకుమారి సముద్ర ప్రాంతాల్లో గంటకు 35–45 కి.మీ. వేగంతో, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

అందువల్ల ఆయా ప్రాంతాల్లోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు అని ప్రభుత్వం హెచ్చరించింది.

పాఠశాలలకు సెలవుపై సందిగ్ధత

చెన్నై, పరిసర జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ఇస్తారా లేదా అనే ప్రశ్న మళ్లీ తలెత్తింది. పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో, నగరంలో భారీ వర్షాలు, మబ్బులు కమ్మిన ఆకాశం, అప్పుడప్పుడు ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి.

ఈ పరిస్థితుల మధ్య, ముఖ్యంగా ప్రాథమిక, మధ్య తరగతి విద్యార్థులకు నవంబర్ 17న సెలవు ప్రకటించే అవకాశం ఉందని తల్లిదండ్రులు, పాఠశాలలు భావిస్తున్నాయి. అయితే గత 48 గంటల్లో వేగంగా మారుతున్న వాతావరణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు, జాగ్రత్తకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

అయితే ప్రస్తుతానికి నవంబర్ 17న పాఠశాలలకు సెలవుకు సంబంధించి చెన్నై జిల్లా యంత్రాంగం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాల హెచ్చరిక

తమిళనాడుతో పాటు కింది ప్రాంతాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది:

కేరళ- మాహే: నవంబర్ 16 నుంచి 20 వరకు

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ: నవంబర్ 17 నుంచి 18 వరకు

అండమాన్- నికోబార్ దీవులు: నవంబర్ 18 నుంచి 21 వరకు

శ్రీలంక తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా ఉంది. వాతావరణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దీనికి అనుబంధంగా ఉన్న చక్రవాత ఉపరితల ఆవర్తనం (సైక్లోనిక్​ అప్పర్​ ఎయిర్​ సర్క్యులేషన్​) సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఈ వాతావరణ వ్యవస్థ రాబోయే 24 గంటల్లో నెమ్మదిగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, దక్షిణ బంగ్లాదేశ్, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

అదనంగా, ఆగ్నేయ అరేబియా సముద్రం, ఆనుకుని ఉన్న దక్షిణ కేరళ తీరంపై సగటు సముద్ర మట్టానికి సుమారు 0.9 కి.మీ. ఎత్తులో చక్రవాత ఆవర్తనం క్రియాశీలకంగా ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More