బెడ్రూమ్లోకి చొచ్చుకెళ్లి.. మదురో దంపతులను లాక్కెళ్లిన అమెరికా దళాలు! ఆ 30 నిమిషాల్లో ఏం జరిగింది?
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం సాహసోపేతమైన ఆపరేషన్ ద్వారా బంధించింది. 'ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్' పేరుతో అర్ధరాత్రి చేపట్టిన ఈ మెరుపు దాడిలో మదురో దంపతులను అదుపులోకి తీసుకున్నారు. నెలల తరబడి సాగిన పక్కా ప్లానింగ్, డెల్టా ఫోర్స్ మెరుపు వేగం ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశాయి.
ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు శనివారం అదుపులోకి తీసుకున్నాయి. కారకాస్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే 'ఫోర్ట్ టియునా' సైనిక స్థావరంలోని తమ నివాసంలో మదురో దంపతులు నిద్రిస్తుండగా, అమెరికా కమాండోలు మెరుపు దాడి చేసి వారిని బంధించారు. ఈ మేరకు ఓ అమెరికా మీడియా సంచలన కథనాన్ని ప్రచురించింది.
30 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి..
ఈ సైనిక చర్యకు ‘ఆపరేషన్ బ్సల్యూట్ రిజాల్వ్’ అని అమెరికా పేరు పెట్టింది. అగ్రరాజ్య ఆర్మీకి చెందిన అత్యంత శక్తివంతమైన 'డెల్టా ఫోర్స్' ఈ మిషన్‌ను నిర్వహించింది. వీరికి ఎఫ్‌బీఐ సహకరించింది. కేవలం 30 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ మొత్తం పూర్తయింది! ఈ దాడిలో అమెరికా సైనికులు ఎవరూ మరణించలేదని అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. "ఒక కంచుకోట లాంటి భవనం నుంచి వెనెజువెలా అధ్యక్షుడు మదురోను బయటకు తీసుకొచ్చాము. ఈ ఆపరేషన్‌లో మనవాళ్లు ఎవరూ చనిపోకపోవడం అద్భుతం. ఒకరిద్దరికి స్వల్ప గాయాలైనా, వారు క్షేమంగానే ఉన్నారు," అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు.
ఏంటీ ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’?
శనివారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం ప్రకారం) 4:21 గంటలకు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదిక ద్వారా ఈ సాహసోపేత మిషన్ గురించి ప్రపంచానికి వెల్లడించారు. ఈ ఆపరేషన్ అకస్మాత్తుగా జరిగినట్లు కనిపించినా, దీని వెనుక నెలల తరబడి కసరత్తు జరిగింది.
పక్కా ప్లానింగ్ ఇలా:
నివాస నమూనా: మదురో నివాసం ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉండేలా ఒక నమూనాను తయారు చేసి, డెల్టా ఫోర్స్ దళాలు అందులోకి ఎలా ప్రవేశించాలనే దానిపై నెలల తరబడి రిహార్సల్స్ చేశాయి.
సీఐఏ నిఘా: ఆగస్టు నుంచే సీఐఏకు చెందిన ఒక చిన్న బృందం వెనెజువెలాలో మదురో కదలికలపై నిఘా పెట్టింది. మదురోకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తిని ఇన్ఫార్మర్గా మార్చుకుని, ఆయన కచ్చితమైన లొకేషన్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకున్నాయి.
గ్రీన్ సిగ్నల్: శనివారానికి నాలుగు రోజుల క్రితమే ట్రంప్ ఆపరేషన్‌కి ఆమోదం తెలిపారు. కానీ వాతావరణం అనుకూలించే వరకు ఆగాలని అధికారులు సూచించారు. చివరకు శుక్రవారం రాత్రి 10:46 గంటలకు ట్రంప్ తుది అనుమతిని ఇచ్చారు.
అర్ధరాత్రి ఏం జరిగింది?
అనంతరం ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో క్లబ్ నుంచి అధ్యక్షుడు ట్రంప్ తన సలహాదారులతో కలిసి ఈ ఆపరేషన్‌ను ప్రత్యక్షంగా (లైవ్ స్ట్రీమ్) వీక్షించారు.
శుక్రవారం రాత్రి అమెరికా విమానాలు కారకాస్ నగరంపై ఎగురుతూ అక్కడి గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశాయి. శనివారం తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో అమెరికా దళాలు హెలికాప్టర్ల ద్వారా మదురో నివాసానికి చేరుకున్నాయి. ఆ సమయంలో వెనెజువెలా దళాలు ఎదురు కాల్పులు జరిపినప్పటికీ, అమెరికా కమాండోలు వెనక్కి తగ్గలేదు.
"మదురో భవనం ఉక్కు తలుపులతో కూడిన ఒక కోటలా ఉంది. సాధారణంగా వాటిని పగులగొట్టడం అసాధ్యం. కానీ మన దళాలు సెకన్ల వ్యవధిలోనే ఆ తలుపులను ఛేదించి లోపలికి వెళ్లాయి," అని ట్రంప్ వివరించారు. నివాసంలోకి ప్రవేశించిన దళాలు మదురో దంపతులను బెడ్‌రూమ్ నుంచి బయటకు లాక్కొచ్చి, తమ వెంట తీసుకెళ్లాయి.
అసలు ఎందుకు ఈ ఆపరేషన్?
అమెరికా- వెనెజువెలా మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మదురోపై నార్కో-టెర్రరిజం (మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం) వంటి అభియోగాలు మోపారు ట్రంప్.
చివరికి ఈ ఆపరేషన్‌తో ఆయన్ని అరెస్ట్ చేసి అమెరికాలో విచారణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మదురో కొన్ని గంటల ముందే న్యూయార్క్‌లో ల్యాండ్ అయ్యారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దేశంలో అనిశ్చితి సద్దుమణిగి, సరైన రీతులో అధికారం చేతులు మారేంత వరకు వెనెజువెలాను అమెరికా నడిపిస్తుందని ట్రంప్ మీడియాకు చెప్పారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


