Electric bike : భారత రోడ్లపై విడా తొలి ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్- UBX 06 ఇలా ఉంటుంది..

హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ‘యూబీఎక్స్ 06’ను భారత రోడ్లపై పరీక్షిస్తోంది. నవంబర్‌లో జరిగిన ఈఐసీఎంఏ 2026 షోలో ఆవిష్కరించిన ఈ స్పోర్టీ బైక్ 2027 మధ్యలో మార్కెట్లోకి రానుంది. దీని బ్యాటరీ, ఫీచర్లు, అంచనా ధర వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Nov 18, 2026, 16:02:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఆకట్టుకున్న విడా, ఇప్పుడు పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ విభాగంలోకి అడుగుపెడుతోంది. సంస్థ రూపొందిస్తున్న తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ 'యూబీఎక్స్ 06' భారత రహదారులపై టెస్టింగ్ దశలో కెమెరా కంటికి చిక్కింది. వాహనం డిజైన్ బయటకు తెలియకుండా పూర్తిగా క్యామోఫ్లాజ్ స్టిక్కర్లతో కప్పి ఉంచిన ఈ బైక్, మార్కెట్ విడుదలకు ముందే ఆటోమొబైల్ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. నవంబర్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 'EICMA 2026' మోటార్ సైకిల్ ప్రదర్శనలో ఈ బైక్‌ను తొలిసారి ఆవిష్కరించారు.

విడా తొలి ఎలక్ట్రిక్ బైక్- ఇలా ఉంటుంది..
విడా తొలి ఎలక్ట్రిక్ బైక్- ఇలా ఉంటుంది..

సూపర్‌మోటో తరహా స్పోర్టీ డిజైన్.. ఇద్దరు కూర్చుని టెస్టింగ్!

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ అనుబంధ ఈవీ బ్రాండ్ కావడంతో విడా వాహనాలకు భారత్‌లో బలమైన నెట్‌వర్క్ ఉంది. ఇక విడా యూబీఎక్స్ 06 ఎలక్ట్రిక్ బైక్​ని సూపర్‌మోటో ప్రేరేపిత డిజైన్‌తో ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. స్పై చిత్రాల్లో బైక్ మొత్తం క్యామోఫ్లాజ్ ముసుగులో ఉన్నప్పటికీ, దాని ఆకృతి, కొలతలు నవంబర్‌లో ఈఐసీఎంఏ వేదికపై ప్రదర్శించిన మోడల్‌ను పోలి ఉన్నాయి. ఈ టెస్టింగ్ ఫొటోలలో కనిపిస్తున్న కీలక అంశం ఏమిటంటే, బైక్‌పై రైడర్‌తో పాటు వెనుక సీటుపై మరొకరు కూర్చుని ప్రయాణిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారత రహదారుల పరిస్థితులకు తగ్గట్లుగా ఇద్దరు ప్రయాణించినప్పుడు బైక్ బ్యాలెన్స్, సస్పెన్షన్ పనితీరు ఎలా ఉంటుందో ఇంజనీర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.

భారీ బ్యాటరీ ప్యాక్.. ప్రీమియం ఛాసిస్, టీఎఫ్‌టీ డిస్‌ప్లే!

సాంకేతిక నిర్మాణం విషయానికొస్తే యూబీఎక్స్ 06 బైక్‌లో దృఢమైన స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ఉపయోగిస్తున్నారు. ముందువైపు ప్రీమియం యూఎస్‌డీ ఫోర్కులు, వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉండనున్నాయి. ఈ బైక్ మధ్యభాగంలో నాన్ రిమూవెబుల్ భారీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీని సామర్థ్యం 10 కేడబ్ల్యూహెచ్ నుంచి 15 కేడబ్ల్యూహెచ్ మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద బ్యాటరీ ఉంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుదీర్ఘ ప్రయాణాలకు సైతం ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ పూర్తి సాంకేతిక వివరాలు, వేగం లేదా రేంజ్ గణాంకాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే తాజా స్పై ఫొటోల ద్వారా కొన్ని ఆధునిక ఫీచర్లు బయటపడ్డాయి. ఇందులో దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఫుల్-కలర్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ స్పష్టంగా కనిపించింది. డిస్‌ప్లేలోని వివిధ ఫీచర్లను నియంత్రించడానికి, మెనూ నావిగేట్ చేయడానికి హ్యాండిల్‌బార్ రెండు వైపులా ప్రత్యేక కంట్రోల్ బటన్లను అందించారు.

విడుదల ఎప్పుడు? అంచనా ధర ఎంతంటే!

విడా యూబీఎక్స్ 06 ఎలక్ట్రిక్ బైక్ అధికారిక విడుదల తేదీని గానీ, ధరల వివరాలను గానీ సంస్థ ఇంకా ప్రకటించలేదు. అయితే 2027 మధ్య నాటికి ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.5 లక్షల నుంచి రూ. 3.1 లక్షల మధ్య ఉండొచ్చని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ ధర శ్రేణిలో విడుదలైతే, ప్రీమియం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ప్రస్తుత మోడళ్లకు గట్టి పోటీ ఎదురుకానుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More