మీ ఫోన్ నెంబర్ని హ్యాక్ చేస్తారు.. ఆ తర్వాత బ్యాంక్ ఖాతా ఖాళీ! ఏంటి ఈ సిమ్ స్వాప్ స్కామ్?
ప్రమాదకరమైన 'సిమ్-స్వాప్' మోసాలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. మొసగాళ్లు ముందు మీ నెంబర్ని హ్యాక్ చేస్తారు, ఆ తర్వాత నిమిషాల్లో మీ బ్యాంక్ అకౌంట్‌ని ఖాళీ చేస్తారు! ఇది ఎలా సాధ్యం? ఎలా రక్షించుకోవాలి? పూర్తి వివరాలు..
మీరు ఉదయం కాఫీ తాగుతుండగా, అకస్మాత్తుగా మీ ఫోన్‌కు సిగ్నల్ పోతుంది! కాల్స్ లేవు, మెసేజ్‌లు లేవు, అసలేవీ లేవు. మీరు ఫోన్‌ను రీస్టార్ట్ చేసినా సమస్య అలాగే ఉంటుంది. కొన్ని నిమిషాల తర్వాత, మీ ఈమెయిల్‌కు ఒక బ్యాంకింగ్ అలర్ట్ వస్తుంది! మీ ఖాతా నుంచి డబ్బు మాయమైపోతాయి.. దీనికి కారణం? మీ మొబైల్ నంబర్‌ను దొంగిలించిన ఒక మోసగాడు.

సిమ్-స్వాప్ ఫ్రాడ్ అని పిలుస్తున్న ఈ భయంకరమైన సైబర్‌క్రైమ్ వేగంగా విస్తరిస్తోంది. ఇది నేరగాళ్లకు మీ ఫోన్ నంబర్‌ను యాక్సెస్ చేసే వీలు కల్పిస్తుంది. దీని ద్వారా వారు మీ కాల్స్, టెక్ట్స్‌లు, మీ ఆన్‌లైన్ ఖాతాలను రక్షించే ముఖ్యమైన ఒన్-టైమ్ పాస్‌వర్డ్‌లను అడ్డగించగలరు. ఒకసారి వారు మీ సిమ్‌ని నియంత్రించిన తర్వాత, వారు మీ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయగలరు. మీ ఈమెయిల్‌ను హ్యాక్ చేయగలరు. అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఖాళీ చేయగలరు!
సిమ్-స్వాప్ మోసాలు ఎలా జరుగుతాయి?
సాధారణంగా ఈ మోసాలు డేటా దొంగతనంతో ప్రారంభమవుతుంది.
మోసగాళ్లు ఫిషింగ్ ఈమెయిల్‌లు, నకిలీ కస్టమర్ కేర్ కాల్స్ లేదా లీకైన డేటాబేస్‌ల ద్వారా మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు.
ఈ వివరాలతో, వారు మీలా నటిస్తూ మీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదిస్తారు.
తమ ఫోన్ పోయిందని లేదా పాడైందని నమ్మబలికి, కొత్త సిమ్ కార్డ్ ఇవ్వమని అభ్యర్థిస్తారు.
మొబైల్ ప్రొవైడర్ ఆ కొత్త సిమ్‌ని యాక్టివేట్ చేయగానే, మీ అసలు సిమ్ పూర్తిగా, వెంటనే డెడ్ అవుతుంది. దానితో అటాకర్ మీ నంబర్‌పై పూర్తి నియంత్రణ సాధిస్తాడు.
మీ సిమ్ హైజాక్ అయ్యిందని గుర్తించే సంకేతాలు..
మీ సిమ్ దొంగతనానికి లేదా హ్యాక్‌కి గురైందని చెప్పే సంకేతాలు..
- ఎటువంటి కారణం లేకుండా మీ ఫోన్‌కు అకస్మాత్తుగా నెట్‌వర్క్ సిగ్నల్ కోల్పోవడం.
- మీరు కాల్స్ లేదా మెసేజ్‌లు పంపలేకపోవడం లేదా స్వీకరించలేకపోవడం.
- మీరు ప్రారంభించని పాస్‌వర్డ్ రీసెట్‌లు లేదా అనుమానాస్పద లాగిన్‌ల కోసం మీకు హెచ్చరికలు రావడం.
- మీ సిమ్ మరొక పరికరంలో యాక్టివేట్ అయ్యిందని సందేశం రావడం.
సిమ్- స్వామ్ స్కామ్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?
మీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అకౌంట్‌కు తప్పనిసరిగా పిన్ లేదా పాస్‌వర్డ్ సెట్ చేయండి. దీనివల్ల, ధృవీకరణ లేకుండా ఎవరూ మీ సిమ్‌ని మార్చలేరు.
టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోసం ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే కోడ్‌ల బదులు, ఆథెంటికేటర్ యాప్ (ఉదాహరణకు గూగుల్ ఆథెంటికేటర్)ను ఉపయోగించండి. ఇది హ్యాకర్లు మీ కోడ్‌లను అడ్డగించకుండా నిరోధిస్తుంది.
ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలను అతిగా పంచుకోవడం మానుకోండి.
తెలియని లింక్‌లను క్లిక్ చేయడం లేదా ఓటీపీలను ఎవరితోనూ షేర్ చేయడం చేయవద్దు.
మీ బ్యాంక్, ఈమెయిల్ ఖాతాల్లో అసాధారణ కార్యకలాపాలను గమనించండి. నెట్‌వర్క్ సేవ కోల్పోతే, ఆలస్యం చేయకుండా వెంటనే మీ ప్రొవైడర్‌కు సమాచారం అందించండి. మీరు ఎంత త్వరగా స్పందిస్తే, మోసాన్ని ఆపడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుంది.
మీ మొబైల్ నంబర్ అనేది కేవలం కాంటాక్ట్ వివరాల కంటే ఎక్కువ! ఇది మీ డిజిటల్ గుర్తింపు, ఆర్థిక వివరాలకు తాళం చెవి. దీనిపై నియంత్రణ కోల్పోవడం వినాశకరంగా ఉంటుంది! కానీ అవగాహన, తక్షణ చర్య మిమ్మల్ని ఒక అడుగు ముందు ఉంచుతుంది. మీ సీమ్ని ఒక పాస్‌వర్డ్‌లా భావించండి, ఎందుకంటే నేటి ప్రపంచంలో అది అదే!

E-Paper












