WhatsApp : సడెన్‌గా వాట్సాప్ అకౌంట్లు బ్లాక్.. 'అండర్ రివ్యూ' నోటీసులతో యూజర్లకు షాక్!
WhatsApp account under review : ముందస్తు సమాచారం లేకుండా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలువురి వాట్సాప్ అకౌంట్లు ‘అండర్ రివ్యూ’లోకి వెళ్లాయి. 24 గంటల పాటు యాప్ సేవలను పూర్తిగా నిలిపివేయడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది! భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్ల అకౌంట్లు హఠాత్తుగా ‘అండర్ రివ్యూ’ (పరిశీలనలో ఉంది) లోకి వెళ్లాయి. సోమవారం రాత్రి నుంచి దాదాపు 24 గంటల పాటు వాట్సాప్ సేవలను ఈ అకౌంట్లు వినియోగించుకోకుండా సంస్థ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ముందస్తు హెచ్చరికలు లేకుండానే అకౌంట్లు నిలిచిపోవడంతో వేలాది మంది నెటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ సమస్య మొదలైంది. మెటా యాజమాన్యంలోని ఈ వాట్సాప్‌లో ఎలాంటి ముందస్తు నోటీస్ కనిపించకుండానే మెసేజ్‌లు, కాల్స్ వంటి సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్క్రీన్‌పై కనిపించిన సందేశం ఇదే..
అకౌంట్ నిలిచిపోయిన వినియోగదారులకు వాట్సాప్ స్క్రీన్‌పై ఒక సందేశం ప్రత్యక్షమైంది. "మీ అకౌంట్ పరిశీలనలో ఉంది. అభ్యర్థించిన తేదీ: 3 ఆగస్టు 2026. మా నిబంధనలకు కట్టుబడి ఉందో లేదో తనిఖీ చేయడానికి మీ అకౌంట్ కార్యకలాపాలు, డివైజ్ సమాచారాన్ని పరిశీలిస్తున్నాం. దీని ఫలితాన్ని సాధారణంగా 24 గంటల్లోగా మీకు తెలియజేస్తాం," అని ఆ నోటీసులో పేర్కొన్నారు.
దీనితో పాటు 'వాట్సాప్‌ను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలి', 'ఫోన్ లేదా అకౌంట్ చోరీకి గురైతే ఏం చేయాలి' అనే సమాచారానికి సంబంధించిన లింకులను కూడా అందులో అందించారు.
ఈ రివ్యూ సమయంలో వినియోగదారులు మెసేజ్‌లు పంపడం లేదా స్వీకరించడం, వాయిస్/వీడియో కాల్స్ చేయడం వంటి ఏ సేవలను వాడలేకపోయారు.
సోషల్ మీడియాలో పోస్టుల వరద..
వాట్సాప్ నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో తమ ఆవేదనను వెళ్లగక్కారు.
"వాట్సాప్ ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా చాలామంది అకౌంట్లను 24 గంటల పాటు విచారణలో ఉంచింది. దీనివల్ల దాదాపు రోజంతా యాప్ ఫీచర్లేవీ పనిచేయలేదు. ఇండియాలో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు," అని ఒక నెటిజన్ వివరించారు.
“ఎలాంటి కారణం లేకుండానే నా వాట్సాప్ అకౌంట్‌ను బ్యాన్ చేశారు. ఇలాంటి అనుభవం వేరే ఎవరికైనా ఎదురైందా? ఆ తర్వాత ఏం చేయాలో ఎవరికైనా తెలుసా?” అని మరో బాధిత యూజర్ పేర్కొన్నారు.
వాట్సాప్ వివరణ ఇదే..
వాట్సాప్ అకౌంట్ అండర్ రివ్యూ వ్యవహారంపై సంస్థ ప్రతినిధి ఒకరు స్పందించారు. పాలసీలను అమలు చేసే క్రమంలో కొన్నిసార్లు తమ ఆటోమేటెడ్ సిస్టమ్స్ (స్వయంసిద్ధ వ్యవస్థలు) పొరపాట్లు చేసే అవకాశం ఉందని అంగీకరించారు.
“మా ప్లాట్‌ఫామ్‌ను దుర్వినియోగం చేసేవారిపై చర్యలు తీసుకోవడానికి, మిగిలిన వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి మేము నిరంతరం పనిచేస్తుంటాం. ఈ క్రమంలో అప్పుడప్పుడు మా వ్యవస్థల వల్ల పొరపాట్లు జరుగుతుంటాయి. ఒకవేళ తప్పు జరిగిందని గుర్తిస్తే, దాన్ని వీలైనంత త్వరగా సరిదిద్ది వినియోగదారుల అకౌంట్లను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తా,” అని వాట్సాప్ అధికారిక ప్రతినిధి తెలిపారు.
అయితే ఈ లోపం వల్ల ఎంతమంది అకౌంట్లు ప్రభావితమయ్యాయో వాట్సాప్ స్పష్టంగా వెల్లడించలేదు. ఇది సాంకేతిక లోపమా లేక ఆటోమేటెడ్ సిస్టమ్ లోపమా అనే విషయాన్ని కూడా వివరించలేదు. నిర్దోషులైన వినియోగదారుల అకౌంట్లు ఒకవేళ పొరపాటున బ్యాన్ అయి ఉంటే, వాటిని వేగంగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది.
మరోవైపు, ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వేలాది వాట్సాప్ అకౌంట్లలో మీడియా సేవలు పనిచేయలేకపోవడం గమనార్హం. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


