Virat Kohli : విరాట్ కోహ్లీ బ్రేక్ చేయలేని సచిన్ రికార్డులు ఇవి..
రాంచీ శతకంతో కోహ్లీ ఖాతాలోకి మరిన్ని రికార్డులు చేరాయి. ఫలితంగా ఇప్పుడు కోహ్లీ వర్సెస్ సచిన్ రికార్డులపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. మరి కోహ్లీ బ్రేక్ చేసిన సచిన్ రికార్డులు ఏవి? బ్రేక్ చేయలేని రికార్డులు ఏవి?
రాంచీలో దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ చేసిన 135 పరుగులు ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించాయి. ఈ ఇన్నింగ్స్ కేవలం భారత జట్టును కష్టాల నుంచి గట్టెక్కించడమే కాదు.. క్రికెట్ చరిత్రలోని గొప్ప గణాంకాల పోరాటంలో బ్యాలెన్స్‌ను విరాట్ వైపు మరింతగా తిప్పింది! లేటెస్ట్ 100తో కోహ్లీ వన్డేల్లో 52 సెంచరీలు, మొత్తంగా 83 అంతర్జాతీయ శతకాలు సాధించాడు. ఒకప్పుడు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కే సాధ్యమనుకున్న అనేక రికార్డులపై విరాట్ ఇప్పుడు మరింత పట్టు బిగించాడు.

వాస్తవానికి సచిన్ టెండుల్కర్ రికార్డులు ఒక పర్వతం! కోహ్లీతో పాటు ఎవరూ ఆ పర్వతాన్ని పూర్తిగా జయించే పరిస్థితి లేదు! మరి కోహ్లీ ఇప్పటికే బ్రేక్ చేసిన సచిన్ రికార్డులు ఏవి? ఏవి బ్రేక్ చేయడం అసాధ్యంగా కనిపిస్తున్నాయి? ఇక్కడ తెలుసుకుందాము..
కోహ్లీ చేతిలో ఉన్న రికార్డుల జోన్..
కోహ్లీ ఇప్పటికే టెండూల్కర్ నెలకొల్పిన అనేక బెంచ్‌మార్క్‌లను, మరీ ముఖ్యంగా వన్డేల్లో, తుడిచిపెట్టాడు.
అతిపెద్ద రికార్డు: అత్యధిక వన్డే సెంచరీలు. సచిన్ చేసిన 49 సెంచరీలు ఒకప్పుడు అసాధ్యంగా భావించారు. కానీ కోహ్లీ ఇప్పుడు 52 సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచాడు.
ఒక ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా ఇప్పుడు కోహ్లీ (వన్డేల్లో 52) పేరిట ఉంది. ఇది టెస్టుల్లో సచిన్ చేసిన 51 సెంచరీల కన్నా ఎక్కువ!
ప్రెజర్ సిట్యుయేషన్లలో: విజయవంతమైన ఛేజింగ్‌లలో అత్యధిక వన్డే సెంచరీలు, విజయవంతమైన వన్డే ఛేజింగ్‌లలో అత్యధిక పరుగులు, అత్యధిక 50+ స్కోర్లు చేసిన రికార్డులు కోహ్లీ సొంతం. అంతేకాకుండా, స్వదేశంలో వన్డేల్లో అత్యధిక 50+ స్కోర్లలో కూడా విరాట్ ఇప్పుడు సచిన్‌ను అధిగమించాడు.
స్పీడ్ రికార్డులు: 8,000 పరుగుల నుంచి 14,000 వన్డే పరుగుల వరకు, ప్రతి మైలురాయిని అతి త్వరగా చేరుకున్న ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇది సచిన్ టెండూల్కర్ స్పీడ్‌కి మించింది.
ప్రపంచ కప్ రికార్డు: 2023 ప్రపంచ కప్‌లో, కోహ్లీ 765 పరుగులు చేసి, టెండూల్కర్ 2003 ప్రపంచ కప్‌లో చేసిన 673 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.
సచిన్ పేరిట పదిలంగా ఉన్న శిఖరాలు..
మొత్తం కెరీర్ అగ్రిగేట్‌ల విషయానికి వస్తే, సచిన్ టెండూల్కర్ చాలా దూరంలో, చాలా ఎత్తులో, ఆధిపత్యం చెలాయిస్తున్నాడు.
అంతర్జాతీయ పరుగులు: 34,357 అంతర్జాతీయ పరుగులతో సచిన్ ఇంకా క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కోహ్లీ ప్రస్తుతం 27 వేల పరుగుల బ్రాకెట్‌లో ఉన్నాడు.
ఫార్మాట్ వారీగా: సచిన్ చేసిన 15,921 టెస్ట్ పరుగులు, 18,426 వన్డే పరుగులు ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నాయి. టెస్టుల్లో జో రూట్, వన్డేల్లో కోహ్లీ దగ్గరలో ఉన్నప్పటికీ, రికార్డు ఇప్పట్లో బద్దలయ్యేలా కనిపించడం లేదు.
ఎండ్యూరెన్స్, ఇంపాక్ట్: 463 వన్డేలు, 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 2,278 ప్రపంచ కప్ పరుగులు, 62 వన్డే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, అన్ని ఫార్మాట్లలో 76 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు - అన్నీ ఇప్పటికీ సచిన్ పేరిటే ఉన్నాయి.
అవార్డుల రేసు: కోహ్లీ అవార్డుల రేసులో ఛాలెంజర్‌గా ఉన్నాడు. రాంచీలో చేసిన ప్రదర్శన వంటివి కొనసాగించినట్లయితే, అన్ని ఫార్మాట్‌లలోని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ నెంబర్లను కోహ్లీ అధిగమించే అవకాశం ఉంది.
వన్డేలు, ఛేజింగ్‌లు వంటి ముఖ్యమైన మైలురాళ్లలో సచిన్ రికార్డులను కోహ్లీ ఇప్పటికే తన సొంతం చేసుకున్నాడు. ఇంకా కొన్నింటిని తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. అయితే మొత్తం పరుగులు, మొత్తం సెంచరీలు, టెస్ట్ వాల్యూమ్, ప్రపంచ కప్ కెరీర్ అగ్రిగేట్, దీర్ఘకాలిక ప్రయాణం వంటి భారీ రికార్డులు ఇప్పటికీ సచిన్ పేరు మీదే ఉన్నాయి. సచిన్ రికార్డుల పర్వతానికి సమీపంలో కోహ్లీ, రూట్ మాత్రమే ఉన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


