15 సిక్స్‌లు, 11 ఫోర్లు.. 42 బంతుల్లోనే 144 రన్స్.. మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన సూర్యవంశీ..

వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు. అతడు రైజింగ్ స్టార్స్ ఏషియా కప్ లో భాగంగా యూఏఈతో మ్యాచ్ లో కేవలం 42 బంతుల్లోనే 144 రన్స్ చేశాడు. అందులో 15 సిక్స్ లు, 11 ఫోర్లు ఉండటం విశేషం.

Published on: Nov 14, 2025, 19:33:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చిల్డ్రన్స్ డే సందర్భంగా దోహాలో జరిగిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)పై టీమ్ ఇండియా-ఎ తరఫున మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. కేవలం 14 ఏళ్ల వయసున్న వైభవ్.. తన కెరీర్‌లో తొలిసారిగా అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఆడుతూ కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు.

15 సిక్స్‌లు, 11 ఫోర్లు.. 42 బంతుల్లోనే 144 రన్స్.. మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన సూర్యవంశీ..
15 సిక్స్‌లు, 11 ఫోర్లు.. 42 బంతుల్లోనే 144 రన్స్.. మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన సూర్యవంశీ..

సూర్యవంశీ బీస్ట్ మోడ్ ఆన్

ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి మెరుపులు మెరిపించిన వైభవ్ సూర్యవంశీ గుర్తున్నాడా? అతడు ఇప్పుడు రైజింగ్ స్టార్స్ ఏషియా కప్ లో మరోసారి చెలరేగిపోయాడు. టీ20ల్లో రెండో సెంచరీ, అది కూడా కేవలం 32 బంతుల్లోనే సాధించాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ పై 35 బంతుల్లో కాగా.. ఆ రికార్డును తిరగ రాశాడు.

మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ.. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య రెండో ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. కానీ అది సూర్యవంశీని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. బౌండరీలతో విరుచుకుపడి కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఆ తర్వాత సెంచరీ పూర్తి చేయడానికి అతనికి మరో 15 బంతులు మాత్రమే పట్టింది. ముఖ్యంగా అతను ముహమ్మద్ జవాదుల్లా, హర్షిత్ కౌశిక్‌లను టార్గెట్ చేసి, రెండు ఓవర్లలో ఏకంగా ఏడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను యూఏఈ నుంచి దూరం చేశాడు.

రిషబ్ పంత్ రికార్డు సమం

వైభవ్ సూర్యవంశీ 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్లతో సహా 144 పరుగులు చేసి ముహమ్మద్ ఫరాజుద్దీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలో అతను రిషబ్ పంత్‌తో కలిసి ఇండియా తరఫున రెండో అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డును (32 బంతుల్లో) సమం చేశాడు. పంత్ 2018లో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో హిమాచల్ ప్రదేశ్‌పై 32 బంతుల్లో సెంచరీ సాధించాడు.

ఇక ఇండియాలో అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డు ఉర్విల్ పటేల్, అభిషేక్ శర్మ పేరిట ఉంది. వీరు 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు. ప్రపంచ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. అతడు 2024లో సైప్రస్‌పై 27 బంతుల్లోనే సెంచరీ బాదాడు.

గతంలో సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ చేసి.. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.

ఇండియా-ఎ భారీ స్కోరు

సూర్యవంశీ ఔటైన తర్వాత కెప్టెన్ జితేష్ శర్మ అజేయంగా 83 పరుగులు చేసి తన జట్టును 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోరుకు చేర్చాడు. నమన్ ధీర్ కూడా 34 పరుగులు చేశాడు. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జితేష్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More