volkswagen layoffs : ఆటో రంగంలో ఊచకోత! 1 లక్ష జాబ్ కట్స్‌కు వోక్స్‌వ్యాగన్ సిద్ధం- దిగ్గజ కంపెనీకి ఏమైంది?
ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలోనే అత్యంత భారీ లేఆఫ్స్‌కు జర్మనీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ తెరలేపింది. ఏకంగా 1,00,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు యాజమాన్యం, ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. అమెరికా పన్నుల భారం, చైనా నుంచి చౌక ఈవీల పోటీ, సొంత దేశంలో ఫ్యాక్టరీల మూతపడుతుండటం వంటివి ఇందుకు కారణాలు.
ప్రపంచ కార్ల తయారీ రంగంలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ ఉద్యోగాల కోతకు జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ సిద్ధమైంది. ఈ దశాబ్దం (2030) పూర్తయ్యేనాటికి తమ సంస్థ నుంచి మొత్తం లక్ష మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు యాజమాన్యం, కార్మిక సంఘాలు శుక్రవారం అధికారికంగా ప్రకటించాయి. గ్లోబల్ ఆటో ఇండస్ట్రీ చరిత్రలోనే ఇది అతిపెద్ద పునర్నిర్మాణ ప్రణాళికగా ఈ వోక్స్‌వ్యాగన్ చర్య నిలవనుంది.

గతంలో ప్రకటించిన 50,000 ఉద్యోగాల కోతకు అదనంగా, మరో 50,000 ఉద్యోగాలను తగ్గించే ప్లాన్‌కు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. దానితో మొత్తం వోక్స్‌వ్యాగన్ లేఆఫ్స్ సంఖ్య 1,00,000కు చేరింది. వోక్స్‌వ్యాగన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం సిబ్బందిలో ఇది దాదాపు 15 శాతానికి సమానం. 2009లో అమెరికన్ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ (జీఎం) దివాళా తీసిన సమయంలో ప్రకటించిన 50,000 ఉద్యోగాల కోత రికార్డును కూడా ఈ తాజా నిర్ణయం అధిగమించింది.
వోక్స్‌వ్యాగన్‌ను దెబ్బతీసిన మూడు ప్రధాన కారణాలు..
యూరోప్‌లోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన వోక్స్‌వ్యాగన్ గ్రూప్ (దీని పరిధిలోనే ఆడి, పోర్షే వంటి 10 ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. కంపెనీని ఈ స్థితికి చేరడానికి ప్రధానంగా మూడు అంశాలు కారణమయ్యాయి:
అమెరికా పన్నుల భారం: అమెరికా విధించిన కొత్త దిగుమతి సుంకాలు కంపెనీ ఆదాయాన్ని దెబ్బతీశాయి.
చైనా కంపెనీల పోటీ: ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన చైనాలో స్థానిక విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీదారులు అతి తక్కువ ధరకే నాణ్యమైన ఈవీలను విక్రయిస్తూ వోక్స్‌వ్యాగన్ మార్కెట్‌ను దెబ్బతీశాయి.
విద్యుత్ వాహనాల మందగమనం: యూరప్ మార్కెట్లలో విద్యుత్ కార్లకు ఆశించిన స్థాయిలో డిమాండ్ పెరగకపోవడం కూడా వ్యయాలను పెంచేసింది.
"మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను క్రమబద్ధీకరించుకోవడం సంస్థ మనుగడకు అత్యంత ఆవశ్యకం," అని వోక్స్‌వ్యాగన్ మేనేజ్‌మెంట్ వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా జర్మనీ ఇంజనీరింగ్‌కు ఉన్న క్రేజ్‌ను బట్టి చూస్తే, ఈ నిర్ణయం కేవలం ఐరోపాలోనే కాక ప్రపంచ మార్కెట్లలోనూ కలకలం రేపుతోంది.
జర్మనీ చరిత్రలోనే తొలిసారి: స్వదేశంలోనే ప్లాంట్ల మూతకు రంగం సిద్ధం!
వోక్స్‌వ్యాగన్ 1937లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జర్మనీలోని ఏ ఒక్క ప్రధాన ఫ్యాక్టరీని మూసివేయలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జర్మనీలోని హానోవర్, ఎమ్డెన్, జ్వికావు, నెక్కర్‌సుల్మ్‌లలో ఉన్న నాలుగు ప్రధాన ప్లాంట్ల భవిష్యత్తుకు ఎటువంటి గ్యారెంటీ ఇవ్వలేమని యాజమాన్యం తెలిపింది. ఈ ప్లాంట్లకు ప్రత్యామ్నాయ వినియోగాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంది.
జ్వికావు ప్లాంట్‌లో 2012 నుంచి పనిచేస్తున్న మార్టిన్ లెమాన్ అనే ఉద్యోగి మాట్లాడుతూ.. "ఒకవేళ ఈ ఫ్యాక్టరీ మూతపడితే, మా ప్రాంతపు పటంలో ఒక పెద్ద నల్లటి మచ్చ పడినట్లే. ఈ ఫ్యాక్టరీ, దీనిపై ఆధారపడ్డ సప్లైయర్లు, విడిభాగాల పరిశ్రమలు మొత్తం మా ప్రాంత ఆర్థిక రంగానికి చోదక శక్తులు," అని ఆందోళన వ్యక్తం చేశారు.
యూనియన్ల ఆగ్రహం.. దారికి తెచ్చిన ఒప్పందం!
ఈ ప్లాన్ల బోర్డు ఆమోదం వెనుక తీవ్రస్థాయి వివాదాలు జరిగాయి. అంతర్గతంగా కార్మికులకు చెప్పకుండానే 1,00,000 లేఆఫ్స్ వార్తలు మీడియాకు పొక్కిపోవడంపై పవర్ఫుల్ కార్మిక సంఘం ‘ఐజీ మెటల్’ మండిపడింది. యాజమాన్యం తీరును “చెత్త, అర్థం లేని ఆలోచన” అని అభివర్ణించింది.
అయితే, వోక్స్‌వ్యాగన్ సీఈఓ ఒలివర్ బ్లూమ్ స్పందిస్తూ.. "సూపర్‌వైజరీ బోర్డు ఏకగ్రీవంగా ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రతిపాదించిన ప్లాన్‌కు ఆమోదం తెలిపింది. ఇది కంపెనీ భవిష్యత్తుకు ఒక బలమైన సంకేతం," అని పేర్కొన్నారు.
1960 జర్మనీ చట్టాల ప్రకారం ఫ్యాక్టరీల మూసివేత లేదా తరలింపుపై నిర్ణయం తీసుకోవాలంటే సూపర్‌వైజరీ బోర్డులోని మూడింట రెండు వంతుల సభ్యుల ఆమోదం తప్పనిసరి. ఇందులో సగం సీట్లు కార్మికులకే ఉంటాయి. అయితే, ఈ వీటో అధికారాన్ని సడలించేందుకు, సాధారణ మెజారిటీ పద్ధతిని తెచ్చేందుకు ఒక కొత్త నిర్ణయాధికార నమూనాను అభివృద్ధి చేయాలని బోర్డు ఆదేశించింది.
ఐజీ మెటల్ యూనియన్, లోయర్ శాక్సోనీ రాష్ట్ర ప్రభుత్వం (ఈ రాష్ట్రానికి వోక్స్‌వ్యాగన్‌లో షేర్లు ఉన్నాయి) సంయుక్త ప్రకటన చేస్తూ, "కార్మికుల ప్రతినిధులుగా మేము ఒక ప్రమాదకరమైన ఘర్షణ వాతావరణాన్ని నివారించగలిగాం. మీడియాలో వస్తున్న వార్తల మాదిరిగా ఏ ఒక్క ప్లాంట్‌ను ఇంకా అధికారికంగా మూసివేయలేదు," అని స్పష్టం చేశాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


