Budget electric cars : విన్​ఫాస్ట్ నుంచి రెండు ఎలక్ట్రిక్ కార్లు- ఒకటి బడ్జెట్​లో.. ధర రూ. 10లక్షల లోపే!

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్ కోసం రూట్ మార్చింది. అంతర్జాతీయ మోడళ్లను పక్కనపెట్టి, ప్రత్యేకంగా భారత వినియోగదారుల కోసం 'వీఎఫ్ ఎక్స్', 'వీఎఫ్ వై' పేరుతో రెండు సరికొత్త ఈవీలను తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఆ వివరాలు..

Published on: Sep 13, 2026, 11:20:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఆధిపత్యాన్ని సాధించేందుకు వియత్నాం దిగ్గజం ‘విన్‌ఫాస్ట్’ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసినట్టు కనిపిస్తోంది! అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడళ్లను నేరుగా భారత్‌కు తీసుకొచ్చి విక్రయించే ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టడం ఇందుకు కారణం. మన దేశ వినియోగదారుల అభిరుచులు, మధ్యతరగతి ప్రజ జేబుపై భారం పడకుండా బడ్జెట్‌కు తగినట్లుగా ప్రత్యేకంగా రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి విన్​ఫాస్ట్ సన్నాహాలు ప్రారంభించింది.

విన్​ఫాస్ట్​ నుంచి 2 కొత్త ఈవీలు..
విన్​ఫాస్ట్​ నుంచి 2 కొత్త ఈవీలు..

గ్లోబల్ మోడళ్లకు బ్రేక్.. భారత్ కోసం వీఎఫ్ ఎక్స్, వీఎఫై వై!

ఎలక్ట్రిక్ కార్లను సంస్థ అంతర్గతంగా 'వీఎఫ్ ఎక్స్', 'వీఎఫ్ వై' అనే కోడ్ పేర్లతో పిలుస్తోంది. నిజానికి గతంలో తమ గ్లోబల్ మోడళ్లైన వీఎఫ్ 3, వీఎఫ్ 6, వీఎఫ్ 7 కార్లను భారత్‌లోనే తయారు చేయాలని కంపెనీ భావించింది. అయితే, ఇక్కడి మార్కెట్‌కు తగ్గట్లు తక్కువ ధరకు వాటిని అందించడం వ్యయప్రయాసలతో కూడుకున్న పనిగా మారింది. దీనితో ఆ తయారీ ప్రణాళికను నిలిపివేసింది. ప్రస్తుతం వీఎఫ్ 6, వీఎఫ్ 7 కార్లను 'కంప్లీట్లీ నాక్డ్-డౌన్' కిట్ల రూపంలో దిగుమతి చేసుకుని ఇక్కడే అసెంబుల్ చేయాలని నిర్ణయించింది.

రూ.10 లక్షలలోపే బడ్జెట్ ఈవీ 'వీఎఫ్ ఎక్స్'!

రాబోయే మోడళ్లలో 'వీఎఫ్ ఎక్స్' కారుపై ఆటోమొబైల్ ప్రపంచంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇది పరిమాణంలో చిన్నదైన వీఎఫ్ 3 కంటే పెద్దదిగా, వీఎఫ్ 6 కంటే కాస్త చిన్నదిగా ఉంటుంది. భారతీయ కుటుంబాలకు సరిపోయేంత విశాలమైన క్యాబిన్ ఇస్తూనే, తయారీ ఖర్చు పెరగకుండా చూసుకోవడం దీని ప్రధాన లక్ష్యం. ఈ కారు ధరను దాదాపు రూ. 10 లక్షల లోపే ఉండేలా విన్‌ఫాస్ట్ ప్రణాళికలు రచిస్తోంది.

భారత్‌లో ప్రస్తుతం టాటా మోటార్స్ (టియాగో ఈవీ, పంచ్ ఈవీ) సరసమైన ధరల్లో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తూ ఆధిపత్యం చెలాయిస్తోంది. వీటికి పోటీగా మహీంద్రా, హ్యుందాయ్, మారుతీ సుజుకీ కూడా సరికొత్త ఈవీలతో మార్కెట్‌ను విస్తరిస్తున్నాయి. ఈ తరుణంలో రూ. 10 లక్షలలోపు ధరకే స్పేసియస్ ఎలక్ట్రిక్ కారును అందిస్తే విన్‌ఫాస్ట్‌కు భారత ఆటోమొబైల్​ మార్కెట్ ఒక సువర్ణావకాశంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

300కు పైగా భారతీయ సంస్థలతో భాగస్వామ్యం!

రెండో మోడల్ అయిన 'వీఎఫ్ వై'కి సంబంధించిన సాంకేతిక వివరాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. అయితే, ఈ రెండు మోడళ్ల కోసం విన్‌ఫాస్ట్ ఇప్పటికే 300కు పైగా భారతీయ విడిభాగాల సరఫరాదారులతో చర్చలు జరుపుతోంది. కార్లను విదేశాల్లో డిజైన్ చేసి ఇక్కడ అసెంబుల్ చేయడం కాకుండా, ప్రారంభ దశ నుంచే భారతీయ విడిభాగాలను వాడటం ద్వారా తయారీ వ్యయాన్ని భారీగా తగ్గించాలని చూస్తోంది.

కంపెనీ భారత్‌లో ఏకంగా 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 19,100 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు కట్టుబడి ఉంది. తమిళనాడులోని తూత్తుకుడిలో ఏర్పాటు చేసిన తయారీ కేంద్రం రెండో దశ విస్తరణకు కూడా అనుమతులు లభించాయి. దక్షిణ భారతదేశానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్లాంట్ ప్రారంభ సామర్థ్యం ఏడాదికి 50,000 వాహనాలు కాగా, దీనిని 1,50,000 యూనిట్లకు విస్తరించే అవకాశం ఉంది. స్థానికంగా విడిభాగాలు కొనుగోలు చేస్తూ, తూత్తుకుడిలో ఉత్పత్తి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సామాన్యులకు సైతం అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కార్లను అందించవచ్చని విన్‌ఫాస్ట్ భావిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More