...
...
Next Story

సెంచరీల మోత మోగించిన విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్.. వన్డేల్లో 53వ సెంచరీ బాదిన కింగ్

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్ సెంచరీల మోత మోగించారు. కోహ్లి వరుసగా రెండో సెంచరీ, వన్డేల్లో 53వ సెంచరీ నమోదు చేయగా.. రుతురాజ్ వన్డేలలో తన తొలి సెంచరీ బాదడం విశేషం.

Published on: Dec 3, 2025, 16:41:04 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

రాయ్‌పూర్‌లో జరిగిన భారత్, దక్షిణాఫ్రికా రెండో వన్డే మ్యాచ్ భారత అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ కలిసి క్రీజులో పరుగుల వరద పారించారు. ఇద్దరూ సెంచరీల మోత మోగించారు. ఒక్కో ఓవర్ గడుస్తున్న కొద్దీ దక్షిణాఫ్రికా బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ, వీరిద్దరూ నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది.

ఆగని కోహ్లీ జోరు: 53వ వన్డే సెంచరీ

సెంచరీల మోత మోగించిన విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్.. వన్డేల్లో 53వ సెంచరీ బాదిన కింగ్ (PTI)
సెంచరీల మోత మోగించిన విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్.. వన్డేల్లో 53వ సెంచరీ బాదిన కింగ్ (PTI)

విరాట్ కోహ్లీ వరుసగా రెండో సెంచరీ బాదాడు. వన్డేల్లో ఈ మధ్యే సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బ్రేక్ చేసిన అతడు.. వెంటనే మరో మూడంకెల స్కోరు అందుకున్నాడు. అతడు తనదైన క్లాసిక్ శైలిలో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే, గ్యాప్స్ వెతుక్కుంటూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ముఖ్యంగా వికెట్ల మధ్య చిరుతలా పరిగెడుతూ సింగిల్స్‌ను డబుల్స్‌గా మలిచి బౌలర్లపై ఒత్తిడి పెంచాడు.

రాంచీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో 135 పరుగులతో మెరిసిన కోహ్లీ, ఈ మ్యాచ్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించాడు. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 90 బంతుల్లో తన 53వ వన్డే సెంచరీని (అంతర్జాతీయంగా 84వ సెంచరీ) పూర్తి చేశాడు. అంతేకాదు కోహ్లీ వన్డేల్లో వరుస ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేయడం ఇది పదోసారి కావడం విశేషం.

దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి, విమర్శకుల నోళ్లు మూయించడానికి ఈ ఇన్నింగ్స్ కోహ్లీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. లుంగి ఎన్గిడి బౌలింగ్‌లో 93 బంతుల్లో 102 పరుగులు చేసి కోహ్లీ వెనుదిరిగాడు.

రుతురాజ్ గైక్వాడ్: మాట నిలబెట్టుకున్న యువతార

ఆరంభంలో కొంచెం తడబడ్డా.. క్రీజులో కుదురుకున్నాక రుతురాజ్ వెనక్కి తిరిగి చూడలేదు. పేసర్లపై పుల్ షాట్లు, స్పిన్నర్లపై ఇన్‌సైడ్-అవుట్ షాట్లు, స్వీప్‌లతో మైదానం నలువైపులా షాట్లు కొట్టాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టడి చేద్దామని ప్రయత్నించిన ప్రతిసారీ ఒక బౌండరీతో ఒత్తిడిని పటాపంచలు చేశాడు.

దక్షిణాఫ్రికాపై వన్డేల్లో యూసుఫ్ పఠాన్ (68 బంతులు) తర్వాత అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో భారతీయుడిగా రుతురాజ్ నిలిచాడు. చివరకు 83 బంతుల్లో 105 పరుగులు చేసి, స్కోరు వేగం పెంచే క్రమంలో అవుటయ్యాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe