హెచ్1బీ, ఎఫ్‌1 వీసాదారులకు యూఎస్‌సీఐఎస్ హెచ్చరిక: ఆ ఫామ్‌లు ఇక చెల్లవు

అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) ఐ-539, ఐ-765 ఫామ్‌లలో కీలక మార్పులు తీసుకొచ్చింది. సెప్టెంబర్ 15, 2026 నుంచి కొత్త ఎడిషన్ ఫామ్‌లను మాత్రమే స్వీకరిస్తామని, పాత ఫామ్‌లలో వచ్చే దరఖాస్తులను తిరస్కరిస్తామని స్పష్టం చేసింది.

Updated on: Aug 17, 2026, 16:38:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు, ఉద్యోగాలు చేస్తున్న భారతీయ నిపుణులకు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) కీలక హెచ్చరిక జారీ చేసింది. నాన్-ఇమిగ్రెంట్ హోదా పొడిగింపు, ఉద్యోగ అనుమతుల (EAD) కోసం ఉపయోగించే రెండు అత్యంత కీలకమైన ఇమ్మిగ్రేషన్ ఫామ్‌లలో సవరణలు చేసింది. 2026 సెప్టెంబర్ 15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.

హెచ్1బీ, ఎఫ్‌1 వీసాదారులకు యూఎస్‌సీఐఎస్ హెచ్చరిక: ఆ ఫామ్‌లు ఇక చెల్లవు
హెచ్1బీ, ఎఫ్‌1 వీసాదారులకు యూఎస్‌సీఐఎస్ హెచ్చరిక: ఆ ఫామ్‌లు ఇక చెల్లవు

గ్రేస్ పీరియడ్‌కు తావు లేదు

సాధారణంగా ఏదైనా ఫామ్ మారినప్పుడు కొంతకాలం గ్రేస్ పీరియడ్ ఇచ్చి, పాత, కొత్త ఫామ్‌లు రెండింటినీ యూఎస్‌సీఐఎస్ ఆమోదిస్తుంది. అయితే ఈసారి ఎలాంటి గ్రేస్ పీరియడ్ ఇవ్వడం లేదని అధికారులు తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 15 లేదా ఆ తర్వాత పాత ఫామ్‌లలో దరఖాస్తులను సమర్పిస్తే, అధికారులు వాటిని పరిశీలించకుండానే నేరుగా తిరస్కరిస్తారు.

ఈ మార్పులు ప్రధానంగా 'ఫార్మ్ I-539' (నాన్-ఇమిగ్రెంట్ హోదా పొడిగింపు లేదా మార్పు కోసం వాడేది), 'ఫార్మ్ I-765' (ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్/EAD దరఖాస్తు)లకు వర్తిస్తాయి. విదేశీ విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, విదేశీ మీడియా ప్రతినిధుల స్టే వ్యవధిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఇటీవల రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా యూఎస్‌సీఐఎస్ ఈ సవరణలు చేసింది.

భారతీయులపై పడే ప్రభావం ఎంత?

అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఎక్కువమంది ఎఫ్‌-1 (F-1) వీసాలపై ఉంటూ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) లేదా వీసా హోదా మార్పుల కోసం ఐ-539, ఐ-765 ఫామ్‌లపైనే ఆధారపడతారు. వీరితో పాటు హెచ్-1బీ (H-1B) వీసా కలిగిన భారతీయులు కూడా తమ నాన్-ఇమిగ్రెంట్ హోదా పొడిగింపునకు ఈ ఫామ్‌లనే ఉపయోగిస్తారు. కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు ఒక్క రోజు ఆలస్యంగా లేదా పాత ఫామ్‌లో అప్లై చేసినా దరఖాస్తు రద్దవుతుంది. సరైన కొత్త ఫామ్‌లో మళ్లీ దరఖాస్తు చేసేవరకు వారికి ఎలాంటి సడలింపు లభించదు.

ఫామ్‌ల నిబంధనలు, గడువులు ఇవే

ఫార్మ్ I-539 (నాన్-ఇమిగ్రెంట్ హోదా పొడిగింపు/మార్పు):

  • ప్రస్తుతం అమల్లో ఉన్న ఎడిషన్: 08/28/24
  • కొత్త ఎడిషన్ అమల్లోకి వచ్చే తేదీ: సెప్టెంబర్ 15, 2026 (ఎడిషన్ తేదీ: 09/15/26)
  • సెప్టెంబర్ 15 కంటే ముందు 08/28/24 ఎడిషన్ ఫామ్‌ను సమర్పిస్తే అంగీకరిస్తారు.
  • సెప్టెంబర్ 15న లేదా ఆ తర్వాత పాత 08/28/24 ఎడిషన్ ఫామ్‌ను పంపితే తిరస్కరిస్తారు.
  • సెప్టెంబర్ 15 నుంచి కేవలం 09/15/26 ఎడిషన్ ఫామ్‌ను మాత్రమే స్వీకరిస్తారు.
  • నూతన 09/15/26 ఎడిషన్ ఫామ్‌ను సెప్టెంబర్ 15 కంటే ముందు సమర్పించకూడదు, ఒకవేళ పంపినా ప్రాసెస్ చేయరు.

ఫార్మ్ I-765 (ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ దరఖాస్తు):

  • ప్రస్తుతం అమల్లో ఉన్న ఎడిషన్: 08/21/25
  • కొత్త ఎడిషన్ అమల్లోకి వచ్చే తేదీ: సెప్టెంబర్ 15, 2026 (ఎడిషన్ తేదీ: 09/15/26)
  • సెప్టెంబర్ 15 కంటే ముందు 08/21/25 ఎడిషన్ సమర్పిస్తే ఆమోదిస్తారు.
  • సెప్టెంబర్ 15న లేదా ఆ తర్వాత పాత 08/21/25 ఎడిషన్ ఫామ్ పంపితే తిరస్కరిస్తారు.
  • సెప్టెంబర్ 15 నుంచి కేవలం 09/15/26 ఎడిషన్ ఫామ్‌ను మాత్రమే స్వీకరిస్తారు.
  • కొత్త 09/15/26 ఎడిషన్‌ను సెప్టెంబర్ 15 కంటే ముందు పంపకూడదు.

దరఖాస్తుదారులు ఇప్పుడు ఏం చేయాలి?

అభ్యర్థుల అవగాహన కోసం యూఎస్‌సీఐఎస్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ రెండు కొత్త ఫామ్‌ల ప్రివ్యూ వర్షన్‌లతో పాటు సూచనలను అందుబాటులో ఉంచింది. అయితే ఈ ఫామ్‌లను సెప్టెంబర్ 15కి ముందు దాఖలు చేయకూడదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 15 కంటే ముందే దరఖాస్తు చేసుకోవాల్సిన వారు పాత ఎడిషన్ ఫామ్‌లనే ఉపయోగించి గడువులోగా సబ్‌మిట్ చేయాలి. సెప్టెంబర్ 15 లేదా ఆ తర్వాత దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా నూతన ఎడిషన్ ఫామ్‌లనే పూర్తి చేయాల్సి ఉంటుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More