హైదరాబాద్‌లో మెుబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేసిన వారిపై కేసులు 80,555

వాహనాలు నడుపుతున్నప్పుడు వాహనదారులు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడాన్ని నిరోధించడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భారీగా కేసులు బుక్ చేశారు.

Published on: Oct 15, 2025 5:51 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2025 జనవరి 1 నుండి అక్టోబర్ 12 వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీగా కేసులు బుక్ చేశారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడుతున్న వారిపై 80,555 కేసులు నమోదు చేశారు. సోమ, మంగళవారాల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 2,345 కేసులు నమోదు చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం వల్ల దృష్టి మారుతుందని, రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలలో ఇది ఒకటని హైదరాబాద్ నగర అదనపు కమిషనర్ (ట్రాఫిక్) డి జోయెల్ డేవిస్ అన్నారు. ప్రాణం కంటే ఏ కాల్ ముఖ్యం కాదు అని చెప్పారు. ఈ ప్రమాదకర పద్ధతికి దూరంగా ఉండాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.

'వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడటం వల్ల ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లుతుంది.' అని జోయెల్ డేవిస్ అన్నారు.

మెుబైల్ ఫోన్ వాడుతూ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారి కోసం పోలీసులు సోమ, మంగళవారాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రయాణంలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడుతున్న వ్యక్తులపై మొత్తం 2345 కేసులు నమోదు చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై 9010203626, 8712661690 నంబర్లకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తే రూ. 5,000 జరిమానా. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే అధిక జరిమానాలు, కేసులు పెరిగే అవకాశం ఉంది. ఉల్లంఘనలను గుర్తించడానికి AI-ఆధారిత నిఘాను ఉపయోగించి, వివిధ ప్రచారాలు, కఠినమైన నిబంధనలను తీసుకొస్తున్నారు పోలీసులు. అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా లేదా పైన చెప్పిన ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబర్లకు పౌరులు ఫిర్యాదు చేయాలని కోరారు ట్రాఫిక్ పోలీసులు.

నగరవ్యాప్తంగా వాహనదారులు వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పదేపదే హెచ్చరికలు, అవగాహన ప్రచారాలు చేసినప్పటికీ ఈ అలవాటు పెద్ద సమస్యగా మారిందన్నారు.

News/Telangana/హైదరాబాద్‌లో మెుబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేసిన వారిపై కేసులు 80,555
News/Telangana/హైదరాబాద్‌లో మెుబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేసిన వారిపై కేసులు 80,555