Vaibhav Sooryavanshi: టీ20ల్లో డబుల్ సెంచరీ నా టార్గెట్.. 20 ఓవర్లు ఆడితే కొట్టేస్తా: రాయల్స్ సెన్షేషన్ వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi: భారత 15 ఏళ్ల యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ సాధించడమే తన ధ్యేయమని ఈ యంగ్ బ్యాటర్ ధీమా వ్యక్తం చేశాడు.

Published on: May 25, 2026, 19:15:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vaibhav Sooryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో పాటు ప్రపంచవ్యాప్తంగా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లను హడలెత్తిస్తున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మైండ్ సెట్ ఇప్పుడు మరో లెవెల్‌లో ఉంది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకాని 'డబుల్ సెంచరీ' మైలురాయిపై ఈ యంగ్ సెన్సేషన్ కన్నేశాడు.

Vaibhav Sooryavanshi: టీ20ల్లో డబుల్ సెంచరీ నా టార్గెట్: రాయల్స్ సెన్షేషన్ వైభవ్ సూర్యవంశీ (BCCI/AP)
Vaibhav Sooryavanshi: టీ20ల్లో డబుల్ సెంచరీ నా టార్గెట్: రాయల్స్ సెన్షేషన్ వైభవ్ సూర్యవంశీ (BCCI/AP)

ఒక దశాబ్దానికి పైగా చెక్కుచెదరకుండా ఉన్న వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ (Chris Gayle) అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డుకు వైభవ్ సూర్యవంశీ రూపంలో ఇప్పుడు పెద్ద ముప్పు పొంచి ఉంది. 2013 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున పూణే వారియర్స్ ఇండియాపై గేల్ ఆ దండయాత్ర (175 నాటౌట్) చేశాడు.

'నేను 20 ఓవర్లు ఆడితే ఆ రికార్డు బద్దలవ్వాల్సిందే'

మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'ది స్విచ్' (The Switch) టాక్ షోలో వైభవ్ సూర్యవంశీ తన మనసులోని మాటను పంచుకున్నాడు.

వైభవ్: "నాకు టీ20ల్లో 200 పరుగులు చేయాలని ఉంది."

కెవిన్ పీటర్సన్: "క్రిస్ గేల్ రికార్డు 175 పరుగులుగా ఉంది తెలుసా?"

వైభవ్: "అవును తెలుసు. నేను అతని రికార్డును బద్దలు కొట్టి 200 రన్స్ చేయాలనుకుంటున్నాను. ఏదైనా మ్యాచ్‌లో నేను గనుక పూర్తి 20 ఓవర్లు క్రీజులో నిలబడితే, కచ్చితంగా ఆ రికార్డును బద్దలు కొడతాను"

రెండుసార్లు డబుల్ సెంచరీకి చేరువగా..

వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఇతర ఫార్మాట్లలో 200 పరుగుల మార్కుకు రెండుసార్లు చాలా దగ్గరగా వచ్చాడు.

బీహార్ తరఫున విజయ్ హజారే ట్రోఫీలో 190 పరుగులు చేశాడు.

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో 175 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

ఇక టీ20ల్లో అతని ప్రస్తుత అత్యధిక వ్యక్తిగత స్కోరు 144 పరుగులుగా ఉంది.

గతేడాది నవంబర్‌లో జరిగిన ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్‌లో యూఏఈ (UAE) పై సెంచరీ బాది.. భారత్ తరఫున టీ20ల్లో ఉమ్మడిగా మూడో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రిషబ్ పంత్, అభిషేక్ శర్మ, ఉర్విల్ పటేల్ వంటి ఎలైట్ క్లబ్ సరసన చేరాడు.

సచిన్ టెండూల్కర్‌తో పోలికలు

2010లో వన్డే క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాదనుకున్న డబుల్ సెంచరీని (దక్షిణాఫ్రికాపై 200*) మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సాధించి చరిత్రను తిరగరాశాడు. సరిగ్గా 16 ఏళ్ల తర్వాత (2026లో), అదే స్థాయి అసాధారణ ప్రతిభతో సచిన్‌తో పోలికలు తెచ్చుకుంటున్న వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు టీ20ల్లో ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని చూస్తున్నాడు.

గతంలో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై యూత్ వన్డేల్లో కేవలం 52 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకుని అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును నెలకొల్పిన తర్వాత కూడా వైభవ్ తన అసలు లక్ష్యం 200 పరుగులేనని చెప్పాడు.

"వచ్చే మ్యాచ్‌లో 200 రన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. పూర్తి 50 ఓవర్లు ఆడాలనేదే నా ప్లాన్. నేను ఎంత ఎక్కువ స్కోరు చేస్తే జట్టుకు అంత లాభం" అని అప్పట్లోనే తన మైండ్ సెట్ ఏంటో చూపించాడు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. టీ20 క్రికెట్‌లో ప్రస్తుత అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఎవరి పేరిట ఉంది?

వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ పేరిట ఉంది. అతడు 2013 ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున పూణే వారియర్స్ ఇండియాపై నాటౌట్‌గా 175 పరుగులు చేశాడు.

2. వైభవ్ సూర్యవంశీ టీ20ల్లో, వన్డేల్లో చేసిన అత్యధిక స్కోర్లు ఎంత?

వైభవ్ సూర్యవంశీ అత్యధిక టీ20 స్కోరు 144 పరుగులు కాగా, విజయ్ హజారే ట్రోఫీ వన్డే మ్యాచ్‌లో బీహార్ తరఫున 190 పరుగులు సాధించాడు.

3. అంతర్జాతీయ వన్డేల్లో మొదటి డబుల్ సెంచరీ సాధించింది ఎవరు?

2010లో గ్వాలియర్ వేదికగా దక్షిణాఫ్రికాపై సచిన్ టెండూల్కర్ వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ (200 నాటౌట్) సాధించి రికార్డు సృష్టించాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More