...
...
Next Story

15ఏళ్లు కూడా లేవు.. అప్పుడే 3వ టీ20 సెంచరీ బాదేసిన వైభవ్​ సూర్యవంశీ!

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సంచలనం! మహారాష్ట్రతో మ్యాచ్​లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ చేశాడు. ఈడెన్ గార్డెన్స్‌లో సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఈ యువ సంచలనం 15ఏళ్లు దాటకముందే 3వ టీ20 సెంచరీ బాదడం విశేషం.

Updated on: Dec 2, 2025, 13:28:19 IST
Advertisement

యువ సంచలనం వైభవ్​ సూర్యవంశీ మరోసారి దుమ్మురేపి వార్తల్లో నిలిచాడు! ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మహారాష్ట్రపై మెరుపు శతకం బాదాడు. ఎలైట్ గ్రూప్ బీ పోరులో, టాస్ గెలిచి మహారాష్ట్ర బౌలింగ్ ఎంచుకోగా, బిహార్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ టీనేజ్ సంచలనం 61 బంతుల్లో అద్భుతమైన 108 పరుగులు చేసి, ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు క్రీజులో నిలబడ్డాడు. దీనితో బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 176/3 పరుగులు చేసింది.

వైభవ్​ సూర్యవంశీ! (PTI)
వైభవ్​ సూర్యవంశీ! (PTI)

సూర్యవంశీ కేవలం 57 బంతుల్లోనే తన తొలి ఎస్ఎమ్ఏటీ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ 177.05గా ఉంది. వికెట్‌పై చాలా మంది బ్యాటర్లు బంతిని సరిగ్గా అంచనా కూడా వేయడానికి కష్టపడుతున్న సమయంలో, బిహార్ మొత్తం స్కోరులో సగం కంటే ఎక్కువ పరుగులు వైభ్​ చేయడం విశేషం.

ఇంకో విశేషం ఏంటంటే.. ఈ వైభవ్ తన 15వ ఏట రాకముందే ఇప్పటికే మూడు టీ20 సెంచరీలను నమోదు చేశాడు. ఇందులో ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ తరఫున సాధించిన ఒక రికార్డు బ్రేకింగ్​ సెంచరీ కూడా ఉంది!

వైభవ్​ సూర్యవంశీ సంచలనంతో కష్టాల్లో ఉన్న బిహార్‌కు ఊరట..

ఈ మ్యాచ్‌లోకి వచ్చేసరికి, బిహార్ వరుసగా మూడు ఓటములతో ఎలైట్ గ్రూప్ బీలో అట్టడుగున ఉంది. ఒత్తిడికి లోనై ఆ జట్టు బ్యాటింగ్ పదేపదే విఫలమైంది. పృథ్వీ షా నాయకత్వంలోని మహారాష్ట్ర కనీసం ఒక విజయాన్ని నమోదు చేసి, క్వాలిఫికేషన్ రేసులోకి తిరిగి రావాలని చూస్తోంది.

అందుకే వైభవ్ సూర్యవంశీతో పాటు జట్టుకు ఇన్నింగ్స్ మరింత ముఖ్యమైంది. బిహార్ త్వరగా బి. సౌరభ్‌ను కోల్పోయింది, కానీ వైభవ్​ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మొదట కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత వేగాన్ని పెంచాడు. ఒక దశలో బిహార్ 52/1 వద్ద ఉండగా, మధ్య ఓవర్లలో సూర్యవంశీ వేగం పెంచడంతో స్కోరు 150 దాటి, చివరికి 170కి చేరుకుంది.

ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఇప్పటికే తన రికార్డులతో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున టీ20 సెంచరీ, ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఇండియా 'ఏ' తరఫున యూఏఈపై 42 బంతుల్లో 144 పరుగులు చేయడం వంటి విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks