...
...
Next Story

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం: గౌరవ వందనం స్వీకరించిన రష్యా అధ్యక్షుడు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భారత పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం ఉదయం ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశానికి ముందు, ఆయన సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. పర్యటనలో భాగంగా రక్షణ ఒప్పందాలు, వాణిజ్య సహకారంపై చర్చలు జరగనున్నాయి.

Published on: Dec 5, 2025, 12:31:01 IST
Advertisement

భారతదేశ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు శుక్రవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో (ఫోర్‌కోర్ట్) లాంఛనప్రాయ స్వాగతం లభించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం: గౌరవ వందనం స్వీకరించిన రష్యా అధ్యక్షుడు (REUTERS)
పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం: గౌరవ వందనం స్వీకరించిన రష్యా అధ్యక్షుడు (REUTERS)

ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక శిఖరాగ్ర చర్చలకు ముందు, పుతిన్ సైనిక దళాల నుంచి గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) స్వీకరించారు. ఈ వేడుకలో భాగంగా, సైనిక బ్యాండ్‌ సంగీతం ప్లే చేస్తుండగా, కమాండర్ సెల్యూట్ చేశారు. పుతిన్ రెడ్ కార్పెట్‌పై నడుస్తూ వెళ్లి, గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కీలకంగా 23వ భారత్-రష్యా సదస్సు

రాష్ట్రపతి భవన్ వేడుక తర్వాత, పుతిన్ హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో 23వ భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం వ్యాపారవేత్తలతో ఒక సమావేశంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత తిరిగి రాష్ట్రపతి భవన్‌కు వచ్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవుతారు. పుతిన్ సుమారు 24 గంటల పర్యటనను ముగించుకుని శుక్రవారం రాత్రి మాస్కోకు తిరుగు పయనం కానున్నారు.

ఆత్మీయ ఆలింగనం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం న్యూఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పుతిన్‌కు సాదర స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తున్న కళాకారుల సమక్షంలో మోదీ, పుతిన్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. విమానాశ్రయం నుంచి, ఇద్దరు నేతలు ప్రధాని మోదీ అధికారిక నివాసానికి ఒకే కారులో ప్రైవేట్ డిన్నర్ కోసం వెళ్లారు.

పర్యటనలో ప్రధాన అంశాలు ఇవే..

పుతిన్ పర్యటనను ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పశ్చిమ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ సదస్సులో ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది:

  1. రక్షణ బంధాల బలోపేతం: ఇరు దేశాల మధ్య రక్షణ రంగ సహకారాన్ని మరింత మెరుగుపరుచుకోవడం.
  2. వాణిజ్య రక్షణ: బాహ్య ఒత్తిళ్లు లేకుండా భారత్-రష్యా వాణిజ్యాన్ని, చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం.
  3. అణు సహకారం: చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (Small Modular Reactors) విషయంలో సహకారాన్ని పెంచడంపై చర్చలు జరగనున్నాయి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe